Directors Krish And Sekhar Kammula Explain Why Savitri Garu Is A Gifted Actress To Indian Cinema!

Updated on
Directors Krish And Sekhar Kammula Explain Why Savitri Garu Is A Gifted Actress To Indian Cinema!

క్రిష్ జాగర్లమూడి గారు.. సావిత్రి వంటి నటి నభూతో నభవిష్యతి. అంటే ఆవిడ నటనను ఒక స్కేల్ లో కొలవలేము. సినిమా స్క్రీన్ మీద అంత పెద్ద కళ్లతో ఆవిడ నటిస్తుంటే.. అదొక అద్భుతంగా ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. సావిత్రి గారు మన మధ్య లేకపోయినా "దేవదాసు" లో పార్వతి, "మాయాబజార్" లో శశిరేఖ, "కన్యాశుల్కం" లో మధురవాణి.. వీళ్ళంతా బతికే ఉన్నారంటే ఆవిడ నటనకు ఎంత ప్రాణం పోశారనుకోవాలి.??

ఆమె అన్ని తరాల నటులకు ఓ పాఠ్యగ్రంథం. చదివే కొద్ది కొత్తగా అనిపిస్తుంటుంది. రియల్లీ షి ఇజ్ ఏ లెజెండ్. సావిత్రి గారంటే అందరూ ఎందుకంత ఉద్వేగభరితులవుతారో చెప్పనా.? స్వచ్ఛమైన ఆవిడ ముఖారవిందం. ఆ ముఖంలో ఆవిడ ఎక్కడా కనిపించదు. కేవలం నటనొక్కదాన్నే మనముందు ఉంచుతుంది. అదెలా సాధ్యమో.. నాకైతే ఇప్పటికీ అర్ధం కాదు. అనిర్వచనీయమైన అద్భుతంగా తోస్తుందామే. మహానటి సావిత్రి గారి ఫ్లో, వాయిస్ మాడ్యులేషన్, గీత గీసినట్టు ఉంటాయి. ఒక అంగుళం అటు కాని ఒక అంగుళం ఇటు కాని ఉండవు. కొన్ని సన్నివేశాల్లో - నిక్షిప్తంగా, నిగూఢంగా, మౌనంగా.. ప్రేక్షకులకు చెప్పాల్సింది చెప్పగలిగారు. ఇది కత్తి మీద సాము. నటులుగా శిఖరస్థాయికి చేరుకున్నవారికే ఇది సాధ్యమవుతుంది. మన సినిమాలలో సావిత్రి గారు ఆ స్థాయికి చేరుకోగలిగారు. ఆవిడ చాలా సినిమాలలో నిశ్శబ్ధంతో కూడా గుండెల్ని పిండేశారు. "భావోద్వేగాలకు సావిత్రి గారిచ్చే టచ్" ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా పడిపోని ప్రేక్షకులు ఎవరుంటారు చెప్పండి.

"అందుకే సినిమాలలో సావిత్రి గారు యాక్ట్ చేశారు" అంటూ మొదలుపెట్టిన చర్చను ఆపడానికి ఎవరికీ మనసొప్పదు. అంత ఎమోషనల్ బాండ్ ను క్రియేట్ చెయ్యడం నటులకు సులువైన పనికాదు. నటన సంగీతం లాంటిదే. తూకం వేసినట్లు ఎంత ఇంటెన్సిటీతో, ఎంత ఇంప్రెసివ్ గా నటించాలో అంతేస్థాయిలో నటించాలి. ఆ సున్నితమైన రేఖను, సావిత్రి గారొక్కరే తాకగలిగారు. ఆమె చిన్నప్పుడే నేర్చుకున్న కూచిపూడిని నటనకు జీనియస్ గా మార్చుకోవడం అంకితభావాన్ని తెలియజేస్తుంది. నటనకు ఆవిడ వాడుకున్న మేజర్ పార్ట్ "ముఖం". ఆమె ముఖారవిందాన్నే కేంద్రంగా చేసుకుని సినిమాలన్నీ వచ్చాయి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. సావిత్రి గారిని తలుచుకుంటే ముందుగా ఆమె ముఖమే గుర్తుకొస్తుంది. ఇలా ఎంతసేపైనా చెప్పొచ్చు. నటనకు ఒక పరిపూర్ణతను తెచ్చిన ఆ మహానటి అనుభూతులకు, ముచ్చట్లకు ముగింపు పలకడం కష్టం.

శేఖర్ కమ్ముల గారు.. ఒకరు ఒక భావాన్ని మాత్రమే బాగా పలికిస్తారు. మరొకరు ఇంకో భావాన్ని అద్భుతంగా పలికిస్తారు. కాని అన్ని భావాలను రక్తి కట్టించే నటులు బహు అరుదు. అలాంటి అరుదైన మహానటి సావిత్రి గారు. నటనలో పరిపూర్ణతను సాధించి.. అంత ఉన్నత స్థాయికి వెళ్లడం ఆమెకే సాధ్యమయ్యింది. ఆ రేంజ్ ను అందుకోవడం మరొకరికి సాధ్యం కాదనిపిస్తుంది. ఈ రోజుల్లో ఐతే ఆ ఛాయలకు వెళ్లడాన్ని కూడా ఊహించలేము. అందుకే నటనకు సావిత్రి గారు "బెంచ్ మార్క్" అన్నది నా అభిప్రాయం. సావిత్రి గారి సినిమాల్లో నాకు కనిపించే అద్భుత నటసౌందర్యం ఏమిటంటే - కళ్లతో, కను రెప్పలతో, కనుకొలకులతో భావోద్వేగాలను సున్నితంగా, సమ్మోహణంగా వ్యక్తీకరించడం. అవి ప్రేక్షకుల హృదయాలను మీటేవి. సినిమా చూస్తున్నామన్న భావన కంటే.. పాత్రల నడుమ ప్రేక్షకులు ఉన్నారన్న ఫీలింగ్ కలిగేది. తొలినాళ్లలో ఆమె సినిమాలను ఎంతగా ఆరాధించారో.. ఆ తర్వాత దశలో కాస్త ఒళ్ళు చేసినా అంతే ఇష్టపడ్డారు.

మీరు గమనించారో లేదో సావిత్రి గారు కొంచెం ఒళ్ళు చేశాక తీసిన సినిమాల్లో "క్లోజప్" షాట్ లతోనే విజయవంతమైన సినిమాలు తీశారు. అంత ఆకర్షణీయమైన ముఖారవిందాన్ని నేనైతే ఇప్పటికీ చూడలేదు. కేవలం ముఖకవళికలతోనే గొప్పగా నటించొచ్చు అని నిరూపించారు సావిత్రి గారు. ఒక్క ముఖంలోనే కళ్లు, ముక్కు, పెదాలు, కనుబొమ్మలు, కను రెప్పలు, నుదురు, బుగ్గలు, జుట్టు - నటనకు ఇన్ని సాధనాలున్నాయి. ఇవన్నీ అద్భుత నటనకు ఆయుధాలు. అవసరమైన సందర్భంలో, అర్ధవంతమైన సన్నివేశానికి వాటిని బాగా వాడుకున్నారు సావిత్రి గారు. అందుకే.. తల్లిగా, చెల్లిగా, వదినగా ఏ పాత్ర వేసినా.. ఆ పాత్రకే ఒక గొప్పస్థానాన్ని తీసుకువచ్చారు. పాత సినిమాలు.. కొత్తతరం చూసినా కొత్త అనుభూతిని కలిగిస్తాయి. అందుకే అన్ని తరాలకు - "ఎనీ టైమ్ సావిత్రి" అంటాను నేను. సావిత్రి గారు చేసిన అన్ని పాత్రలను నేను ఇష్టపడి ఎంజాయ్ చేశాను. "కన్యాశుల్కం" లోని మధురవాణి పాత్ర నా మనసులో మరింత గట్టిగా గుర్తుండిపోయింది. "మిస్సమ్మ", "మాయాబజార్" వంటి సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేందుకు సావిత్రి గారే కారణం. నా సినిమాల మీద ఆమె ప్రభావం లేదు కాని.. మనకు తెలియకుండానే గొప్ప నటి తాలూకు ప్రభావం అందరి మీదా ఉంటుంది.

(వెండితెరపై వెన్నెల సంతకం పుస్తక సౌజన్యంతో)