అన్నమాచార్య కీర్తనలు మీరు వినుంటే " జగడపు జనవుల జాజర" అనే కీర్తన తెలిసే ఉంటుంది.. వెంకటేశ్వర స్వామీ , అలిమేలు మంగమ్మ మధ్య నడిచే జగడాన చనువు ల గురించి, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం గురించి ఈ కీర్తన ఉంటుంది..
1987 లో విడుదలైన "శృతి లయలు" అనే సినిమాలో "తెలవారదేమో స్వామి" అని ఒక పాట ఉంది. యేసుదాసు గారు పాడిన ఈ పాటని అప్పట్లో కీర్తన అనుకున్నారట, కానీ, ఆ పాట రాసింది సిరివెన్నెల గారు, ఈ పాట కి సిరివెన్నెల గారికి నంది అవార్డు కూడా వచ్చింది. అలిమేలు మంగమ్మ, స్వామి వారిపై అలిగిన సందర్భాన్ని ఊహించుకుని వర్ణించిన పాట ఇది...
పై రెండు వర్ణనలో అమ్మవారు, స్వామి వారు వారి మధ్య ప్రేమని, అలకలను, ఆప్యాయతలను వర్ణించారు... ఆ వర్ణన ప్రతి ఇంట్లోను జరిగే తీరుతో అన్వయపరుచుకునేలా ఉంటాయి...
ఆ కోవ లోకి నిన్న వచ్చిన ఆచార్య సినిమా లోని "లాహే లాహే" పాట వస్తుంది... శివుడు, పార్వతి మధ్యన జరిగిన గిల్లి గజ్జాలను వర్ణిస్తూ... చాలా అందమైన కల్పన తో పదాలతో రామజోగయ్య గారు ఈ పాట ను రాశారు...
సాహిత్యం:
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
కొండల రాజు బంగారు కొండ, కొండా జాతికి అండాదండ
మద్దెరాతిరి లేచి మంగళ గౌరి, మల్లెలు కోసిందే
వాటిని మాలలు కడతా మంచూ కొండల స్వామి ని తలచిందే
కొండల రాజు పర్వతుడు కి బంగారు కొండయినటువంటి(కూతురు) .. అక్కడ నివసించే ప్రజలకి అండా దండా అయినటు వంటి మంగళ(మంచి చేసే) గౌరీ దేవి, మధ్య రాత్రిలో మల్లెలు కడుతూ మంచు కొండలు అయినటువంటి కైలాసం లో నివసించే శివుణ్ణి తలిచింది..
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడి కి ఎగిరి పడంగా
ఒంటి యిబూది జల జల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై
విల విల నలిగిండే
ఆ తలపు ని గ్రహించిన సాంబశివుడు,
తన మెడలో ఉన్న నాగు పాము, ఆయన లో ని ప్రేమ వల్ల వచ్చిన వేడి ఎగిరి పడుతున్న, తన వొంటిన ఉన్న విబూది రాలి పడుతున్న, అమ్మ పిలుపు అత్తరు సెగలు విరజిమ్ముతూ నలుగుతూ.. కదిలాడు..
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
కొర కొర కొరువులు మండే కళ్ళు
జడలిరిసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకుమ బొట్టు
వెన్నల కాసిందే
మంటలను విరజిమ్మే కళ్ళు,
జడలుగట్టిన శివుని సింపిరి కురులు,
ఎర్రటి కోపానికి ప్రతీకగా మారిన కుంకుమ బొట్టు,
వెన్నల అంత చల్లగా మారాయి..
పెనిమిటి రాకని తెలిసి సీమాతంగి
సిగ్గులు పూసిందే
శివుని రాకని తెలుసుకున్న సీమాతంగి (భూమికి తల్లయినటువంటి పార్వతి దేవి) సిగ్గులు పూసింది..
ఉబలాటంగ ముందుకి ఉరికి, అయ్యవతారం చూసిన కలికి
ఏందా సెంకం, సూలం, బైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
ఆ సిగ్గు తో శివుణ్ణి చూడాలన్న ఉబలాటం (తొందర, ఉత్సాహం) తో ముందుకి ఉరికిన పార్వతమ్మ శివుని అవతారం చూసి, "ఆ శంఖం ఏంటి, ఆ సూలం ఏంటి, బైరాగి అవతారం ఏంటి? ఈ రోజైన కంటికి ఇంపుగా (ఆకర్షణగా) కనబడేట్టు రావచ్చు గా అని సణుగుతూ (గొణుకుతూ) ప్రేమగా కసిరింది (తిట్టింది)
లోకాలేలే ఎంతోడైనా లోకువమడిసే సొంతింట్లోనా
అమ్మోరి గెడ్డం పట్టి బతిమాలినది అడ్డాల నామాలు
ఆలుమగలా నడుమన అడ్డం రావులే ఎట్టాటి నీమాలు
ఈ లోకాలను పాలించేటి వాడైనా, సొంతింట్లో లోకువ (తన కన్నా అవతలి వాళ్ళని తక్కువ గా చూడటం) మానేస్తాడు (విరమిస్తాడు). 0
అమ్మోరి గడ్డాన్ని పట్టుకుని బతిమాలాయంట స్వామి నుదుటి పై ఉన్న అడ్డాల నామాలు
అవేంటి, భార్య భర్తల మధ్యలో ఎలాంటి నియమాలు, అడ్డం రావు రాకూడదు..
ఒకటో జామున కలిగిన విరహం రెండోజామున ముదిరిన విరసం
సర్దుకు పోయే కుదిరేయేలకి మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగోజామున గుళ్ళో గంటలు మొదలాయే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
ఒకటో జాము (పూట, గంట) కలిగిన అమ్మవారి విరహం , రెండో జాముకి విరసంగా (విసుగు) మారింది. మూడో జాముకి సర్దుకోవడం మొదలయ్యి, నాలుగో జాము కి దగ్గరయ్యే సమాయానికి, గుళ్లో గంటలు మొదలయ్యాయి, భక్తులు రావడం, మొదలెట్టారు వాళ్ళ బాధలు చెప్పడం మొదలెట్టారు.
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
ప్రతి రోజది జరిగే ఘట్టం, ఎడమొకమయ్యి ఏకం అవటం.
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం.
స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం.
ముందు ఎడమొకం గా ఉండి, (కోపగించుకుంటూ, కసురుకుంటూ) తరువాత ఏకమవుతూ, అనాదిగా ఇలా అలకలలో నవ్వులను అనుబంధాలను వెతుకుంటూ ఎందరికో ఆదర్శమయ్యారు ఆది దంపతులు...
ఇలానే ఎన్ని కలతలు అలకలు వచ్చిన భార్య భర్తల మధ్య సాగే అనుబంధాల ప్రయాణం తమ గమ్యం చేరాలని.. శివుడు పార్వతి స్వయానా చెప్తున్నారు..
గుడి తలుపులు మూసి, ఏకాంత సేవ మొదలయ్యే సమయం ఉంటుంది.. ఆ సమయాన ప్రతి రోజు జరిగే ఘట్టం ఇదేనేమో కాబోలు అని రామ జోగయ్య శాస్త్రి గారి అద్భుతమైన కల్పన ఈ పాట..
రాధాకృష్ణులను వర్ణిస్తూ, వెంటకేశ్వర స్వామీ పద్మావతిల ప్రేమ ని వర్ణిస్తూ చాలా కీర్తనలు, పాటలు, కాల్పనికలు వచ్చాయి.. అలా శివ పార్వతుల మధ్యన ఉండే అపూర్వమైన అనురాగాన్ని వర్ణించారు ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి గారు. వినసొంపైన స్వరాన్ని సమకూర్చారు మణిశర్మ గారు.. వినగా వినగా తియ్యగా పాటలోని వర్ణన ని తలుచుకుంటూ చాలా ముచ్చట గా అనిపిస్తుంది..