చిన్నప్పుడు ఆగష్టు పదిహేను అనగానే గుర్తొచ్చేవి రెండే రెండు, ఒకటి కాగితపు జెండాలతో అలంకరించిన తరగతుల మధ్యలో జెండా ఎగరేయటం, రెండు టీవీ లో ఖడ్గం సినిమా చూడటం. ఈ రోజు కూడా టీవీ లో ఖడ్గం సినిమా వేసారు, చూసే ఉంటారు అనుకుంటా. కొన్ని సంభాషణలు చిన్నప్పుడు అర్ధం అవ్వలేదు, ఇప్పుడు వింటుంటే ఆశ్చర్యం వేసింది. సినిమా ఇప్పుడు చూస్తుంటే వేరేలా కనపడుతుంది. ఆగష్టు 15 కి ఖడ్గం ఎందుకు వేస్తారో ఇప్పుడు అర్ధం అయ్యింది. దేశ భక్తి గురించి, మనిషి ప్రవర్తన గురించి, మనుషుల మధ్య సంబందాల గురించి తెలిపిన ఆశ్చర్యాన్ని కలిగించిన కొన్ని సంభాషణలు మీకూ అదే అనుభవాన్ని అందిస్తాయి అని భావిస్తూ..ఖడ్గం చిత్రం లోని కొన్ని అద్భుత సంభాషణలు..
1. మట్టి లో కలిసిపోయేవాళ్ళం మట్టిని ప్రేమించాలి కాని మనిషికి మనిషికి మధ్య అంతరాన్ని పెంచే మతాన్ని కాదు.
2. మతాలది కాదు మాష్టారు... మనుషులది దేశం. పుట్టిన ఊరు, పెరిగిన నేల, పంచిన జ్ఞాపకాలు అన్నిటిని వదిలేసి ఎక్కడికి వెళ్లలేం. ఎందుకు వెళ్ళాలి ఈ దేశం మనది కదా.
3. సముద్రాన్ని సంచిలో దాచాలనుకోవటం, ఆకాశానికిరంగువేయలనుకోవటం, గాలిని బంధించాలనుకోవటం ఎంత విడ్డూరంగా మూర్ఖంగా అమయాకంగా అనిపిస్తాయో కదా.
4. అమ్మను మించి దైవమున్నదా...అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే!
5. అవును ఒకే ఒక్క ఛాన్స్..కొన్ని లక్షల మందిని బతికిస్తున్న మంత్రం.
6. 200 సంవత్సరాల బ్రిటిష్ వారి పరిపాలన గురించి ఒక్క సంభాషణలో సవివరంగా చెప్పారు.. హాట్సాఫ్ ఉత్తేజ్ గారు.
7. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కే అమాయకపు మనుషుల గురించి...మనం ఒక స్థాయికి ఎలా వచ్చామో చెప్పుకోలేనప్పుడు ఏ స్థాయిని చేరుకోగలిగితే ఏంటి!
8. మన దేశంలో ఉన్నవాళ్ళందరూ హిందువులో ముస్లిం లో క్రైస్తవులో సిక్కులో కాదు, అందరూ భారతీయులు.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలండి.