పూర్వం హిరణ్యకశ్యపుని మనవడు ఐన తారకాసురుడనే రాక్షసుడు శంకరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సు చేశాడు. భోలాశంకరుడుని ప్రసన్నం చేసుకున్న తారకాసురుడు పరమేశ్వరుని ఆత్మలింగాన్ని వరంగా పొందడమే కాకుండా మరణమే లేకుండా లోకాలను తన అదుపులో ఉంచుకోవాలని ఒక పిల్లవాని చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో మరణం సంభవించకూడదని వరం పొందుతాడు. భయంకరమైన రాక్షసుడైన నన్ను ఒక చిన్నబాలుడు చంపడం అసాధ్యం అంటూ విర్రవీగి జనాలను, దేవతలను హింసించడం మొదలుపెడతాడు. అప్పుడు సర్వ ఆపదలను అరికట్టే శక్తివంతుడైన పరమేశ్వరుడిని దేవతలు చేరుకొని ఈ పరిస్థితి పై పార్వతి పరమేశ్వరుల్ని ప్రార్ధించి తారకాసురుడిని సంహారించే శక్తివంతమైన బాలుడుని ప్రసాదించాలని దేవతలు కన్నీటితో వేడుకున్నారు.
అలా పార్వతి పరమేశ్వరుల దివ్యతేజస్సుతో కుమారస్వామి ఉదయించి తారకాసురుడుని వీరోచితంగా సంహారిస్తాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు వరం ద్వారా పొందిన శివలింగం ఐదు ముక్కలుగా విరిగి ఐదు ప్రదేశాలలో పడిపోయాయట అలా పడిపోయిన ప్రదేశాలే ఐదు పంచరామా శివ క్షేత్రాలుగా అవతరించాయని చరిత్ర. అమరారామములో(అమరావతి) అమరేశ్వరుడుగా, ద్రాక్షరామములో భీమేశ్వరునిగా, సోమారామంలో(భీమవరం) సోమేశ్వరునిగా, క్షీరారామంలో(పాలకొల్లు) రామలింగేశ్వర స్వామిగా, అలాగే కుమార భీమారామంలో(సామర్లకోట) కుమారభీమేశ్వర స్వామిగా శివుడు పూజలందుకుంటున్నారు. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి కోవెల పచ్చని చల్లని పంటచేనుల మధ్య కొలువై ఉన్నది.
సామర్లకోటకు ఆ పేరు రావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఆ కాలంలో వైష్ణవ స్వాములు ఇక్కడ ఎక్కువగా ఉండేవారని అందువల్ల మొదట స్వాముల కోటగా పిలిచేవారని కాలక్రమంలో సామర్లకోటగా మారిందని, అలాగే ఈ ప్రాంతంలో శ్యామలంబ దేవాలయం ఇంకా దాని పరిధిలో ఒక కోట ఉండేదని అలా మొదట శ్యామల కోటగా తర్వాత సామర్లకోట అని పిలిచేవారని ఈ రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంది. సాక్షాత్తు కుమారస్వామి వారే ఇక్కడ పరమేశ్వరుడిని ప్రతిష్టించారని అందుకే ఈ దేవాలయాన్ని కుమార భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారని కథనం. మొదటి చాళుక్య భీముడు కుమారరామాన్ని తమ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారని ఆ సమయంలోనే మొదటిసారి ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడ చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుని కాంతి కిరణాలు ఉదయం స్వామి వారి పాదాలను, సాయంత్రం అమ్మవారి పాదాలను తాకుతాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.