Here's How A Writer Wrote An Emotional Climax For His Story

Updated on
Here's How A Writer Wrote An Emotional Climax For His Story

Contributed By Pavan Kumar Dudam

సమయం రాత్రి పదకొండు గంటలు . కథ రాయడం ఇప్పుడే పూర్తయింది , ఆ రాసిన కథను ఎవరికో మెయిల్లో పంపాక ,laptop క్లోజ్ చేసి పక్కన పెట్టాడు భరద్వాజ. బయట చిన్నగా ఇప్పుడే వర్షం మొదలయినట్టుంది. అతని మనసంతా ఏదో సంతోషం. చాలా రోజుల తరువాత ఒక మంచి కథ రాశానన్న సంతృప్తి వల్ల కావచ్చేమో! కిటికీలోంచి వీచే చల్లగాలి మరింత హాయిగా అనిపిస్తోంది తనకి. కుర్చీలో కూర్చున్న భరద్వాజ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. గంటసేపటి తర్వాత.. అతని ఎదురుగా టేబుల్ మీదున్న ఫోన్ మోగుతోంది. ఆ శబ్దానికి మెళుకువొచ్చి , ఫోన్ చూసుకుని వెంటనే కాల్ ఎత్తి " హలో! " అన్నాడు.

అటువైపు నుండి.. "హలో సార్ నా పేరు సందీప్ ' కథానిక ' వెబ్ సైట్ నుండి మాట్లాడుతున్నాను. సారీ సార్ డిస్టర్బ్ చేశానా!? " " అదేం లేదు చెప్పండి " " సార్ ఇందాకే మీరు మాకు పంపిన కథ చదివాను. చాలా రోజుల తరువాత మీ నుండి మరో అద్భుతం. ఇన్ని రోజులు.. ' ముప్పై ఏళ్లకే భరద్వాజ గారి కలానికి ముసలితనం వచ్చేసింది.' అన్న నాలాంటి ఎందరో విమర్శకులకు ఈ ఒక్క కథ చెంప పెట్టులా ఉంది సార్. కథా రచనలో మీకు మీరే సాటి అని మరోసారి నిరూపిస్తుంది ఈ కథ."

"హో.. థాంక్యూ..(కొంచెం ఆగి) నిజంగా మీకు ఆ కథ నచ్చిందా !? " " సార్! నిజంగా నాకు చాలా నచ్చింది.. అందుకే ఇంత రాత్రి సమయంలో మీరు పడుకుని ఉండి ఉంటారు, ఈ టైమ్ లో కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అనుకున్నా పర్లేదు.. ముందు నా అనుభూతిని మీతో పంచుకోవాలని కాల్ చేశాను సార్ " "థాంక్యూ సో మచ్.. మిస్టర్ సందీప్" "సార్.. మీరేమనుకోను అంటే.. నాదొక చిన్న సలహా "

"అయ్యో..! మీరే నా కథకు మొదటి పాఠకుడు, నేనేం అనుకునోను. చెప్పండి" "సార్ నాకు ఆ కథ చదివాకా , చివరలో ఆ శివ పాత్రకి అలా.. ముగింపునివ్వడం ఎందుకో .. నాకు కాస్త న్యాయంగా అనిపించలేదు. అటు కన్న తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేసి , ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేసి , తన స్వార్ధం కోసం ఎంతో మంది జీవితాలను బలిచేసి, మత్తు పదార్థాలకి బానిసై , అతను ఇంకా ఎందుకు బతికే ఉన్నాడో రుచించలేదు. చివర్లో.. ఆ పాత్ర చనిపోయినట్లు చిత్రిస్తే ఇంకొంచెం బాగుండేది కదాని అనిపించింది. " "హహ్హ..హ" "క్షమించండి.. సార్ ! మీకు చెప్పేంత వాణ్ణి కాదు. నాకలా అనిపించింది మీకు చెప్పానంతే! "

"నో నో.. మిస్టర్ సందీప్ మీరు కరెక్ట్ గానే చెప్పారు , ఇన్ ఫ్యాక్ట్ నేనూ ముందు అలాగే అనుకున్నా. కానీ దీనికంటే ముందు రాసిన నా నాలుగు కథల్లోనూ.. అలా పాత్రలని ఏదో రకంగా చంపేయడం వల్ల.. అన్నీ స్యాడ్ ఎండింగ్స్ రాస్తుంటే ఎవరికీ నచ్చట్లేదు కదాని ఈ కథలో అలాగే వదిలేశాను సందీప్. "

" అవున్సార్.. మీరన్నట్లు స్యాడ్ ఎండింగ్స్ అన్ని సార్లు ఆడియన్సుకి నచ్చకపోవచ్చు కానీ ఈ కథలో మాత్రం ఆ శివ పాత్ర చనిపోతేనే హ్యాపీ ఎండింగ్ అవుద్ది . అయినా ఏం పర్వాలేదు సార్ ఈ కథ ఓ అద్భుతం , ఎంతో మంది చెడుదారిలో పయనించే యువతకు ఈ కథ మేలుకొలుపు , దీన్ని రేపు ఉదయమే మా కథానిక వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తాం"

"వద్దు సందీప్. నాకొక ఐదు నిమిషాలు సమయమివ్వండి , నేనిప్పుడే.. నేననుకున్న ఆ ఎండింగ్ నే.. రాసి పంపిస్తా . దాన్ని పబ్లిష్ చేయండి అప్పుడే ఈ కథకు ఓ కంప్లీట్ నెస్ దక్కుతుంది " "థాంక్యూ సర్.. " "ఇట్స్ మై ప్లెషర్ మిస్టర్ సందీప్ " "గుడ్ నైట్ సార్ " " వెరీ గుడ్ నైట్ " అని ఫోన్ పక్కన పెట్టేసి , కళ్ళద్దాలు పెట్టుకుని , లాప్టాప్ ఓపెన్ చేసి , " మెటా" అని పెట్టుకున్న ఫోల్డర్ తెరిచి , ఇందాకటి కథను ఓ సారి అలా.. మొదటి నుండి చివరి వరకు తనలో తాను చదవుకొని దానికి ఇప్పుడు ఎండ్ రాయడం మొదలుపెట్టాడు భరద్వాజ.

'గదిలో కూర్చుని ఎవ్వరికీ వినబడకుండా ఏడుస్తున్నాడు శివ' అనే ఆ చివరి వాక్యాన్ని బ్యాక్ స్పేస్ బటన్ తో చేరిపేసి , ' గదిలో కూర్చుని ఏడ్చిన శివ వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు లేచి , అలమారలో నుండి వోడ్కా బాటిల్ మూత తెరిచి , గ్లాసులో పోసుకుని, టేబుల్ డ్రాలో ఉన్న నిద్రమాత్రల డబ్బా మూత కూడ తెరిచి అందులో వేసుకుని బాగా కలిపి తాగి అక్కడే కుర్చీలో కూర్చుని కళ్ళు మూసాడు. - ది ఎండ్' అని టైప్ చేసి , సేవ్ చేసి మళ్లీ మెయిల్ చేశాడు. బయట వర్షం ఇంకా ఎక్కువయింది. ఆ మరుసటిరోజు దినపత్రికల్లో " కథా రచనలో దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగి, ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న యువ రచయిత ఆచంట శివ భరద్వాజ(34) గత రాత్రి హైదరాబాద్లోని అతని ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు " అని వార్తా కథనం.