Holidays Activities; Parents Should Involve Their Kids In For Personality Development

Updated on
Holidays Activities; Parents Should Involve Their Kids In For Personality Development

మనకు వేసవికాలం వచ్చేసింది, పిల్లలందరూ చాలచాలా సంతోషంగా ఉంటారు. పిల్లలకేమో సంతోషంగా ఉంటుంది పెద్దవారేమో కాస్త ఒత్తిడికి లోనవుతుంటారు ఇది సహజంగానే సాగిపోయే ప్రయాణమే. ఐతే పిల్లల ప్రతి అకాడమిక్ సంవత్సరంలో చదువు తప్ప మరేదీ ఉండదు. ఏదైనా ఆదివారం వచ్చినా సరే చాలా కొద్ది సమయం మాత్రమే ఖాళీగా ఉంటారు, లేదంటే ఆ వీక్ కి సంబంధించిన హోమ్ వర్క్ కానీ మొదలైనవి చేసుకుంటారు. ఇట్లాగే సంవత్సరమంతా గడిచిపోతుంది. అందుకని ఇంత లాంగ్ హాలీడేస్ ఈ 40 నుండి 50 రోజుల సెలవలు వాళ్ళు చాలచాలా సంతోషంగా భావిస్తారు. ఈ వేసవికాలంలో సంతోషాన్ని వీలైనంత వరకు మంచి అనుభూతులతోటి మనం నింపగలిగితే గనుక అది వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపడమే కాక ప్రకృతికి మేలుజరుగుతుంది.

1. ఎక్కువసేపు పడుకోనివ్వకూడదు: పిల్లలకు కావాల్సింది పుస్తక జ్ఞానం, లోకజ్ఞానం. పుస్తకజ్ఞానం స్కూల్స్ లో చెబుతున్నారు. లోకజ్ఞానం మాత్రం పిల్లలే నేర్చుకోవాలి. అందుకే ఈ 50 రోజుల సెలవు కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దాన్లో భాగంగా పిల్లల్ని సమ్మర్ యే కదా అని రోజూ ఉదయం 8 వరకు, 10 వరకు నిద్రపోనివ్వకూడదు. ఎందుకంటే అన్నికాలాల కన్నా సూర్యుడు వేసవికాలంలో ఎక్కువ సేపు ఉంటాడు. త్వరగా సూర్యోదయం అవుతుంది చాలా ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది. దీని వల్ల రోగబాధలు అనేవి చాలా తక్కువగా ఉంటుంది మిగిలిన కాలాలతో పోలిస్తే, వేసవికాలంలో డీ హైడ్రేషన్, వడదెబ్బ లాంటి రెండు మూడు సమస్యలు తప్ప మిగతా వైరస్ లేవి వ్యాప్తి చెందవు కాబట్టి పిల్లలకు ఎలాంటి రోగ బాధలనేవి ఉండవు. ఆటలాడడం కోసం ఐన, ఏదైనా స్పోర్ట్స్ మ్యూజిక్ నేర్చుకోవడానికైనా వెళితే ఎక్కువ సేపు శక్తివంతంగా ఉంటారు.. ముఖ్యంగా స్కూల్స్ కు వెళ్తున్న రోజుల్లో ఉదయమే లేచే పిల్లలకు ఇలా 8, 10 టైమ్ అలవాటు పడితే బద్ధకం, స్కూల్ అంటే ఒక కష్టం అనే ముద్రపడుతుంది వారి మనసులో..

2. విత్తనాలు కలెక్ట్ చెయ్యమని చెప్పండి: ఈ వేసవికాలంలో మనం పిల్లలతోటి మంచి మంచి సమాజానికి ఉపయోగపడే అలవాట్లను పెంపొందించవచ్చు. ఎలా అంటే మన ఇంట్లో కాలనీలో చాలా చెట్లు ఉంటాయి(హరితహారంలో భాగంగా నాటిన చెట్లు కానివ్వండి, ఇంతకుముందు నుండే ఉన్న చెట్లు కానివ్వండి) ఈ సీజన్ లో ఆ చెట్ల నుండి కింద విత్తనాలు పడుతూ ఉంటాయి ఆ విత్తనాలన్నింటిని పిల్లలతోటి చాలా సంతోషంగా సేకరించేలా ప్రయత్నం చేయాలి. అలాగే చెట్ల కింద ఎండుటాకులు పడుతూ ఉంటాయి, కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఆ ఎండుటాకులు ఏరి కుప్పగా చేర్చి తగలబెడుతూ ఉంటారు. దీని వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, చూడటానికి ఎండుటాకులు అని అనుకుంటాం కానీ అది మన విలువైన సంపద. రాలిపోయిన ఎండుటాకులు కొంతకాలానికి చెట్టుకు ఎరువునిస్తుంది. ఈ ఎండుటాకులు భూమికి పోషననిస్తుంది(అడవిలోనూ ఇలాగే జరుగుతుంది) ఆ ఎండుటాకుల మధ్యలో ఇంతకు ముందు ఏరిన విత్తనాలు వేస్తే చక్కటి ఆరోగ్యకరమైన మొక్కల్ని ఇస్తుంది ఆ రాలిపోయిన ఆకులు. ఇది అనుభవ పూర్వకంగా పిల్లలు తెలుసుకోవాలి, ఈ సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా పిల్లలకు దొరకదు.

3. చెట్లకు మినరల్ వాటర్ గాని, త్రాగేనీరు కానీ పొయ్యకూడదు: మీరు చదివింది నిజమే ఇందులో ఎక్కడా అచ్చుతప్పులు లేవు. ఇంతకుముందు నీరు స్వచ్ఛంగా దొరకడం మూలంగా వాటినే తాగుతున్నాం. రకరకాల వ్యర్ధాలను తొలగించడం కోసం నీటి ఫ్యూరిఫికేషన్ కోసం క్లోరినేషన్ పద్దతిని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. క్లోరినేషన్ పద్దతిలో శుద్ధి జరిగిన నీరు మొక్కలకు ప్రమాదకరం. ఐతే కూరగాయలు, బియ్యం, పండ్లు కడిగిన నీటిలో క్లోరినేషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. బియ్యం కడిగిన నీరు, కూరగాయలు కడిగిన నీరు, భోజనం చేసిన తర్వాత చెయ్యి కడిగిన నీరు ఇవ్వి సేకరించగలిగితే కనుక ప్రతి రోజు ఒక కుటుంబం నుండి 50 చెట్ల వరకు నీటిని అందించవచ్చు. ఇలాంటి పొదుపు అలవాట్లు పిల్లలకు చిన్నతనం నుండే అలవాటు చెయ్యడం వల్ల భవిషత్తులో వారికి నీటి సమస్యలు తలెత్తవు.

4. తాను నాటిన మొక్కలనే బహుమతిగా: "మన ఇంట్లో పండ్లు తిన్నాక మిగిలిన పళ్ళ గింజలు, టెంకెలను చెత్తకుండీలలో పారేయకుండా కొద్దికాలం పక్కనపెడితే విత్తనాలుగా మారిపోతాయి. ముందుగా చెప్పిన ఎండుటాకుల మధ్య వేస్తే మొక్కలుగా మారిపోతాయి. ఆ మొక్కలను పిల్లలు తమ స్నేహితులకు పంచిపెట్టవచ్చు. కాలనీలోని పార్కులు, ఇతర ప్రదేశాలలో పిల్లలతో నాటిస్తే కనుక మొక్కలతో ప్రకృతితో పిల్లలు మమేకం అవుతారు. ఇది నేను నాటిన మొక్క అని ఒక ఐదారేళ్ళ తరువాత తిరిగి చూసుకుంటే చెట్టుగా మారిపోతాయి. నాటిన మొక్కలు పక్షులకు ఆవాసంగా మారిపోతాయి, ఆక్సిజన్, నీడను ఇస్తాయి.. పిల్లలు చాలా గర్వపడుతారు, దానిని మాటల్లో వర్ణించలేము.

5. వేసవిలో పక్షులకు నీరు అందిస్తున్నారు మరి ఆహారం మాటేమిటి.? సమ్మర్ సీజన్ లో పక్షులకు నీళ్లు పెట్టాలని చెబుతుంటారు కానీ నీటితో పాటు ఆహారం కూడా వాటికి అత్యంత అవసరం. వేసవిలో మొక్కలకు ఆకురాల్చే కాలం కనుక వాటికి ఆహారం దొరకదు పక్షులకు తిండి గింజలు కూడా పెట్టడం మంచి పద్ధతి.

6. ఉత్తరాలు రాయించండి: మనుషులందరూ వ్యక్తులుగా వందల కోట్ల వ్యక్తిత్వాలున్నాయి.. ఒక మనిషిని మంచి మనిషిగా ఉన్నతమైన వ్యక్తిగా ఎప్పుడు నిలబడతాడంటే వ్యక్తిగా కాదు వ్యక్తిత్వంతోనే ఒక మనిషి విశిష్టమైన వ్యక్తి కాగలడు. అందుకని ముందుగా వ్యక్తిత్వం పెంచుకోవాలి, ఆ వ్యక్తిత్వం పెంచుకునే విధంగా వేరేవారి ఆలోచనా విధానానికి మన విధానానికి తేడా ఉండాలి. వేరేవాళ్లు చెడుగా ఆలోచిస్తున్నారని మనం కూడా అలాగే ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించాలి. మంచి వ్యక్తిత్వం నిర్మించగలవాటిలో "ఉత్తరాలురాయడం" అలవాటు కూడా ఒకటి. ఉత్తరాలు భవిషత్తుకు బంగారు బాటలు వేస్తాయి. పిల్లలు చేసిన మంచి పనులు, మొదలైన విషయాలు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలకు బంధువులు, స్నేహితులు, ఆత్మీయులతో ఉత్తరాలతో పంచుకోవడం అనే అలవాటును పిల్లలకు పరిచయం చేయించాలి. ఉత్తరాలు రాయించడం వల్ల పిల్లలలో కాంప్రిహెన్సివ్ రైటర్ బయటకు వస్తాడు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ఏవిధంగా ప్రజెంట్ చేస్తారని చెప్పి ఆలోచన మొదలవుతుంది. బాల్యంలో రాసిన ఉత్తరాలు జీవితమంతా మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి.

7. వారి పనులను వారే చెయ్యమనండి: అలాగే పిల్లలను ఏదో విశ్రాంతి సమయం అని వదిలేయకుండా చిన్ని చిన్ని పనులు చేయించాలి. అంటే అన్నం తిన్నతరువాత ప్లేట్స్ కిచెన్ లోకి తీసుకువచ్చి శుభ్రం చేయించడం, భోజనం చేసేటప్పుడు తాగే నీరు వారే తీసుకువచ్చుకోవడం, మంచినీరు బాటిల్ ని పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం, కూరగాయలు కడగడం, దుప్పట్లు మడతపెట్టడం.. ఇలాంటి చిన్న చిన్న పనులను చేయించడం వల్ల వారిలోనూ కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది. పైన చెప్పిన పనులన్నీ చేయించాల్సిన అవసరం లేదు ఇందులో కనీసం రెండు మూడు పనులు చేయించినా చాలు పిల్లల వ్యక్తితాన్ని నిర్మించడానికి, మార్చడానికి ఉపయోగపడతాయి.

Inputs By Chandra Sekhar