శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అంటు ఏ పూజ కాని, పెళ్లి కాని మరే ఇతర శుభకార్యం కానివ్వండి మొదట గణపతి పూజ చేసి ఆ కార్యాన్ని ప్రారంభిస్తారు. ఎందుకంటే గణనాథుడు సర్వ విఘ్నాలను అరికడతారు కనుక. ఇలా ప్రమద గణాదిదేవతలలో మొదటగా పూజలందుకుంటున్న విఘ్నేశ్వరుడికి మొదటి గొప్ప దేవాలయంగా కాణిపాకన్ని పరిగణిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈ కోవెల ఉంది.
ఈ పవిత్ర కోవెల తిరుపతి నుండి 60కిలో మీటర్ల దూరంలో ఉంది. తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న భక్తులందరు శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయకుడిని కూడా తప్పక దర్శిస్తారు. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దివ్య క్షేత్రానికి ఒక పురాణ గాధ ఉంది. ఈ ప్రాంతాన్ని 'విహారి పురి' అనేవారు. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు ఇక్కడ అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరికి కళ్ళు కనిపించవు, ఒకరికి మాటలు రావు, ఇంకొకరికి ఏమి వినిపించవు. వారికి వున్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.
ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు వచ్చి నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. అప్పుడు కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఇక్కడ స్వామిని ఏ కోరిక ఐతే కోరుకుంటామో అది వరం గా వెంటనే జరగడం మూలంగ ఇక్కడి గణేషుడిని వరసిద్ది వినాయకుడిగా పిలుస్తారు. ఎక్కడ శ్రీరాముడు ఉంటే అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు అలాగే ఎక్కడ శివుడు అంటే అక్కడ అక్కడ వినాయకుడుంటాడు, ఈ కాణిపాకంలో శివుడు మణికంఠేశ్వర మహాదేవుడుగా దర్శనమిస్తారు. శ్రీ రాజ రాజ నరేంద్రుడు చేసిన బ్రహ్మహత్య పాపానికి ప్రాయశ్ఛితంగా ఈశ్వరునికి ఇక్కడే దేవాలయాన్ని నిర్మించారు. కేతు గ్రహదోష మున్నవారు ఈ దేవలయంలోని సిద్ది బుద్ది సమేతుడైన వినాయకుడిని పూజిస్తే కేతు గ్రహదోషం నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ భక్తులు తమకు చాల నచ్చినది వదిలేస్తే వారి కోరికలను వినాయకుడు తీరుస్తాడని విశ్వసిస్తారు.