ఒక పక్క నీటి కోసం అవస్థలు పడుతుంటాం కాని వర్షకాలంలో మాత్రమే కాదు సంవత్సరమంతా కూడా మన హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలలో నీరు వృధాగా పోతుంటుంది.. దీనికి రకరకాల కారణాలు ఉన్నా కాని ఒక్కటి మాత్రం నిజం "మనం నీటిని వృధా చేస్తున్నాం". సక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆకర్షణ ఉంటుంది, అలాంటి సక్సెస్ నీ అందుకోవడానికి చాలామంది అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. మిగిలిన రంగాలలో అనుకరణ అంత గొప్ప విషయం కాకపోవచ్చు కాని సమజానికి ఉపయోగపడే అనుకరణ మాత్రం ఎప్పటికి గొప్ప విషయమే..
ఇప్పుడు ఒక విషయంలో మనం అభినందనలు అందుకుంటున్నామంటే అదే విషయంలో ఏదో ఒకరోజు సమస్యను ఎదుర్కున్నామనే అర్ధం. 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చిన మొదట్లో కల్పన రమేశ్ దంపతులు కూడా నీటి సమస్యను ఎదుర్కున్నారు కాని త్వరగానే పరిష్కారాన్ని తెలుసుకున్నారు. నది నీటిని పంట పొలాలకు సరిగ్గా అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మనం తిట్టుకుంటున్నాం కాని మన కళ్ళముందు వృధాగా పోతున్న నీటి విషయంలో కూడా మనం అంతే నిర్లక్ష్యం చూపిస్తున్నాము. హైదరాబాద్ కు చెందిన కల్పన, రమేష్ దంపతులు మాత్రం ఈ నిర్లక్ష్యాన్ని ముందుగానే పసిగట్టి వర్షపు నీటిని ఒడిసి పట్టి సంవత్సరమంతా అన్నిరకాల అవసరాలకు వినియోగించుకుంటున్నారు.
గచ్చిబౌలి లోని కల్పన రమేష్ గారి ఇంటికి వెళితే పచ్చని మొక్కలు కుటుంబ సభ్యులులా మనల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తాయి. కేవలం వర్షపు నీటిని మాత్రమే కాదు స్నానం చేసిన నీటిని, ఇంటి కోసం ఉపయోగించిన నీటిని కూడా వీరు శుభ్రపరిచి రకరకాల అవసరాల కోసం వినియోగిస్తుంటారు. నీటిని శుభ్రపరిచేందుకు పూణే నుండి ప్రత్యేకంగా ఒక పరికరాన్ని దిగుమతి చేసుకున్నారు. అలా వర్షపు నీటిని మాత్రమే కాదు ఇంటి అవసరాల కోసం వాడిన నీటిని కూడా రీసైకిల్ చేసి రీ యూజ్ చేస్తున్నారు. వీరు నీటిని ఇలా కాపాడుకుని వాడడం చూసి గచ్చిబౌలి లోని చాలా కుటుంబాలు బోర్ వేయకుండా కల్పన రమేష్ లా వాళ్ళ ఇంటిని కూడా అలాగే మలుచుకున్నారు. గచ్చిబౌలిలో గ్రౌండ్ వాటర్ లెవల్ పెరగడానికి కారణం కూడా కల్పన రమేష్ దంపతులే.
TEDEX: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెడ్ ఎక్స్ టాక్ షో లో కూడా కల్పన రమేష్ గారు వారు చేసి సాధించిన ప్రగతిని వివరించి మరెంతో మందికి స్పూర్తినందించారు.