This Short Story Perfectly Describes Life After Love & Failure

Updated on
This Short Story Perfectly Describes Life After Love & Failure

Contributed by Masthan Vali ఆ రోజు ఆదివారం కావడంతో రామ్ లేచీ లేవగానే ఆఫీసుకు రెడీ అయ్యే అవసరం లేక పోయింది. కానీ ఉదయాన్నే లేచే అలవాటు ఉండటంతో 6 గంటల కల్లా మెలకువ వచ్చింది. బాల్కనీ లో కూర్చుని ప్రశాంతంగా ఉన్న సూర్యోదయపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎదో ఆలోచిస్తున్నాడు.

' ఏంటి రామ్, నువ్వు డైరీ రాయవా...? ' ఎప్పటివో మాటలు వినబడ్డాయి అతనికి. ఆ మాటల వెంటనే ఒక గత కాలపు జ్ఞాపకం.

' ఏంటి రామ్, నువ్వు డైరీ రాయవా...? ' McDonald's లో ... Burger లాంటి బుగ్గలున్న అమ్మాయి తనకెదురుగా ఉన్న రామ్ ని అడుగుతోంది. ' ఈ రోజుల్లో కూడా డైరీ ఎవరు రాస్తారు? ' Coke సిప్ చేస్తూ బదులిచ్చాడు రామ్. ' నేను రాస్తున్నా కదా. జ్ఞాపాకాలు చిన్నవే కావచ్చు రామ్, కానీ చాలా విలువైనవి. నువ్వు కూడా రాయ్ ' అని ముగించింది.

ప్రస్తుతం: రామ్ వెంటనే లేచి పరుగున వెళ్లి తాను దాచుంచిన డైరీ ఓపెన్ చేసాడు. అందులో " కల " అని పెద్ద అక్షరాలతో ఓ పేరు. రెండు సంవత్సరాల క్రితం రాసిన డైరీ అది. దాన్ని చదివాక, అతని జీవితం మొత్తం తెలియకున్నా... తనే జీవితం అనుకున్నవ్యక్తి ప్రేమ గురించి తెలుస్తుంది. ఒకసారి జ్ఞాపకాలని తడిమి చూసుకోవాలనిపించి చదవడం మొదలు పెట్టాడు.

19-03-2017 ఈ రోజు కల తో కలిసి McDonald's కి వెళ్ళాను & ఈ రోజు నుంచి డైరీ రాయడం మొదలు పెట్టాను. చూద్దాం ఎంత వరకు Continue చేస్తానో.!

25-03-2017 తన Birth Day ఈ రోజు. ఏదో అనుకున్నా గానీ, నాకు ఓ మోస్తారు Taste ఉందని నేనిచ్చిన Gift చూసాక తను Excite అయినప్పుడు తెలిసింది. ఇంకా సినిమాకెళ్ళాము. సిటీ అంతా చక్కర్లు కొట్టి, చివరిగా ఒక్కసారి విష్ చేసాను. ' నీ కళ్ళలో ప్రేమకనిపిస్తోంది ' అని చెప్పి వెళ్ళిపోయింది. Happy Birthday Dear.!

05-05-2017 కలతో గొడవ పడ్డాను. తప్పు తనదే.! అయినా వినదు. నేనా విషయం చెప్పలేకున్నా. తను నన్ను తిడుతూనే ఉంది, చాలా సేపాటి దాక. మౌనంగా ఉండిపోయా.

06-05-2017 ఈ రోజు ఉదయం లేచే సరికి ఓ మెసేజ్ తన నుంచి. ' సారీ రామ్, హర్ట్ చేసాను ' అని. నేనంటే తనకెంత ఇష్టమో మళ్ళీతెలిసొచ్చింది నాకు. Love You.

12-08-2017 మా ఫస్ట్ Long Drive.Yes, అరకు వెళ్ళాం. ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నామిద్దరం. తను నిద్రపోతోంది. ఇదొక మరుపురాని ప్రయాణం. గంటలు నిమిషాల్లా మారిపోయాయి అంటే అతిశయోక్తి అనిపించినా, ఇదే నిజం.

25-12-2017 ' Merry Christmas ' అని మెసేజ్ చేసింది. తనకే కులమత బేధాల్లేవ్. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడటానికి గల ఒక కారణం. అన్ని పండుగలకు విష్ చేస్తుంది.!

01-01-2018 కొత్త సంవత్సరం. మా ప్రేమను పెద్దలకు తెలియజేయాలిఅనుకున్నాం. తన ఇంట్లో ఎప్పుడో ఒప్పుకున్నారట.! ఇక మిగింలింది మా వైపు నుంచే.! ‘రేపేమాట్లాడదాం రామ్, నన్ను పరిచయం చెయ్’ అంది తను.

02-01-2018 Tension + Happiness కలిపిన ఫీలింగ్. కల ను ఇంటికి తీసుకెళ్ళాను. ‘నాన్న, నా ఫ్రెండ్...’ అని తనను పరిచయం చేయగానే... తను ‘హలో అంకుల్, ఫ్రెండ్ మాత్రమే కాదు. మేమిద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం…’ అని చెప్పేసింది గల గలా.! అది మా నాన్న కంటే నన్నెక్కువ ఆశ్యర్యపరిచింది. తన తల్లితండ్రులతో ఫోన్ లో మాట్లాడిచ్చింది.

24-02-2018 నా పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతకంటే ఎక్కువ రాయలేని క్షణం ఇది. ఇక రాయడం ఆపేయాల్సిన సమయం ఇది.

" ఏవండీ, ఓ సారి ఇలా వస్తారా..." భార్య కిచెన్ లో నుంచి పిలుస్తూ అరుస్తోంది.రామ్ ఎటువంటి బదులు ఇవ్వలేదు... అతనికి ఆమె మాటలు వినిపించట్లేదు. రెండు మూడు సార్లు ప్రయత్నించాక ఇక లాభం లేదనుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. డోర్ తీయగానే, డైరీ క్లోజ్ చేసాడు కంగారుగా.

" ఎన్ని సార్లు చదువుతారా పుస్తకాన్ని. అందులో ఏముందంటే చెప్పరు... బయటికి వెళదాం అనుకున్నా కదా..." గోముగా గుర్తు చేసింది. ముఖం పై నవ్వు తెచ్చుకుని, " ను బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్, నేనూ 10మినిట్స్ లో రెడీ అయి వచ్చేస్తా " అంటూ కదిలాడు, డైరీ ని అక్కడే వదిలేసి. రామ్ వెళ్ళగానే, ఏమై ఉంటుంది అని క్యాజువల్ గా ఆ డైరీ ఓపెన్ చేసింది.

మొదటి నుంచి మొత్తం చదివింది. 24-02-2018 నా పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతకంటే ఎక్కువ రాయలేని క్షణం ఇది. ఇక రాయడం ఆపేయాల్సిన... ఆ చివరి వాక్యం మాత్రం సరిగా చదవలేక పోయింది తను. కాగితపు రాతలపై నీటి బొట్టు రాలినప్పుడు ఉండేటువంటి అస్పష్టత ఉందక్కడ. చదివాక, ముందు అర్థం కాలేదు. తర్వాత చేయాల్సింది అర్థం అయ్యింది. ఫ్రెష్ అప్ అయ్యాక, డైరీ చూసుకున్నాడు రామ్. ' తన తో కలిసి బయటికెళ్తున్నా ' అని రాసుంది. మళ్ళి మళ్ళీ చదివాడు.

"ఊహ, ఊహా..." భార్యను పిలిచాడు కోపం కలగలిసిన గొంతుతో. ఎప్పుడూ అంత గట్టిగా అరవని రామ్ గొంతు విని ఊహ కంగారు పడలేదు, డైరీ చూసాడని అర్థం చేసుకుని భర్తను చేరింది. " ఏంటిది...? " డైరీ చూపిస్తూ ప్రశ్నించాడు. " అదే, మనం బయటికి వెళ్తున్నాం కదా... మీరు మర్చిపోతారేమో అని నేను రాసాను " బదులిచ్చింది తను. " డైరీ అంతా చదివావా...? " "హా, చదివాను " కాసేపు మౌనంగా ఉన్నారిద్దరు. రామ్ కంట నీరు తిరిగాయి. ఒక్కసారిగా మంచం పై కూలిపోయాడు అతను. " రామ్ " అంటు అతన్ని పట్టుకోబోయింది ఊహ. తన దుఃఖాన్ని ఆపుకోదలుచుకోలేదు రామ్. అతని తలను తన భుజం పై ఉంచుకొని… " ఆ అమ్మాయిని ఎంత ప్రేమించారో డైరీ చదువుతున్న ప్రతి అక్షరం లో కనపడింది. కానీ మీరు నన్నెప్పుడూ కోప్పడలేదు.చాలా ప్రేమగా చూసుకుంటున్నారు.మీరిద్దరూ ఎందుకు ఒక్కటి కాలేదో నాకు తెలియదు, కాని మీ లాంటి వ్యక్తి నాకు భర్తగా దొరికినందుకు ఆనందంగా ఉంది. " ఆ మాటలు విన్న రామ్ ఆమెను అపురూపంగా చూస్తున్నాడు. " ఈ ఊహనే మీ కలలా భావించండి. తనతో కల గన్న క్షణాలనునాతో గడపండి. మీరు తననెంత ప్రేమించారో, నేను మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాను..." అంటూ కొనసాగించింది తను. ఇన్నాళ్లు తన ప్రేమ విషయం భార్య దగ్గర దాచి తప్పుచేసాననిపించింది రామ్ కి. “నువ్వు ప్రేమించిన వారికోసం నిన్ను ప్రేమించే వారిని బాధపెట్టకు” అని కల ఒకప్పుడు అన్న మాటలు గుర్తుచేసుకున్నాడు.

ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ ఉంటుంది. అది ఏ కారణం చేతనైనా... సక్సెస్ అవ్వొచ్చు, కాకపోవచ్చు. అలానే ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి ఉంటుంది. అది సక్సెస్ కాలేదు అని వినడానికే కొంచెం వింతగాఉంటుంది. జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా సాగడమే పెళ్లి ఉద్దేశం. అలా అర్థం చేసుకునే వారు ఒకటవ్వడం అదృష్టం... రామ్ - ఊహ లాగా. రామ్ ఊహ లోనే తన కలను చూసుకునేవాడు. కల తో తను ఊహించుకున్న జీవితాన్ని ఊహ తో నిజం చేసుకుంటున్నాడు