కోపం - This Story Shows Why And How Anger Can Be Used As A Positive Emotion

How Anger Can Be Used As A Positive Emotion
Updated on
కోపం - This Story Shows Why And How Anger Can Be Used As A Positive Emotion

ఇంకా గుర్తు , ముక్కు మీద కోపం ఉన్న రోజులు అవి , ఆలోచన కన్నా ముందు ఆవేశం తన్నుకుంటూ వచ్చేది. ఆఖరికి సరదాగా టీచర్ కొంచెం నొప్పించే జోక్ వేసిన మొహం మీద డైరెక్ట్ కౌంటర్ వేసేసేవాడ్ని. అమ్మ పుట్టిన రోజు కి , ఎం గిఫ్ట్ కావాలమ్మా అని అడిగితే ,"కొంచెం కోపం తగ్గించుకో నాన్న అనడం ఇంకా గుర్తుంది. సరదా కోసం అంటుందనుకునే వాడ్ని. వయసు పెరిగి ఇంటర్ , ఇంజనీరింగ్ అలా సాగిపోయాయి. కోపం వల్ల దగ్గర అయినవాళ్లు కొందరు అయితే , దూరం అయిన వాళ్ళు ఇంకొందరు. అందరు తప్పు పట్టినా, ఎందుకో ఎప్పుడు తప్పు అనిపించేది కాదు , నేను అనుకునే దాని కోసం నిలబడడం తప్పా? అయినా చెప్పాలంటే బాధ వచ్చినపుడు కన్నీళ్లు రావడం ఎంత సహజమో , ఏదన్న తప్పు కనిపిస్తే కోపం రావడం కూడా అంతే సహజం , కావాలని ఎవరు ఎడ్వారు కదా ? అలానే కోపం కూడా.

అలా సాగిపోతున్న రోజుల్లో , 3rd ఇయర్ లో , తెలిసిన అమ్మాయి గురించి తను అక్కడ లేనప్పుడు తప్పు చేసి , తక్కువ చేసి మాట్లాడటం విని కోపం వచ్చింది. మాట మాట పెరిగాయి , చిన్న గొడవ కాస్త పెద్ద గొడవ అయ్యింది , మాటలు కాస్త గీతాలు దాటి కొట్లాట మొదలయింది. తప్పుగా మాట్లాడింది వాడు , మొదట చెయ్యి ఎత్తింది కూడా వాడే , కానీ ఆ తరువాత రోజు , నా అనుకున్న స్నేహితులు , నా గర్ల్ ఫ్రెండ్ , అలా అలా పాకీ ఇంటికి చేరి విన్న తర్వాత ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా నాదే తప్పు అన్నారు. ఈసారి గొడవ కొంచెం పెద్దది అవ్వడం తో , ప్రతి ఒక్కరు ఒక సలహా , ఒక నింద తో రెడీ గా ఉన్నారు . ఎవరు జరిగింది వినాలనుకోలేదు , విన్నా నమ్మాలనుకోలేదు. అరిచి అరిచి గొంతు పోయింది , నింద వేసే వాళ్ళ సంఖ్య పెరగడం తో నా మాట విలువ కూడా ఆ నిందలతోనే కొట్టుకుపోయింది. ఎవరికీ కారణం కనిపించలేదు , అందరికి కోపం మాత్రమే కనిపించింది. ఆరోజు ఓడిపోయాను , వాళ్ళే గెలిచారు, గెలిచారని నమ్మించారు. ఆరోజు నుండి ఉన్నాను అంటే ఉన్నానంతే.నటించడం అలవాటు అయింది. ఎవరిని దగరికి రానివాళ్ళని అనిపించలేదు . మాటలే లోకంగా బ్రతికే నాకు మౌనం తెలియకుండానే దగ్గర అయింది.

అంత చిన్న విషయానికి ఇంత మార్పా ? అనుకోవచ్చు , సమస్య చిన్న గొడవ , పెద్ద గొడవ అని కాదు, నమ్మకం గురించి .నా అనుకున్న వాళ్ళు అర్ధం చెస్కోలేదనే బాధ. అయినా కోపం కనిపిస్తే తప్పు అని ముద్ర వేసేస్తారా ? ఇంకొంత మంది అయితే అహం , పొగరు అని కొత్త పదాలు తీసుకొస్తారు. ఒకేలా కనిపించే రెండు వ్యతిరేకలు - కోపం , అహం . అహానికి ఆయువు ఎక్కువ. కోపం అలా కాదు , నీటి బుడగ లాంటిది , ఎక్కువ సేపు బ్రతకలేదు.

ఏదైతే ఏంటి కోపం పోయింది , కానీ దురదృష్టం ఏంటంటే భయం మొదలయింది. ఏదో తెలియని భయం , ఎవరేం అనుకుంటారనే భయం , ఇది చేయచ్చా లేదా అనే భయం , బయపడుతున్నాము అనే భయం. జాబ్ లో చేరాక వెళ్లడం రావడం తప్పా ఏమి గుర్తులేదు. కొన్ని సార్లు అక్కడ జరిగే పరిస్థితులు చూసి కూడా ఎం మాట్లాడలేకపోతున్న , తప్పు అని చెప్పాలా , వద్దా ? ఆమ్మో ! ఆ పిరికితనం తో కాపురం చేసి చేసి సమాజపు జీవితం అలవాటు అయిపొయింది.

సరిగ్గా చూస్కుంటే మనందరం పిరికి వాళ్ళమే . గట్టిగా మాట్లాడితే ఇది మనందరి కథ. చిన్నపుడు ఎంతో స్వేచ్చగా మాట్లాడే నువ్వు , ఇప్పుడు అంతే స్వేచ్ఛగా నీ ఆలోచనలను వ్యక్తపరుస్తున్నావా ? లేకపోతే "మనకెందుకులే ?" అనే పదానికి బానిసవి అయ్యావా ? తప్పు లేదు , తప్పలేదు కూడా , సమాజం అలా తయారు చేసింది.

అదంతా పక్కన పెడితే ఒక రోజు నా మీద ఏదో తెలియని కోపం వచ్చింది , అసలా ఎందుకిలా అని ? పట్టపగలు ఒక కాంట్రాక్టర్ అహంకారం తో ఒకడు చిన్నపిల్లాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు , కోపం వచ్చింది , ఆ రోజు పిరికితనపు సంకెళ్లని బద్దలు కొట్టి ఒక ఊపిరి తీసుకున్నాను , ఆ ఊపిరి లో భయం , బరువు రెండు లేవు. ఆవేశం వచ్చింది కానీ ఎందుకో ఆపుకుని పోలీస్ స్టేషన్ కి కాల్ చేశాను , తెలిసిన లాయర్ ని రమ్మన్నాను. అక్కడే The Child Labour Act 1986 , అన్ని డాకుమెంట్స్ తో రెడీ గా ఉంది నా ఫ్రెండ్ , ఆ కాంట్రాక్టర్ కి పోలీస్ తెలిసినా ఎం చేయలేకపోయాడు. ఆ చిన్న పిల్లాడి మొహం లో భయం పోయి ధైర్యం వచ్చింది. ఆవేశం తో గొడవ కి వెళ్లి ఉంటె నేనే ఓడిపోయే వాడ్ని ఏమో , కోపానికి ఆలోచన కలిపినప్పుడు ఓడిపోము అని అర్ధం అయ్యింది.

కోపం లో ఆవేశం పోయి ఆలోచన , విచక్షణ ఎప్పుడైతే కలుస్తాయో , ఆ స్వచ్ఛమైన కోపం చేయగలిగే అద్భుతాలు ఊహాతీతం. నాకు నేను నచ్చాను. నా కోపం నాకు అందంగా కనిపించింది. కానీ ఇది తెలుసుకోడానికి 26 ఏళ్ళు పట్టింది.

ఆవేశపు కోపం మనకి శత్రువు , ఆలోచన తో కూడిన కోపం మన విజయానికి ఇంధనం.