This Woman's Dedication Towards Anganwadis Is A Perfect Example Of What It Takes To Be A Responsible Teacher!

Updated on
This Woman's Dedication Towards Anganwadis Is A Perfect Example Of What It Takes To Be A Responsible Teacher!

"నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రానా కాదు, ఈ ప్రపంచంలోని ప్రతి బిడ్డని నీ బిడ్డలా ప్రేమించినప్పుడే నువ్వు పరిపూర్ణమైన మాతృమూర్తివి అవుతావు. -జిడ్డు కృష్ణమూర్తి గారు."

స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎదుర్కుంటున్న అత్యంత పెద్ద సమస్యలలో ఒకటి 'బాలింతల మరణాలు'. దీనిని అరికట్టాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము అంగన్‌వాడి కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. అలాగే మహిళ గర్భవతి ఐన దగ్గరి నుండి పుట్టిన బాబు/పాప కు ఒక వయసు వచ్చేంత వరకు మంచి పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యలు మొదలైన అన్ని రకాలైన అవసరాలను ప్రభుత్వం నుండి అమలుచేయడమే వీరి ఉద్యోగం. సాధారణంగా అంగన్ వాడి కార్యకర్తలు ఒకానొక సమయంలో రెండో అమ్మగా పిల్లలకు సేవ చేస్తారు, ఇందులో ఎంతోమంది నిజాయితీతో తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ రేపటి పౌరులలో ఆరోగ్య సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇంతమంది గొప్ప కార్యకర్తలున్నా గాని మన కడారి మల్లమ్మ గారికి ఉత్తమ కార్యకర్తగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అవార్డును అందుకున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు తను పిల్లలకు ఏ మేరకు సేవచేశారో అని..

మల్లమ్మ గారు 17 సంవత్సరాలుగా అంగన్ వాడి కార్యకర్తగా తమ విధులను నిర్వహిస్తున్నారు. తన పిల్లలు లానే వారి పిల్లలను కూడా అదే విదంగా లాలిస్తారు, చదువు నేర్పిస్తారు, ఆటలు ఆడతారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గర్భవతులకు, పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినాగాని మల్లమ్మ గారు అక్కడికి చేరుకుంటారు. డిగ్రి చదువుకున్న మల్లమ్మ గారు మొదట ఎనిమిది మందితో ఉన్న అంగన్ వాడి కేంద్రంలో పనిచేయడం మొదలుపెట్టారు.

మన భారతదేశాన్ని ఒక మహిళగా భావించి భారతమాతగా కీర్తిస్తారు కాని వారికి ఆడపిల్ల పుడితే ఇష్టపడరు.! పేదవారిలో మాత్రమే కాదు సంపన్న కుటుంబాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒకసారి ఓ మహిళ ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక తన పాపను అమ్మడానికి సిద్దపడ్డారు. మల్లమ్మ గారు వారింటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ దారుణం జరుగకుండా ఆపగలిగారు, మరోసారి పదిమంది బాల కార్మికులను గుర్తించి ఆ పంజరం నుండి వారిని విడిపించారు. అంగన్ వాడి కేంద్రాన్ని ప్రైవేట్ ప్లే స్కూల్స్ లకు ధీటుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తన శక్తికి మించి తన ఉద్యోగ విధులను మించి చేస్తున్నారు. సమాజం పట్ల విధేయత, పిల్లల పట్ల ప్రేమ ఉంటే తప్ప ఇన్ని గొప్ప కార్యక్రమాలు సాధ్యపడవు. కడారి మల్లమ్మ గారిలోని ఈ నిజాయితీనే గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుండి పురస్కారం అందుకున్నారు.