"విద్య" ద్వారానే మనిషి ఉన్నతుడు కాగలడని, ప్రపంచంలో ఆనందం వెల్లివిరుస్తుందని మనమందరం బలంగా నమ్ముతాం. హిందూ సంస్కృతిలో చదువులకు దేవతగా సరస్వతి అమ్మ వారిని పూజిస్తుంటారు. మనది హిందూ దేశంగా విరాజిల్లుతున్నా గాని సరస్వతి అమ్మవారికి మనదేశంలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు తక్కువ, వాటిలో ముఖ్యమైనవి కాశ్మీర్ వైష్ణోదేవి దేవాలయం, తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇప్పుడు మనం తెలుసుకొబోతున్న దేవాలయం బాసర గుడి కన్నా అత్యంత ప్రాచీనమైన సరస్వతి దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూ గా కృతయుగంలోనే వెలిశారని పూజరుల నమ్మకం. ఈ గుడి కర్నూలు జిల్లాలకు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి మండలానికి దగ్గరిలో ఉన్న నల్లమల్ల అడవిలో ఉన్నది.
ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టుగా ఇక్కడే సప్త మహర్షులు ఒకేచోట ప్రతిమ రూపంలో మనకు దర్శనమిస్తారు. పూర్వం ఒక మహా యాగం ఇదే ప్రాంతంలో జరిపారని ఆ తర్వాత యాగానికి గుర్తుగా ఇక్కడ ప్రతిమలు వెలిశాయని చరిత్ర. ఆ యాగం జరుగుతున్నప్పుడే అమ్మవారు ఇక్కడికి వచ్చి రక్షణగా నిలిచారని కూడా చెబుతారు. పూర్వం విశ్వా మిత్రుడు, కశ్యపుడు, జమదగ్ని, భరతుడు, భరద్వాజుడు, అత్రి, వశిష్టుడు, గౌతముడు ఇక్కడికి వచ్చి ఏకశిలా ధ్వజ స్థంబాన్ని ప్రతిష్టించారని ఇక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది.
సప్త శివాలయాలు కూడా ఇదే చోట కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతమంతా కనుచూపు మేర ఒక అద్యాత్మిక క్షేత్రంగా దర్శనమిస్తుంది. ఇదే చోట "చారు ఘోషిని" నది సహజ సిద్దంగా ప్రవహిస్తుంది. ఈ నది అడవి మధ్యలో నుండి ప్రవహించడంతో అత్యంత స్వచ్చంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా అమ్మవారు చేతిలో పుస్తకం పట్టుకుని దర్శనమిస్తారు. పిల్లలకు మొదటి సారి సరస్వతి అమ్మవారి సన్నిదిలో అక్షరాభ్యాసం జరిపితే వారికి అమ్మవారి కరుణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైన దేవాలయమైన గాని ఏర్పట్లు వసతులు అంతగా లేకపోవడంతో మిగిలిన సరస్వతి క్షేత్రాల కన్నా తక్కువ సంఖ్యలోనే భక్తులు వస్తుంటారు.