ఒక మహావృక్షమై నీడనిచ్చి, పండ్లు ఇచ్చే చెట్టు మధ్యలోనే చచ్చిపోయింది.. మన దౌర్భగ్యం ఏంటంటే ఏ గొప్ప వ్యక్తి అయిన ఒక వర్గంలో పుడితే చాలు ఇతను మా కులమే, మా మతమే అంటూ ప్రచారం చేసుకుని బ్రతుకుతారు కొంతమంది. అలాంటి కొంతమంది వ్యక్తుల మూలంగా ఎందరో గొప్ప నాయకులు, మంచి వ్యక్తుల గురించి పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా చూసే పరిస్థితికి దిగజారుతుంది.. "వంగవీటి మోహన రంగా" అనే వ్యక్తి ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు.. తన సొంత ఎజెండానే ప్రజల జెండాగా స్వార్ధంగా వాడుకోలేదు. చచ్చి 28 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.? అభిమానుల గుండెల్లో ఇంకా ఎందుకు బ్రతికున్నారు..? ఏ గతంతో ఇప్పటికి శత్రువుల గుండెలని ఆయన భయపెడుతున్నారు.?
గొప్ప వ్యక్తులలో ఉండే కొన్ని గొప్ప లక్షణాలు నేర్చుకోవడం వల్ల రావు, పుట్టుకతోనే వస్తాయి.. సూర్యుడు వేరు సూర్యుడి నుండి వచ్చే వెలుగు కిరణాలు వేరు కావు అన్నట్టు వంగవీటి మోహన రంగా అప్పట్లో ఉండే కొంతమంది అవినీతి నాయకులపై పోరాడే సమయంలో తనతో పాటు తన సైన్యాన్ని కూడా తనదైన శైలిలో నడిపించారు. ఎక్కడ దోపిడి రాజ్యమేలుతుందో అక్కడ ధ్యైర్యం గల వ్యక్తి ఉదయిస్తాడు. ఒక పక్క దోపిడి దారులపై, అవినీతి నాయకులపై పోరాడుతూనే పేదలకు ఇంటి స్థలాలను అందించారు రంగా గారు. రంగా గారు పుట్టింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో. "వంగవీటి మోహన రంగా ఓ అనామకుడు వాడికి విలువివ్వడమేంట్రా అనే నాయకులకు తన పోరాట ఎదుగుదలతో వారినే కాదు యావత్ తెలుగు ప్రజలందరిని తన గురించి మంచిగా మాట్లాడుకునేలా చేశారు".
పేదల బ్రతుకులు బాగుచేయండి అని అంటే చేయరు కాని ఎవరైనా ఒక నాయకుడు వారికి పోటిగా ఎదుగుతుంటే వారిపై ఆరోపణలు, హత్యలు, దాడులు.. ఇది ఇప్పటినుండే కాదు ఎప్పటినుండో జరుగుతూ వారసత్వంగా కొనసాగుతున్న అనాగరికం. విజయవాడ అంటే ఇప్పుడు మనం దుర్గమ్మ తల్లి కొలువైన పవిత్ర పుణ్య స్థలం అని అనుకుంటున్నాం కాని 30 సంవత్సరాల క్రితం అలా లేదు. "రాయలసీయ అంటే ఫాక్షనిజం ఎలానో రౌడియిజం అంటే బెజవాడ" అనేంతలా సాగింది కొంతకాలం.
వంగవీటి ప్రస్థానం: సిపిఐ నాయకుడు చలసాని వెంకట రత్నం గారితో మెదట వంగవీటి కుటుంబానికి మంచి అనుబంధం ఉండేది.. కాని కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు, ఘర్షణలకు, హత్యలకు దారితీసింది. చలసాని వెంకటరత్నం హత్యకు సంబంధించి వంగవీటి మోహన రంగ అన్న ఐన వంగవీటి రాధ కృష్ణ జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు రాధ కృష్ణను ప్రత్యర్ధులు చంపేశారు. అప్పుడు జరిగింది వంగవీటి మోహన రంగా ఎంట్రి.
వంగవీటి మోహన రంగా ఎంట్రితో బెజవాడ రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి. మోహన రంగా రాక ముందు, వచ్చాక, వెళ్ళిపోయాక అనే పరిస్థితులు బెజవాడలో ఏర్పడ్డాయి. వంగవీటి మోహన రంగా, గాంధీ, దేవినేని నెహ్రు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు కాని ఆధిపత్యం పోరుతో ఒకరి గ్రూప్ లోని అనుచరులను మరొకరు హత్యలు చేసేంతటి కక్షలకు దారితీసింది. 1979లో దేవినేని గాంధీ హత్య తరువాత దేవినేని కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే(1983), మరో వైపు మోహన రంగా 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున ఎమ్.ఎల్.ఏ గా ఎన్నికయ్యారు. ఇక అప్పటినుండి వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొదటి ఐదుగురు గొప్ప నాయకులలో రంగా కూడా ఒకరు అన్నంతలా ఎదిగారు. తనని నమ్ముకున్న వారికి అండగా ఉంటూ, తన నియోజిక వర్గంలోని ప్రజలకు ఎంతగానో సేవచేశారు. అప్పటి వరకు రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నత పదవుల్లో ఉండేవారు కాని రంగా నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు లక్షలాది జనం రాకతో కొంతమంది నాయకులకు వెన్నులో వణుకు పుట్టింది. అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు రంగా పోరాటం చేశారు. కేవలం పేదలకు, వెనుక బడిన కులాల తరుపున మాత్రమే కాకుండా ఆఖరికి పోలీసు సమస్యలపై కూడా తనదైన శైలిలో పోరాడారు. దేవినేని గాంధీ హత్య కేసులో నిందితులైన కొంతమంది రంగా అనుచరులను దేవినేని వర్గం హత్య చేయిస్తే దానికి ప్రతీకారంగా దేవినేని మురళిని రంగా వర్గం హత్య చేయించింది. ఇంకో పక్క దేవినేని మురళి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రత్యర్ధి వర్గం రంగా హత్యే ఎజెండాగా ముందుకు కదిలింది. అప్పటికే మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేసి నీరసించిన రంగాను 1988 డిసెంబర్ 26 నాడు అతని అనుచరులను తెల్లవారు జామున వేటకొడవళ్ళతో కిరాతకంగా చంపేశారు.
వంగవీటి మోహన రంగా హత్య కేవలం ఒక్క జిల్లాకే పరిమితం అవ్వలేదు. 4 జిల్లాలు అట్టుడికి పోయాయి.. రాష్ట్రమంతటా ఉద్రిక్తతతో ఉంటే ఒక్క బెజవాడ మాత్రం గజ గజ వణికింది. ఆయనకున్న అశేష అభిమానులు తల్లడిల్లిపోయారు. దాదాపు 2 నెలలపాటు కర్ఫ్యూ విధించారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆయన మరణం ఎంతటి మారణ హోమాన్ని తీసుకువచ్చిందో అని. ఆ మారణహోమం 42 ప్రాణాలను బలికొన్నది. దాదాపు 110కోట్ల ఆస్థి నష్టం, 700బస్సులు, 125 పోలీసు జీపులు వారి ఆగ్రహానికి బలి అయ్యాయి..! కత్తి పట్టినోడిని చివరికి ఆ కత్తే తెగ నరుకుతుంది అన్నట్టు.. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక వ్యక్తిలో ఎన్ని గొప్ప లక్షణాలున్నా గాని హింసా మార్గం ఎంచుకున్న వారికి చివరికి ఆ హింసే అతన్ని మింగేస్తుంది..
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.