(Story contributed by Amuktamalyada)
ఆ రోజు (డేట్ గుర్తులేదు) మూడు సంవత్సరాల తరువాత తన దగ్గరనుంచి message వచ్చింది. FB లో తన మెసేజ్ చూడగానే కంగారు పడ్డాను. మళ్ళి తన జ్ఞాపకాలు నన్ను వెంటాడ సాగాయి. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తనని block చేశాను. మనసులో ఏదో తెలీని ఆరాటం, ఆందోళన, ఆవేశం. ఇవన్నీ కలిసి నాలో నిక్షిప్తంగా దాచుకున్న కన్నీటిని ఉప్పొంగేలా చేశాయి. ఎందుకిలా జరిగింది, ఎందుకిలా జరుగుతోంది అని గతాన్ని, వర్తమానాన్ని ప్రశ్నించాను. కానీ ఆ రోదన అంత చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఎవ్వరికి వినిపించలేదు. కన్నీటిని తుడిచి మళ్ళి యదార్ధ జీవితంవైపు అడుగులు వేయడం మొదలు పెట్టాను .
ఆ నడకలోనే పెళ్లి పీటలు ఎక్కాను. గతంలో చవి చూసిన బాధల్ని, గాయాల్ని మటుమాయం చేస్తూ పెళ్లి నాలో ఒక కొత్త ఉత్సాహాన్నినింపింది. ఆకాశంలో స్వేచ్చగా విహరించే విహంగానిగా మార్చింది. గిర్రున తిరిగే కాల చక్రంతో పోటీ పడడం కోసం పరుగు తీసీ అలసిపోయి, ఒక చోట ఆగి సేద తీర్చుకుంటున్న సమయంలో గతం తాలూకు తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. రోజు తెరిచినట్టే ఆ రోజు కూడా FB ని తెరిచాను. అప్రయత్నంగానే తన పేరును block list నుంచి తొలగించి తన timeline చూశాను.
ఆశ్చర్యం తను ఇంకా నన్నే తలుచుకున్తున్నడా అనే విధంగా ఉన్నాయి తన statusలన్నీ. తన కలల్లో ఒక అమ్మాయి రాణి అట, కానీ ఆ అమ్మాయి తన జీవితంలో కలగా మిగిలిపోయిందట. మనసును మరల్చుకొని కాల చక్రంలో పడిపోయాను. మళ్లీ కొన్నాళ్ళ తరువాత తన status చూశాను. ఆశ్చర్యం, నేను తనని గమనిస్తున్నానని తనకు తెలిసిపోయింది అన్నట్లు indirectga ఉంది ఒక status. ఆలోచించగా నాకు నవ్వొచింది. తన status నా కోసమే అని నేను అనుకోవడం నా వేర్రితనమో, లేక, ఒకవేళ నేను ఊహించినదే నిజమైతే అది తన పిచ్చితనమో అర్ధం కాలేదు .
జీవితంలో ప్రేమ ఒక్కసారే కలుగుతుంది అని భ్రమపడడం ఎంత సహజమో, మనం మొదటి సారి ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కూడా అంతే కష్టం. నేను నా భర్తను ఈ ప్రపంచంలో అందరికన్నా అమితంగా ప్రేమిస్తున్నాను . అలాగని నేను నా గతంలో ప్రేమించిన వ్యక్తిని ద్వేషించాలేను. ఈ ప్రేమకి, ఆ ప్రేమకి మధ్యన సన్నని గీత ఉంది. గీతకి ఎటువైపు ఉండాలో తెలిసిన వారి జీవితం స్వర్గం. అలా తెలియని వారి జీవితం నరకం.
మీరు గీతకి ఎటువైపు నున్చున్నారో ఆలోచించండి.