K Raghavendra Rao, The Man Who Mesmerized Telugu Audiences With His Films!

Updated on
K Raghavendra Rao, The Man Who Mesmerized Telugu Audiences With His Films!

కె. విశ్వనాథ్ గారి సినిమాలకు ఒక స్టైల్ ఉంది, బాపు గారికి, దాసరి నారాయణ రావు గారికి, కోడి రామకృష్ణ గారికి, వంశి గారికి ఇలా ఆనాటి దర్శకులందరికి ఒక స్టైల్ ఉంది.. వారు సినిమాలన్ని ఒకే రకమైన పద్దతిలో చేస్తూ ట్రెండ్ ఏదైనా గాని వారి ట్రెండ్ నే నమ్ముకుని మంచి విజయాలు దక్కించుకున్నారు.. కాని దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు మాత్రం అందరిలా ఒకే రకమైన పద్దతులు ఎంచుకోలేదు సరికదా ఆయనే ఇండస్ట్రీలో చాలా సార్లు ట్రెండ్ సృష్టించాడు. నిజానికి తెలుగుసినిమా చరిత్ర రాఘవేంద్ర రావు గారికి ముందు ఆయన తర్వాత అని చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఒక తెలుగు సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసింది అని గర్వంగా చెప్పుకుంటున్నాం వీటన్నీటికి ప్రాతిపదిక ఐన కమర్షియల్ ఎలిమెంట్స్ ని మన ఇండస్ట్రీలో దిగ్విజయంగా పరిచయం చేసింది రాఘవేంద్రుడే.

9
6

కోవెలమూడి రాఘవేంద్రరావు 1942 మే 23న కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని కోలవెన్ను గ్రామంలో జన్మించారు. తండ్రి సూర్య ప్రకాష్ రావు గారు కూడా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ అవ్వడం మూలంగా తండ్రి ప్రోత్సాహంతో దాదాపు 10సంవత్సరాలకు పైగ సహాయ దర్శకుడిగా పనిచేస్తు దర్శకత్వంలో విలువైన మెళకువలు నేర్చుకున్నారు.

5

రాఘవేంద్రరావు గారు శోభన్ బాబు గారు హీరోగా 'బాబు'(1975) అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత జ్యోతి, ఆమెకథ, అమరదీపం, కల్పన లాంటి సినిమాల ద్వారా దర్శకత్వంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

4

అప్పటి వరకు చాలా సినిమాలో పాటలు రాగానే అదేదో విశ్రాంతి విరామం అన్నట్టుగా థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వెళ్ళెవారు కాని దర్శకేంద్రుడి రాక తర్వాత ఆ పద్దతి మారిపోయింది.. సినిమా కోసం మాత్రమే కాదు ప్రత్యేకంగా పాటలు చూడడం కోసం కూడా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన అతికొద్ది దర్శకులలో ఆయన ఒకరు. హీరోల రాజసంతో పాటు హీరోయిన్ల హొయలు, అందచందాలు ఇంకా తన దర్శకత్వ పటిమ ద్వారా పాటలకు ఒక కొత్త గ్లామర్ ను తీసుకువచ్చారు. ఆయన వాడినన్ని రంగులు ఇంకెవ్వరు వాడలేరేమో అన్నంత అందంగా చిత్రీకరణ చేశారు.

10

రాఘవేంద్ర రావు గారు అన్నమయ్య, పెళ్ళిసందడి, అల్లరిప్రియుడు, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారాలను అందుకున్నారు. దర్శకులు “ఉత్తమ దర్శకుడు” అని అవార్ఢు అందుకోవడం ఒక అద్భుతం అలాంటిది పెళ్ళిసందడి సినిమాలో పాటలకు కొరియోగ్రఫి అందించి దానికి ఉత్తమ కొరియోగ్రఫర్ గా ఏకంగా నంది అవార్ఢునే అందుకున్నారంటే వివిధ శాఖలపై ఆయనకున్న పట్టు ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

7
8

ప్రతి హీరో ఆయన దర్శకత్వంలో కథ నాయకుడిగా చేయాలని పరితపించేవారు, తనని రాఘవేంద్రరావు గారు చూపించినంతగా మరే ఇతర దర్శకులు చూపించలేరు అని హీరోలు నమ్ముతారు.. అందుకు తగ్గట్టు గానే సీనియర్ ఎన్.టి.ఆర్ కు అడవి రాముడు, చిరంజీవి గారికి జగదేక వీరుడు అతిలోక సుందరి, శ్రీ మంజునాథ, కృష్ణ గారికి అగ్ని పర్వతం, కృష్ణంరాజు గారికి బొబ్బిలి బ్రహ్మన్న, శోభన్ బాబు గారికి దేవత, వెంకటేష్ గారికి కూలీ నెం.1, నాగార్జున గారికి అన్నమయ్య, మోహన్ బాబు గారికి మేజర్ చంద్రకాంత్, రాజశేఖర్ గారికి అల్లరి ప్రియుడు ఇలా పనిచేసిన ప్రతి ఒక్క హీరోకు వారి ఎంటైర్ కెరీర్ లోనే ఎప్పటికి గుర్తిండిపోయే చిత్రాలను అందించి ఆ హీరోలకు ఇష్టమైన దర్శకుడిగా వారి అభిమానాన్ని అందుకుంటున్నారు. నేడు మనం అగ్ర హీరోలుగా కీర్తిస్తున్న వెంకటేష్(కలియుగ పాండవులు), మహేష్ బాబు(రాజకుమారుడు), అల్లు అర్జున్(గంగోత్రి) వీళ్ళందరిని దర్శకేంద్రుడే తొలిసినిమాతో పరిచయం చేశారు.

3

కె. రాఘవేంద్ర రావు బి.ఏ అంటే కేవలం పాలు, పాటలు, పండు, బొడ్డు, ఫైట్లు అనుకుంటారు కొంతమంది కాని అన్నమయ్య, శ్రీ మంజునాధ, శ్రీ రామదాసు, పాండురంగడు, శిరిడి సాయి, ఇప్పుడు నాగార్జున గారితో ఓం నమో వేంకటేశాయ లతో తనదైన శైలిలో భక్తిరసా చిత్రాల ద్వారా పెద్దవయసుల వారికే కాక యువ ప్రేక్షకులలో కూడా భక్తి ని పెంపొందిస్తున్నారు. హై బడ్జెట్ సినిమాలనే కాక చిన్న హీరోలతో కథ ప్రాముఖ్యత ఉన్న సినిమాలను అందించి ఏ భేషజం లేకుండా టి.వి లో సైతం మంచి సీరియల్స్ లను తెరకెక్కించిన ఘనత రాఘవేంద్రుడుది.

2

ఇండస్ట్రీలో ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ఆత్మబంధువు. ఆయన చల్లని చేయి మంచిదని ప్రతి ఆడియో ఫంక్షన్ లకు, షూటింగ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక గౌరవ అతిధిగా ఆయనను ఆహ్వానిస్తుంటారు. తనలాంటి పేరు, గుర్తింపు, గౌరవం ఇప్పటి యువ దర్శకులు సైతం అందుకోవాలని 'సౌందర్య లహరి' ప్రోగ్రామ్ ద్వారా ఔత్సాహిక దర్శకులకు దిక్సూచిగా నిలిచారు. ఇంతటి గొప్ప మనసున్న ఈ 75 ఏళ్ళ యువ నిత్య విద్యార్ధికి జన్మదిన శుభాకాంక్షలు…

1