This Guy's Letter To A Thing He Loves Most In His Life Comes With An Unexpected Twist

Updated on
This Guy's Letter To A Thing He Loves Most In His Life Comes With An Unexpected Twist

Contributed By Masthan Vali. K

ప్రియమైన నీకు, నిన్నారాధించే నేను వ్రాయునది. అప్పుడే ఊహ తెలుస్తోన్న వయసు. నాకు గుర్తున్న వరకు అదే నేను నిన్ను మొదటి సారి చూడటం. పక్కనే అమ్మా నాన్నలు కూడా ఉన్నారు. తొలిచూపు, తొలివలపు, తొలిప్రేమ లాంటి ఫీలింగ్స్ కలిగే వయసు కాదది. కానీ ఒకింత పులకరింత కలిగింది, (కలిగుంటుందేమో) అంతే. ఎదో చూసానంటే చూసాను. కానీ ఇన్నేళ్ల తర్వాత నీ గురించి రాసేంతగా నీపై మనసు పారేసుకున్నా అంటే నమ్మకం కుదరట్లేదు. తర్వాత కొన్నిరోజులకి రెండోసారి ఎప్పుడు చూసానో గుర్తులేదు. అప్పుడు కూడా అంతే, పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోవాలని తెలీలేదు అప్పుడు.! అలా చాలా సార్లే చూసాను. ఇంట్లో అమ్మ కూడా నీ గురించి అప్పుడప్పుడు మాట్లాడేది. మాకు బాగా దగ్గరగానే ఉండేది మీ ఇళ్లు. ఎన్ని సార్లు చూసినా మన పరిచయమైతే కాలేదు. అది సిగ్గు, మొహమాటం అని చెప్పను కానీ, మాటలైతే అంత తొందరగా ఇచ్చిపుచ్చుకోలేదు మనం.

నేను కొంచెం పెరిగి స్కూలుకెళ్ళే వయసొచ్చింది. నువ్వూ అందంగా తయారవతున్నట్టు అనిపించింది నాకు. అదెవరికోసమో తెలీదు కానీ, నా కోసమే అన్నట్టు చూసేదానివి. నేను తెగ మురిసిపోయేవాన్ని రోజు నిన్నలా చూసి. ఆ వయసులోనే, అన్నం తినాలనిపించేది కాదు, స్కూలుకెళ్ళాలనిపించేది కాదు, ఎంత సేపైనా నిన్నే తనివి తీరా చూస్తూనే ఉండేవాన్ని, ను కూడా ఇంకొంత సేపు అన్నట్టు నన్నూరిస్తూ వగలు బోయేదానివి, నీకు గుర్తులేకపోవచ్చు బహుశా.! ఒక రోజు తయారైనట్టు ఇంకోరోజు కనపడవు. రోజుకో మెరిసిపోయే ఎంట్రీ ఇచ్చేదానివి. అద్భుతంగా అనిపించేది నిన్ను చూస్తుంటే. నీ నడక, నీ మాట, నీ అలంకరణ అబ్బో చాలా ఉన్నాయ్ లే. అవన్నీ చూసినప్పుడు, నీ సంగతేమో గాని నిన్నంత అందంగా తయారు చేయడానికి మీ అమ్మెంత కష్టపడిందో అని ఆలోచన కలిగేది. కానీ ఏమాటకామాటే అంతటి అందానికి అలంకరణ అయినందుకు ఆ ఆభరణాలెంత సంతోషించేవో మరి.!

స్కూలు దాటి కాలేజీ వయసుకొచ్చాము. ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ, నీ పైన ఒక ఆకర్షణ ఏర్పడింది. నన్నెవరూ అంత సులభంగా లాగేసుకోలేరని మా అమ్మ అంటూ ఉంటుంది. నువ్వు మాత్రం అంచుల్లేని అయస్కాంత క్షేత్రం లా ఎక్కడికెళ్ళినా లాగేసుకునే దానివి. ఎదురెదురుగా ఎంతసేపు కూర్చున్నా, పలుకే బంగారమయ్యేది. మనసులతోనే జరిగేది మన సంభాషణ. కావలసినంత తెలివున్నా... సరిపడినంత సమయం చదువుకోవట్లేదని, సరైన సమయానికి తినట్లేదని, పిచ్చోడిలా ఏదో ధ్యాసలో ఉంటానని ఇంట్లో రోజూ చివాట్లు తప్పేవి కాదు. అంతా నీ వల్లనే అని నిన్నో నాలుగు మాటలనే వారు. 'అవును అంతా నా వల్లనే', అని నువ్వు తెగ నవ్వే దానివి. ఆ మాయలోనే నేను చిక్కుపోయేవాన్ని.

ఆ తర్వాత నేను తప్పు చేసానా అనిపిస్తుంది నాకు. నిన్ను కాస్త నిర్లక్ష్యం చేసేవాడ్ని. కారణాలు చాలా ఉన్నాయ్. నీపై వెచ్చించే సమయం వేరే వాటికి మీదకి మళ్లించాల్సిన అవసరం నాది. మనసు నీ వైపే లాగుతున్నా దాన్నెలానో నచ్చచెప్పుకునేవాడ్ని. అప్పుడే మొదటి సారి మన మధ్య దూరం పెరిగింది. ఆ దూరమే నువ్వంటే నాకెంత ఇష్టమేమో తెలిసేలా చేసింది. అరుదుగా కలుసుకునే ఆ కాస్త సమయంలో మౌనంగా మనం మాట్లాడుకునే మాటలు, అపురూపం. అలానే కొన్ని సంవత్సారాలు గడిపాము. ఆ తర్వాత గానీ తెలిసిరాలేదు నాకు, నేను నీలో ఒక్కటయ్యానని. నిన్ను వదులుకోలేనని. అంతే, అప్పట్నుంచి నిన్నొక్క క్షణం కూడా విడవబుద్ధి కాలేదు. లెక్కలేనన్ని రోజులు నీ చుట్టూ తిరిగేవాడ్ని. ఇదంతా విని నేను కేవలం నీ అందాన్ని మాత్రమే ప్రేమించాననుకోకు. ఎన్ని సార్లు చూసినా చూపు తిప్పుకోనివ్వనంత అందం నీది అన్నది ఎంత నిజమో, నీ లోపల ఉన్న ఆత్మ నాకంతే స్ఫూర్తినిచ్చేది.

ఈ కొద్ది సంవత్సరాల్లో నువ్వెంతో పరిణితి చెందావ్. నిన్ను నిజంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇన్నాళ్లు నేను చుసిన నువ్వు వేరు. ఇప్పడు నిన్ను చూస్తే నీ మీద గౌరవం కలగడం మొదలయ్యింది.

ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను తగ్గించినా ... అప్పుడప్పుడు కలిగే ఆనందాన్ని రెట్టింపు చేసినా... ఎప్పటికప్పుడు జీవితం పై నాలో కలిగే ప్రశ్నల అలజడిని తట్టుకోగలిగినా... ' కోట్ల జనాభా, లక్షల సమస్యలున్న ఈ దేశానికి నా వంతుగా ఏం చేయట్లేదే…? ' అని నాలో కాస్తంత బాధ్యతను తెలియజేసినా, ఒక్కడుగుగు ముందుకేసే అభివృద్ధి ని పదడుగులు వెనక్కు లాగే నమ్మకాల వెనుకున్న మూఢత్వం గురించి నాకు కాస్తో కూస్తో అవగాహన కల్పించినా... ఇలా వీటి వెనుకున్నది ఎవరని అడిగితే తడుముకోకుండా వెంటనే నే చెప్పే సమాధానం 'నువ్వు'.

'నువ్వు' అన్నానని ఇది నీ గురించి రాస్తున్నాననుకోకు! ఇది నా గురించి, పోనీ మన గురించి అనుకుంటా కాసేపు. అదేంటో, ఇంత గాఢమైన అనుబంధం, అంత బిగువైన ముడెలా పడిందో మన మధ్య అని పదే పదే అనిపిస్తుంటుంది. ఎలా పరిచయం అయ్యావో చూచాయగా గుర్తుంది గాని, అప్పుడైతే అస్సలు ఊహించలేదు సుమా నన్నింతలా ప్రభావితం చేయగలవని.

మనవి: ఇది ప్రేమ లేఖ అనుకుంటావేమో. కాదు.! ఏ పేరు పెట్టాలో తెలిట్లేదు ఈ అనుభూతికి. నీకంటే పూర్తిగా నా అస్వాదనను అర్థం చేసుకునే మనసింకెవరికుంది.! నాకో సాయం చేయరాదు...నీకెంతో సులువైనదే. ప్రేమ కన్నా అందమైన అనుభూతి ఏదైనా ఉంటే నా బదులుగా నువ్వే ఎంచుకో, ఇది ఆ అనుభూతిని పంచుకునే లేఖ.

ఇట్లు సినీ అభిమాని