What if.. Alcohol And Lord Yama Have A Talk With Each Other?

Updated on
What if.. Alcohol And Lord Yama Have A Talk With Each Other?

Contributed By Doli Veera Durga

30వ రోజు… అందరి మనసులలో విషాద ఛాయలు అలుముకున్నాయి, వారిద్దరూ రాకపోయినా, మనం వెళ్లిపోదాం..! అంటూ అనుచరులంతా మద్యపానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రేపటిలోగా యముడి దగ్గరకు వెళ్లకపోతే శిక్ష రెట్టింపు అవుతుంది అన్న ఆలోచనే మద్యపానాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది.. చేసేదేమీ లేక ప్రయాణానికి మద్యపానం కూడా సిద్ధం అయ్యింది... గత నెల రోజుల ముందు నుండి జరిగిన విషయాలన్నీ మద్యపానానికి కళ్ళముందు స్పష్టంగా కదులుతున్నాయి...

శిష్యా... పాపులను ప్రవేశపెట్టు… పాపం చేయాలంటే నరుడి వెన్నులో వణుకు పుట్టేలా, మస్తిష్కం లోని మబ్బు వదిలేలా, భయంకర శిక్షలను విధించి, ఈ నరక లోక సామ్రాజ్య అధిపతి “యముడి” గొప్పతనాన్ని ముల్లోకాలు హర్షించేలా చేసెదా… ప్రభూ… ఎప్పటిలాగే పాపులు అందరిలో మద్యపానం సేవించి పాపాలు చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. మన ఆనవాయితీ ప్రకారం - మద్యపానం సేవించి పాపం చేసిన వారి కంటే ముందు ,మద్యపానాన్ని దాని అనుచరులైన బ్రీజరు, బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను లను శిక్షిద్ధామా..? ప్రభూ..! అటులైన, ఆ నీచపు మద్యపానాన్ని, దాని నికృష్టపు అనుచరులను వెంటనే ప్రవేశపెట్టుము.. చిత్తం ప్రభూ…

మద్యపానం దాని అనుచరులు అందరూ, యమధర్మరాజు మహాసభలోకి వచ్చి పక్కగా నిలబడి ఉన్నారు.మద్యపానం యముడితో, ప్రభూ, నరులు చేసిన తప్పులకు, చేస్తున్న తప్పులకు, మమ్మల్ని కొన్ని వేల సంవత్సరాలుగా శిక్షించడం అన్యాయం. ఇకనైనా మమ్మల్ని క్షమించి విడిచి పెట్టండి.. అంటూ తన ఆవేదనను చెప్పుకుంది. యమధర్మరాజు : మనిషి జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, చదువులో, ఇలా అన్నింటా చిచ్చుపెట్టి, ప్రశాంతమైన జీవితాన్ని చిందరవందర చేసి, ఆర్థికంగా, సామాజికంగా, దిగజార్చి, చివరకు ప్రాణాలను బలిగొనే నీకు, నీ అనుచరులకు క్షమా బిక్ష పెట్టుటయా..! అది కలలోనైనా అసాధ్యం.. అన్నాడు.

దేవా ….మమ్మల్ని విక్రయించే ప్రదేశాలలో మద్యపానం హానికరం అని బోర్డులు పెట్టి అమ్ముతారు, “మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని మా బాటిళ్లపై అతికించుకున్నాము. అయినా సరే ప్రజలు లెక్క చేయకుండా మద్యపానాన్ని సేవిస్తారు, లాభాలు గడించడానికి ,అవినీతి సొమ్ము వెనకేసుకోవడానికి ప్రభుత్వాలు మద్యపానం నిషేధించకుండా... ఇష్టం వచ్చినట్లు తయారు చేసి, పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజలు ,తెలిసి కొందరు తెలియక కొందరు చేస్తున్న తప్పులకు అన్యాయాలకు మమ్మల్ని శిక్షించడం చాలా బాధాకరం అని బ్రాందీ.. అంది.

ఇంతలో మద్యం తాగి తప్పులు, అన్యాయాలు, నేరాలు చేసిన పాపులు అక్కడికి రావడంతో సభ మొత్తం నిండిపోయింది …. వారిని చూసి యముడు… ఏమీ దౌర్భాగ్యం శిష్యా.. ఈ మద్యపాన బాధిత పాపులు, రోజురోజుకి ఎక్కువ అవుతున్నారు కానీ తగ్గడం లేదు. అసలు మనిషి మద్యపానం ఎందుకు తాగుతాడో..? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో..? ఎవరు ఎన్ని పరిశోధనలు చేసినా కనిపెట్ట లేక పోతున్నారు.. అని అంటూ ఉండగా ఇంతలో విస్కీ కలగజేసుకుని, ' దేవా... మాకు ఒక అవకాశం ఇవ్వండి.,ఈ సమస్యకు కారణాలు, పరిష్కారాలు తెలుసుకుని వచ్చి ఒక సమగ్ర నివేదికను మీకు సమర్పిస్తాం '.. అంది.

మీరు ఈ విషయంలో మాకు సహకరించిన యెడల, మీకు విధించే శిక్షలు తగ్గించే ఆలోచన చేసేదా… ఈ కార్యాన్ని నిర్వర్తించడానికి మీకు ఒక్క మాసం గడువు ఇచ్చుచున్నాను. ఈ లోపు మీరు నేనడిగిన సమాచారమును తీసుకువచ్చి నాకు సమర్పించవలే, లేదా మీ శిక్షలు రెట్టింపగును..జాగ్రత్త !అని యముడు హెచ్చరించి, వారికి ఒక వరం ఇచ్చాడు.. “ఈ నెల రోజులు మీరు కోరుకున్న రూపం ధరించగలరు”, విజయీభవా! అని ఆశీర్వదించి మద్యపానాన్ని, దాని అనుచరులను భూలోకానికి పంపాడు.

మార్గమధ్యంలో మద్యపానం తన అనుచరులతో ఈ విధంగా అంది ,మన దగ్గర ఒక్క మాసం గడువు మాత్రమే ఉంది, ఈ లోగా యమధర్మరాజు మనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. ఇంతలో బీరు... అందరూ కలిసి మొత్తం పనిని చేసే కన్నా, పనిని కొన్ని భాగాలుగా విడగొట్టి అందరం పంచుకొని చేద్దాం అంది.విస్కీ.. తన తెలివిని ఉపయోగించి, మందు తాగే వారిని ఈ క్రింది వర్గాలుగా విభజించింది: 1.తెలుసుకోవాలనే ఆసక్తి/ సరదా కోసం తాగే వారు 2. ఒత్తిడి/బాధ/భయం పోవడానికి తాగేవారు 3.అనారోగ్యం / బానిసత్వం వలన తాగేవారు మొదటి వర్గానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకురావడానికి మేము వెళతాము అని బీరు, బ్రీజరు ముందుకు వచ్చాయి, రెండవ వర్గాన్ని బ్రాందీ విస్కీ లకు,మూడవ వర్గాన్ని రమ్ము, జిన్నులకు అప్పగించింది మద్యపానం.

1వ రోజు… వీరంతా భూలోకం చేరుకుని, సరిగ్గా నెల రోజుల లోగా మళ్లీ అందరూ యిక్కడే కలుసుకోవాలని, నరక లోకానికి పయనమవ్వాలని నిశ్చయించుకొన్నారు. మీ రాక కోసం ఎదురు చూస్తూ, ఇక్కడే ఉంటాను జాగ్రత్తగా వెళ్లి రండి..! అని మద్యపానం, తన అనుచర బృందాన్ని సాగనంపింది.

7వ రోజు… ఎక్కడికి వెళ్లాలో.. ఏమి చెయ్యాలో.. బీరు బీజర్లకు పాలుపోవడం లేదు. అప్పుడే వారంరోజులు గడిచిపోయాయి, ఇంతలో ఒక బారు కనపడింది. వెంటనే లోపలికి వెళ్లారు,అక్కడ నలుగురు కుర్రాళ్ళు కూర్చుని, బీర్లు, బ్రీజర్లు తాగుతూ కనపడ్డారు. వెంటనే బీరు, బ్రీజర్ అందమైన యువకుల రూపం లోకి మారిపోయి, ఆ నలుగురితో కలిసి పరిచయం పెంచుకుని మాట్లాడసాగారు.

ఆ నలుగురిలో మొదటివాడు. ' మామా, నేను బ్రీజర్లు తాగడం మొదలు పెట్టాక గ్లామర్ పెరిగాను', అన్నాడు. అప్పుడు బ్రీజర్ మనసులో, గ్లామర్ కి మిత ఆహారం, సరైన నిద్ర, మొహంపై చిరునవ్వు ఉంటే చాలు, నన్ను తాగడం దేనికి అనుకొంది. రెండవ వాడు.. అలా అయితే నేను బీరు తాగాకా, బాగా లావు అయ్యాను అన్నాడు. దానికి బీరు ఆశ్చర్య పోయింది. మూడవ వాడు... నాకు అసలు ఈ అలవాటే లేదు కదరా ,మీరే నాకు బలవంతంగా అలవాటు చేశారు, నాల్గవ వాడు... నన్నయితే ఎవరూ ప్రోత్సహించలేదు కానీ, బీరులో - బ్రీజరులో ఏముందో తెలుసుకోవాలని ,సరదాగా టైంపాస్ కోసం తాగడం మొదలు పెట్టా.. అయినా మనం కూడా బీరు తాగుతాం అని ఫ్రెండ్స్ దగ్గర, అందరిలో చెప్పుకోవడానికి బాగుంటుంది. పైగా వీటి వల్ల తక్కువగా కిక్కు ఎక్కుతుంది కాబట్టి, ఇంట్లో వాళ్లకి తెలిసే ప్రమాదం ఉండదు అన్నాడు. ఈ కారణాలను విన్న, బీరు - బ్రీజరు అక్కడ నుండి వెను తిరిగారు.

8వ రోజు ... ఆ నలుగురి మాటలను దృష్టిలో ఉంచుకుని బీరు, బ్రీజరు ఈ మధ్యపాన సమస్యకు పరిష్కారాలు ఈ విధంగా రాసుకున్నారు : 1.యువత సరదా కోసం, టైంపాస్ కోసం, ఫ్రెండ్స్ కలిసి నప్పుడు - వేరే ఏదైనా ఇతర మార్గాలను అన్వేషించాలి కానీ బీరు , బ్రీజరు వంటి మత్తు పానీయాలకు అలవాటు పడకూడదు. 2.బీరు తాగితే బరువు పెరుగుతారు, వల్లు వస్తుంది అని, బ్రీజర్ తాగితే గ్లామర్ పెరుగుతుందనే వదంతులను నమ్మకూడదు. ఈ విషయంపై ప్రసార మాధ్యమాలు తమ తమ చానళ్ళలో ప్రచారం చేయాలి. 3.ప్రభుత్వం బీరు, బ్రీజర్ల తయారీని, పంపిణీని తీవ్రంగా వ్యతిరేకించి, అరికట్టి నిషేధించాలి. 4.తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇచ్చిన డబ్బులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో, అనుక్షణం తల్లిదండ్రులు సమీక్షిస్తూ ఉండాలి. 5.సినిమాలలో, సీరియళ్లలో, నవలలలో పాత్రలను చూసి మరియు ఇతర దేశాల వారిని చూసి అనవసరంగా ఇటువంటి దురలవాట్లకు బానిసలు కాకూడదు అని అందరూ గుర్తించాలి.

23వ రోజు… ఇన్ని రోజులు గడిచినా ఎటువంటి సమాచారాన్ని సేకరించలేదని పాపం రమ్ము, జిన్ను ఆవేదన చెందుతున్నాయి. ఇంతలో వారికి రోడ్డుపక్కన రీ- హేబిటైజేషన్ సెంటర్ ఒకటి, కంట పడింది. వెంటనే ఇద్దరూ లోపలకు వెళ్లారు. అక్కడ గదిలో ఒక సార్ మద్యపాన బాధితులకు కౌన్సెలింగ్ క్లాస్ తీసుకుంటున్నాడు. వెంటనే ఆ సార్ శరీరాన్ని ఆవహించింది…రమ్ము. మీరు మందు ఎందుకు తాగుతున్నారు..? అని రమ్ము వాళ్లను ప్రశ్నించింది. అందుకు సమాధానంగా.. నిద్ర పట్టడం లేదు సార్ అని ఒకరు, కాళ్లు చేతులు వణుకుతున్నాయి అని ఇంకొకరు, మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది సార్ అని, టైముకి మందు పడకపోతే మనసు, శరీరం సహకరించడం లేదు సార్ అని, మానాలని ఉన్నా సంకల్ప బలం లేకపోవడం చేత తాగుతున్నామ్ అని, నరాలు బలహీన పడిపోయాయి తాగకుండా ఉండలేం.. అంటూ రకరకాల సమాధానాలు వినిపించాయి.

ఈ కారణాలన్నింటిని, పక్కనే ఉన్న జిన్ను రాసుకుంది. ఇద్దరూ అక్కడ నుండి వచ్చేశారు, 24 వ రోజు… ఈ సమస్యలను ప్రజలు అధిగమించడానికి రమ్ము, జిన్ను కొన్ని మార్గాలను రాసుకున్నారు అవి: 1. మందును తయారు చేసే ప్రభుత్వమే మందు మానడానికి కూడా మందును తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి. 2.మందు తాగక పోవడం వలన, తమకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రీ-హేబిటైజేషన్ సెంటర్ కి కానీ లేదా ఎవరైనా డాక్టర్ దగ్గరకు కానీ వెళ్లి, వైద్యం చేయించుకోవాలి. 3. మందును పూర్తిగా ఒక్కసారే ఆపేయకుండా కొంచెం కొంచెంగా మానేయాలి. 4. మందు తీసుకునే సమయంలో.. మందు కి బదులుగా ఫ్రూట్ జ్యూస్ లను కానీ, కూల్ డ్రింక్లను కానీ తీసుకుంటూ , బలం కొరకు పోషకాహారాన్ని తినాలి.

25 వ రోజు... తమ సమాచారాన్ని తీసుకుని రమ్ము,జిన్ను వెంటనే మద్యపానం దగ్గరకు బయలుదేరాయి.ఇవి వెళ్ళేటప్పటికి అక్కడ మద్యపానం, బీరు మరియు బ్రీజర్లతో మాట్లాడుతూ ఉంది. అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా బ్రాందీ,విస్కీ ల ప్రస్తావన వచ్చింది. ఇంకా సమయం ఐదు రోజులు మాత్రమే ఉంది, బ్రాందీ, విస్కీ ఎక్కడున్నాయో?ఏం చేస్తున్నాయో? అని అందరూ కంగారు పడుతున్నారు.

26,27,28,29… రోజులు గడుస్తున్నాయి కానీ బ్రాందీ విస్కీల జాడ ఏమాత్రం కనపడటం లేదు. ఇంతలో బ్రాందీ ,విస్కీ పరిగెత్తుకుంటూ అక్కడికి రావడం చూసిన అందరూ సంతోషంతో గోల చేశారు, ఆ శబ్దాలకు ఈ లోకం లోనికి వచ్చిన మద్యపానం, మీకు ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందని బ్రాందీ, విస్కీ లను అడిగింది. మీరు మాకు కేటాయించిన ఒత్తిడి/ బాధ/ భయం వలన తాగే వర్గం ప్రజలను, వారి జీవన విధానాన్ని, కుటుంబ సమస్యలను, బాధలను అన్నింటిని దగ్గరుండి గమనించి ఒక నిర్ధారణకు వచ్చాము. అది ఏమిటంటే ఈ వర్గానికి చెందిన వారు తాగడానికి ముఖ్య కారణాలు: అప్పులు చేసి తీర్చలేక పోవడం, ప్రొద్దుట నుండి ఉద్యోగం, వ్యాపారం చేసి పని భారానికి గురవడం, ప్రేమలో చదువులో ఉద్యోగంలో ఇలా ఎందులో విఫలమైనా, మోసానికి గురి అయినా కలిగే బాధను మర్చిపోవడానికి, చేసిన తప్పులకు శిక్ష పడుతుందన్న భయంతో, తాగితే భయం బాధ ఒత్తిడి బయటకు పోతాయన్న మూఢ నమ్మకం ఉండటం చేత, మత్తు ప్రపంచాన్ని ఇష్ట పడటం వలన.

ఈ సమస్యను ఎదిరించాలంటే ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు: 1. తాగినప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలగవచ్చు ఏమో గాని మళ్లీ తెల్లారితే అవే సమస్యలు వెంటాడుతాయని వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రజలు గుర్తించాలి. 2. మత్తు ప్రపంచాన్ని కోరుకోవడం అంటే సమస్య నుండి దూరంగా పారిపోవటం మాత్రమేనని, దీని వలన సమస్య పరిష్కారం కాదని ,పైగా తాగుడు వలన కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ అర్థంచేసకోవాలి. 3. బాధ భయం వత్తిడి ఎందుకు వస్తున్నాయో విశ్లేషించుకుని, నివారణ చర్యలను చేపట్టాలి గాని మందును ఆశ్రయించకూడదు. అని బ్రాందీ, విస్కీ చెప్పడం పూర్తిచేశారు. అందరూ కలిసి నరకలోకానికి బయలుదేరారు.

31 వ రోజు... తన పరివారం సాధించిన సమాచార నివేదికలను చూసి మద్యపానం గర్వపడింది. ఇంతలో నరకలోకం సమీపించింది, అందరూ గర్వం నిండిన గుండెలతో నరక లోక నేలపై కాలు మోపారు…