Presenting The Incredible Journey Of Netaji Subash Chandra Bose For Freedom of India!

Updated on
Presenting The Incredible Journey Of Netaji Subash Chandra Bose  For Freedom of India!

16 జనవరి 1941 అర్ధ రాత్రి 1.30 నిముషాలు,మంచు దుప్పలు కప్పుకున్న కలకత్తా నగర రోడ్లపై వేగంగా ఓ కారు దూసుకుపోతుంది ,ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన మొహమ్మద్ జియాఉద్దీన్ పెషావర్ ప్రయాణం కోసం రైల్వే స్టేషన్ కి బయలుదేరాడు,ఎవరికీ కనపించకుండా జాగ్రతలు తీసుకుంటూ కారు నడుపుతున్న వ్యక్తికి సూచనలిస్తూ ఆ ప్రయాణం సాగుతోంది . ఒక సాధారణ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంత జాగ్రతగా అప్రమత్తతతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏం ఉంది ?? అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు,అతని పేరు జియాఉద్దీన్ కాదు,అతను సుభాష్ చంద్ర బోస్.

ఇంట్లోని వారికి,బందువులకు తాను కఠోర ఉపవాస దీక్ష చేయబోతున్నాను అని నమ్మించి తన ఇంటి చుట్టూ ఉన్న బ్రిటిష్ గూడచారులు కూడా ఈ విషయాన్ని రూడీ చేసుకున్న తరువాత గృహ నిర్బంధం నుండి తప్పించుకున్నాడు . దేశ స్వతంత్రం కోసం ఇతర దేశాల మద్దతు కూడగట్టి బ్రిటిష్ ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించాలని బోస్ వ్యూహం ,ఇందుకు కావాల్సిన ప్రణాళిక అంతా జైలులో ఉన్నపుడే సిద్దం చేసుకున్నాడు . దానికి అనుగుణంగా మొదట పెషావర్ చేరాలని తన సుదీర్గ ప్రయాణాన్ని ప్రారంబించాడు.

పెషావర్ చేరుకున్న తరువాత అక్కడి కీర్తి కిసాన్ పార్టీ నాయకుడైన భగత్ రాం తల్వార్ సాయంతో ఆఫ్ఘనిస్తాన్ కి ప్రయాణం అయ్యాడు అక్కడి పోలీసులకి అనుమానం రాకుండా తానొక మూగ వాడినని నమ్మించి ఆఫ్ఘన్ లోని కాబుల్ చేరుకున్నాడు . కాబుల్ లో సోవియట్ రష్యా విదేశి వ్యవహారాల కార్యాలయం చేరి రష్యా సాయం తీసుకోవాలని సుబాష్ అనుకున్నాడు,కాని అక్కడి కార్యాలయ అధికారులు అతనే సుబాష్ చంద్ర బోస్ అని నిర్ధారించుకోలేక పోయారు , ఆ కారణంగా బోస్ కాబుల్ లోనే రెండు నెలలు ఉండాల్సి వచ్చింది,మరో వైపు ఇటలీ జర్మనీ అధికారులతో సంప్రదింపులు జరుపుతుండేవాడు. ఎన్నో ప్రయత్నాలు, ఎదురుచూపుల తరువాత ఇటలీ ప్రభుత్వం బోస్ కి ఓర్లాండో మజ్జోట్టా పేరు తో పాస్ పోర్టు ఇచ్చింది .ఆ పాస్ పోర్టు తో మాస్కో చేరి అక్కడి రష్యా ప్రభుత్వ సహకారం తో బ్రిటిష్ వారిపై పోరాడేందుకు ప్రణాళికలు రచించుకున్నాడు బోస్, కాని రష్యా ప్రభుత్వం నుండి సహకారం ఆశించినంతగా రాకపోవడం తో ,బోస్ దృష్టి సామ్రాజ్య వాద దేశమైన బ్రిటిష్ పై యుద్ధం ప్రకటించిన జర్మనీ పై పడింది .

భారత దేశ స్వతంత్రం కోసం సైతాను తో కూడా చేయి కలిపేందుకు నేను సిద్దం అని బోస్ అంటుండేవాడు, అందుకే జర్మన్ నియంత అయిన అడాఫ్ హిట్లర్ తో కలిసి బ్రిటిష్ పై పోరాడేందుకు సిద్దం అయ్యాడు , జర్మనీ దళాల ఆదీనంలో యుద్ద ఖైదీలుగా మారిన బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన భారతీయులని తన ప్రసంగాలతో ఆకట్టుకొని వారిని దేశ స్వతంత్రం కోసం పోరాడే వీర సైనికులుగా మారేందుకు సిద్దం కమ్మని పిలుపునిచ్చాడు. దాదాపు 4500 మంది సైనికులను తయారు చేసాడు,జర్మనీ సైనిక సాయంతో రష్యా మీదుగా బ్రిటిష్ ఆదీనంలోని భారత్ పై దాడి చేయాలని ఈ పోరాటంలో భారత సైనికులు కూడా కలిసి వస్తారని భావించాడు ,కాని అనుకోని ఆపద ఎదురైనట్టు హిట్లర్ రష్యా పై కూడా దాడులు చేస్తూ నెయ్యాన్ని కయ్యంగా మార్చాడు , బోస్ మరో అడ్డంకి ఏర్పడింది .

భారత్ లో అప్పటికే క్విట్ ఇండియా ఉద్యమం ఉదృత రూపం దాల్చింది,Do or Die అని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో యావద్ భారతం సమరోత్సాహంతో ఉద్యమం చేస్తుంది,బ్రిటష్ పై ఇంటా బయట ఒత్తిడి పెరిగిపోతున్నది,ఇటు వంటి సందర్బం కోసమే ఎదురుచూసిన బోస్ భారత్ విముక్తి కోసం ఇదే సరైన సమయం అని భావించాడు . ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నూతన అవకాశాలు సృష్టించుకోవడం బోస్ కి అలవాటే , అప్పటికే రెండో ప్రపంచ యుద్దంలో ప్రవేశించిన జపాన్ భారత్ విముక్తి కోసం సాయం చేయగలదని భావించాడు , జపాన్ చేరుకొని సింగపూర్ మలేషియా నుండి బర్మా మీదుగా భారత్ చేరి ఒక్కో ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకోవాలని బోస్ భావించాడు , బర్మా,సింగపూర్,మలేషియాలోని భారతీయుల సహాయం కూడా తమకి కలిసొస్తుందని ,ఇదే సరైన వ్యూహం అని నిర్ధారించుకున్నాడు .జపాన్ చేరేందుకు జర్మనీ సాయం చేసింది,జలాంతర్గామిలో బోస్ ని సురక్షితంగా మడగాస్కర్ వరకు చేర్చింది అక్కడి నుండి జపాన్ జలన్తర్గామిలో ఇండోనేషియా చేరుకున్నాడు.

జపాన్ ప్రభుత్వ సహాకారంతో ఆయుధాలు సమకూర్చుకొని, రాజ్ బీహారి బోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీని సుబాష్ స్థాపించిన ఆజాద్ హింద్ పఫుజ్ తో కలిసి దేశ విముక్తి కోసం పోరాడేందుకు సిద్దం కావాలని సైనికులని తన ఉత్తేజబరితమైన ప్రసంగాలతో వారిలో స్ఫూర్తి నింపాడు, మీ రక్తం నాకివ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ సామాన్యులను సైతం సైన్యంలో చేరేలా వారిని చైతన్య పరిచాడు. జైహింద్ నినాదమే తారక మంత్రంగా చలో దిల్లీ చలో దిల్లీ అంటూ దిల్లి లో త్రివర్ణ పతాకం రెపరెపలాడే దాక పోరాడదాం అంటూ వారిలో స్వతంత్ర కాంక్ష ని రగిలించాడు .తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు,ఆ ప్రభుత్వాన్ని జపాన్ వంటి దేశాలు గుర్తించాయి కూడా.తన సైనిక బలగంతో అండమాన్ నికోబార్ దీవులను ఆదీనంలోకి తీసుకున్నాడు వాటికి షహీద్ ద్వీప్ స్వరాజ్ దీప్ గా నామకరణం చేసాడు,ఇంఫాల్ కొహిమ ద్వార భారత్ భూభాగంలోకి చేరాలని వ్యూహరచన చేసాడు,కాని రెండో ప్రపంచ యుద్దంలో అణుబాంబు ప్రయోగం తరువాత జపాన్ లొంగిపోవడం పెను నష్టానికి దారి తీసింది. ఏ సహాయ సహకారాలు లేకుండా ఒంటరిగా పోరాడేంత శక్తి లేకుండా పోయింది,సైనికుల ఆరోగ్యం కూడా క్షీణించడం మరో కారణం . చివరికి ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా లొంగిపోవాల్సి వచ్చింది. వియత్నాంలోని సైగాన్ నుండి టౌరెన్ కి ప్రయాణమైన సుభాష్ విమాన ప్రమాదంలో మరణించాడని అధికార వర్గాలు తెలిపాయి .

ఇండియన్ సివిల్ సర్వీస్లో ఉద్యోగాన్ని తృణప్రాయంగా వొదిలేసి దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ అమరుడైన బోస్ ఎన్ని తరాలకైనా స్ఫూర్తి దాయకుడే . ఎక్కడి కలకత్తా ఎక్కడి కాబుల్,ఎక్కడి భారత్ ఎక్కడి జర్మనీ,ఇన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం స్వేచ్చ అనే గమ్యం కోసమే,దేశం పరపీడనలో ఉండకూడనే ఏకైక లక్ష్యం మాత్రమే అతన్ని నడిపించింది, కలకత్తాలో సుబాష్ బాబు,బోస్ బాబుగా పిలువబడే వ్యక్తి జియాఉద్దీన్ గా మారి తరువాత ఓర్లాండో మజ్జోట్టా గా మారి చివరికి నేతాజీ సుబాష్ చంద్ర బోస్ గా భారత మాత వీర పుత్రుడిగా చరిత్రలో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు .

ధిక్కారం అతని నైజం, తెగింపు తిరుగుబాటు అతని రక్తంలో ఉంది పోరాటం అతని సహజ లక్షణం, ఎదురు తిరగడం అతని తత్త్వం, సాహసం అతని ఊపిరి, స్వతంత్రం అతని గమ్యం ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడి గగనంలో ధ్రువ నక్షత్రంగా వెలుగుతున్న ఓ నేతాజీ నీకివే మా జోహార్లు.....