This Fan's Ode To Joaquin Pheonix's Joker Is Perfect Tribute In Telugu

Updated on
This Fan's Ode To Joaquin Pheonix's Joker Is Perfect Tribute In Telugu

Contributed By Swaroop Thotada

వెలుగు బళ్లాలు ఇక చొచ్చుకెళ్లలేనంత దూరం అవతల ఒంటరిగా నిశ్శబ్దంగా పారుతున్నట్టు నాటకాలాడే చీకటి, లేలేత రంగుల ముసుగులు వేసుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ ముసుగు లోపలి చీకటిని మీరు గుర్తించలేరు.

సాయంత్రానికీ రాత్రికీ మధ్య కిటికీలోంచి కనబడే దూరపు కొండల ముదురు పచ్చని తీరిగ్గా మేసే ఆ చీకటి, రాత్రి కురిసే వేదనలకి పొగ మంచు తివాచీ పరిచి రమ్మంటుంది. స్ట్రీట్ లైట్ కి సిలువ వేయబడ్డ వెలుగు, కదల్లేని నిస్సహాయురాలు. ఆదమరిచి నిద్రపోయే మీకు ఇవి కనబడవు.

ప్రపంచం పగబట్టిందనుకున్న అమాయకపు బాల్యం చిదిమేసుకుని, అనంత విశ్వంలో ప్రపంచం సిగరెట్ అంచున వెలిగి రాలిపోయే క్షణికాగ్ని అనేసుకుని, పొగని లోపలికీ బైటికీ పంపిస్తూ తలవాల్చి కన్నీళ్లను వెనక్కి పంపించే వృద్ధాప్యంలో, జేబులోంచి జారిపోయిన యవ్వనాన్ని వెతుక్కునే వాడంటే మీకొక "sad character" మాత్రమే. మీ TV లు మీరు చూడండి

వర్షం వెలిశాక సాయంత్రపు లేత ఎండకు మెరిసే వీధి రోడ్డు, తడిసి ముద్దైన చెత్త, గదిలో నీరసంగా వెలిగే బల్బు, గచ్చు నుంచి గోడల వరకూ అంతటా పాకిపోయి వేళ్ళతో గోళ్ళతో పొడిచే చలి..... ఇవి ఎంత melancholic అని మీకు అర్ధం కాదు కదూ!మీకు చెప్పలేను కూడా. జానెడు జానెడు ఒంటరితనాన్ని కొలుచుకుంటూ light years దూరం వచ్చేసాను, ఇక్కడి నుంచి అరిస్తే మీకు వినపడదు.

గంటకోసారి డొక్కలో తన్నే జీవితాన్ని ప్రేమించటం నాకు చేతకాదు మరి. కానీ ఇన్ని గాయాలతో ఇక్కడే నిలబడి నాట్యం చేయబుద్ధవుతుంది. ఇన్ని ముక్కలైపోయాక ఇంకా విరచటం జీవితానికి వీలు కాదనీ ఏదో విజయోత్సాహం. Thoreau అన్నట్టు మనందరికీ వేరు వేరు సంగీతాలు వినబడతాయి కాబోలు. విషాద గీతాలకు కూడా స్టెప్పులు కనిపెట్టాడెవడో. వాడు పిచ్చోడేం కాదు మీరనుకున్నటు...వదిలేయండి... You wont get it....