రేపు సోమవారం , మళ్లీ అదే చెత్త ఆఫీస్ , అవే పనికిమాలిన మీటింగ్లు. తను , నా కూతురు బయటికి వెళ్దాం అంటే , గుర్తొచ్చిన మొదటి పదం సినిమా. అలా ప్రశాంతంగా థియేటర్ కి వెళ్లి ఆ చీకటి గోడల మధ్యలో కోపం , చిరాకు , ప్రెషర్ , మేనేజర్ చివాట్లు , EMI ఆలోచనలు , బంధువుల అంచనాలు అన్ని మాయం అయిపోయాయి. సినిమా చూసేసి మంచిగా బయట తినేసి , ఇంటికి చేరిపోయాం ముగ్గురం.
రేపటికి చిన్నదానికి ఏదో కొత్త క్లాస్ వర్క్ బుక్ కావాలంటే సందు చివర షాప్ కి వెళ్ళాను. ఎలా అన్నా ఇంజనీరింగ్ లో వేయాలని ఆ షాప్ అంకుల్ , లేదు జర్నలిస్ట్ అవ్వాలని , Btech వద్దు అని వాళ్ళ కొడుక్కి మధ్యలో జరిగే గొడవ ఆలా చూస్తూ తెలీకుండానే ఒక 15 ఏళ్ళు వెనక్కి తీస్కెళ్లిపోయాయ్.
నా పేరు శ్రీకాంత్.ఇంచుమించు 17 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. సినిమా అంటే ప్రాణం , కళ అంటే ఏదో తెలియని అభిమానం , ఎప్పటికైనా 24 క్రాఫ్ట్స్ మధ్యలోనే బ్రతకాలని కోరిక. త్రివిక్రమ్ గారు అన్నట్టు మనిషిని కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుందనే మాట బలంగా ఉండిపోయింది గుండెలో. ఎందుకో తెలీదు ఆ మాట గుండెని తాకింది.
ఇంట్లో చెప్పను ఇలా సినిమాలొక్కి వెళ్దాం అనుకుంటున్నా అని
ఇంజనీరింగ్ అయ్యాక నీ ఇష్టం వచ్చింది చేస్కో అన్నారు. తప్పలేదు వెళ్ళాను.
2 ఏళ్ళు ఉద్యోగం ఉద్యోగం చేసి , కొంచెం ఆర్ధికంగా బలం అయినా తరువాత వెళ్లుచు అన్నారు . తప్పలేదు చేశాను.
26 కి ఇంత మంచి జీతం వదిలేసి ఎందుకు ఆ ముళ్ల కంప లోకి ? బాధ్యత లేదా ? ఇంకో 3 ఏళ్ళు ఆగమన్నారు. తప్పలేదు. ఈలోపు ఒక డజన్ EMI లు తెలీకుండానే తగులుకున్నాయి.
29 వచ్చాక చుట్టాల ఉచిత సలహాలు , గూచీ మాటలు అన్ని మూట కట్టి పెళ్లి చేసుకోమన్నారు.తప్పలేదు
ఇప్పుడు తను , నా కూతురు , 31 సంవత్సరాల నేను. రేపటి ఉద్యోగాన్ని తిట్టుకుంటూ , ఏమి చేయలేక , భయం తో దుఃఖం లాంటి సుఖ జీవితానికి అలవాటు పడిపోయాను.
తప్పలేదు అనుకున్న ప్రతిసారి , మాట్లాడి ఉండచ్చు కదా ? అనే ఆలోచన కూడా వచ్చేది కానీ , సమాజపు పరువు ఖరీదు సొంత కలల్ని త్యాగం చేసే అంత అని గట్టిగ వినపడేలా చెప్పారు.
కానీ నేను చేయాలనుకున్నది ఏంటి , చేస్తుంది ఏంటి ? బ్రతకాలనుకున్నది ఎలాగా ? బ్రతుకుతున్నది ఎలాగా ? అప్పుడు మాట్లాడి ఉంటె , ఇప్పుడు బాధ పడేవాడ్ని కాదేమో. ఇప్పటికి పోయింది ఏమి లేదు అనే వాదన కూడా అప్పుడప్పుడు నాలో ఇంకా ఆశ బ్రతికి ఉన్న మనసుకి అనిపిస్తుంది , మళ్లీ మౌనంగా ఉండి , తప్పలేదు అని ఈ ఇష్టం లేని పని చేయాలో అనే భయం ముందు ఓడిపోయేది.
ప్రయత్నిస్తే సాధించేవాడ్ని ఏమో ? ప్రయత్నిచలేదన్న నిరాశో ?
మొత్తానికి సంతోషంగా అయితే కచ్చితంగా లేను.
ధైర్యం తెచ్చుకుని దిగొచ్చేమో తెలీదు కానీ ....
నువ్వు .... నువ్వే ... నాలా బ్రతకడం కంటే నచ్చింది చేసుకుంటూ బ్రతకడం చాలా బాగుంటుంది , ఇది నరకం. మాట్లాడు , వాదించు , గొడవపడి , కానీ మౌనంగా మాత్రం తల దించుకోకు. నీ కలని , నీ కళని కాపాడుకోవాల్సింది నువ్వే.