కొన్ని అద్భుతాలు ప్రణాళికల ప్రకారం జరిగితే మరికొన్ని తెలియకుండానే జరిగిపోతాయి.. అవకాశాలు, అద్భుతాలు రావడం గొప్ప కాదు వాటితో ప్రయాణం చేయడం వల్లనే మన సత్తా ఏంటో తెలుస్తుంది. లక్ష్మి గారు మాత్రం తన జీవిత ప్రయాణంలోనే ఆ అద్భుతాన్ని కనుగొన్నారు. భర్త ఆఫీస్ కు, ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయాక ఎంతో సమయం మిగులుతూంది. కాలక్షేపానికి ఏదైనా అలవాటుని అమలు చేయడం కన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్ని రకాలుగా చాలా బాగుంటుంది అని అందుకు తగ్గట్టు లక్ష్మీ గారు రీసెర్చ్ మొదలుపెట్టారు.
మన బిజినెస్ కై ఈ విశాల ప్రపంచాన్ని ఆకర్షించాలంటే ఒక ప్రత్యేకత దాగుండాలి.. ఆ ప్రత్యేకత రావాలంటే ఈ ప్రపంచాన్ని అందరిలా కాకుండా కొత్తగా చూడాలి. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేద్దామని లక్ష్మీ గారు అనుకున్నారో ఇక అప్పటి నుండే ప్రత్యేకంగా ప్రతి ఒక్క పనిని గమనించడం మొదలుపెట్టారు. అలా ఓసారి ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడి గ్రామాలలో మహిళలు నది తీరంలో దొరికే గడ్డి, వెదురుతో బ్యాగులు, డెకరేషన్ ఐటెమ్స్ ప్లాస్టిక్ వాడకుండా తయారుచేస్తున్నారు. లక్ష్మీ గారిని ఇదెంతో ఆకర్షించింది. ప్లాస్టిక్, ఐరెన్, లెదర్ వస్తువులు చూసిన వారికి ఇలా ప్రకృతిలో లభ్యమయ్యే ముడిసరుకుతో తయారయ్యే వస్తువులు ఎంతోగానో నచ్చుతాయి అని చెప్పి ఈ రకమైన బిజినెస్ మొదలుపెట్టారు.
గొల్డెన్ గ్రాస్, వాటర్ గ్రాస్, అరటి, తాటాకు, వెదురు, కొబ్బరి మొదలైన వాటితే తయారయ్యే ఈ వస్తువులను తయారు చేయడానికి ఎంతో టైం పడుతుంది కాని వీటిని అమ్మడానికి పెద్ద టైం పట్టలేదు. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన కొద్దిసేపటికే అమ్ముడయ్యేవి. ఇలాంటి వాటి కోసం ఎంతలా డిమాండ్ ఉందో అప్పుడు లక్ష్మీ గారికి తెలిసింది. వెంటనే ప్రొడక్షన్ పెంచేశారు అందుకు తగ్గట్టు ఈ- కామర్స్ సైట్స్ లో మాత్రమే కాదు ఎగ్జిబీషన్స్ ఏర్పాటు చేసి వేల సంఖ్యలో అమ్మకాలు జరుపుతున్నారు. ఇక వీరి వినియోగదాల లిస్ట్ లో సామాన్యుల నుండి సెలెబ్రెటీస్ వరకు ఉన్నారు. దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అమెరికా నుండి వీరికి అర్డర్లు అందుతున్నాయి.