CBI Officer JD Lakshmi Narayana's Son Is Soon Going To Be An IPS & Here's His Story

Updated on
CBI Officer JD Lakshmi Narayana's Son Is Soon Going To Be An IPS & Here's His Story

‌కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి సాగరసంగమం సినిమా చివరిలో ఓ అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంటుంది. అప్పటి వరకు ఓ తపస్సులా నేర్చుకున్న నాట్యాన్ని బాలు(కమల్ హాసన్) శైలజ కు ఆర్పించి శాశ్వితంగా విశ్రాంతి తీసుకుంటాడు. కళ అనేది చెరువులా ఒకే చోట ఉండి కొంతమందికే దాహం తీరుస్తూ ఎండిపోకూడదు.. అది ప్రేమ ప్రవాహంలా ఒక చోట నుండి మరో చోటుకు నిరంతరం ప్రవహిస్తూ ప్రాణికోటికి ప్రాణం ఇవ్వాలనే గొప్ప సందేశం ఆ సన్నివేశం చెబుతుంది. నిజాయితీగా దేనికీ లొంగకుండా సమాజానికి సేవ చేసే ఉద్యోగం లోనూ కళ ఉంటుంది. ఇది యాదృచ్చికమో లేదంటే ప్రకృతి వేసిన ప్రణాళిక ఏమో తెలియదు కాని మొదట ఐ.పి.ఎస్ అధికారిగా తర్వాత సీబీఐ జేడి గా ప్రజల సొమ్మును అన్యాయంగా దోచుకున్న వ్యక్తులను కటకటల్లోకి తోసి, ప్రస్తుతం గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మహారాష్ట్ర పోలీస్ కమిషనర్ గా రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే వారి అబ్బాయి సివిల్స్ లో 196 వ ర్యాంక్ తో ఎన్నికకావడం.. ఇది కూడా సమాజానికి ఉపయోగపడే అద్భుత సన్నివేశమే..

‌స్టూడెంట్ నాయకుడు:

‌లక్ష్మీ నారాయణ గారిని ఇప్పటి యువతరం రియల్ హీరోగా గుర్తిస్తున్నారు. "ఫేస్ ఉన్న ఉన్నవాడికి ఫేస్ బుక్ అవసరం లేదు" అనే సూచనల ద్వారా మన యువత ఎక్కడో ఉండి కలవకపోయినా ఎంతో నేర్చుకుంటున్నారు. అలాంటి నాయకుడి ఇంట్లో పెరిగే కుమారుడు లక్ష్మీ నారాయణ గారి నుండి ఇంకెంత నేర్చుకున్నారో మనం ఊహించగలం. ఇంటర్మీడియట్ పూర్తికాగానే బిట్స్ సాట్ రాసి బిట్స్ పిలానిలో జాయిన్ అయ్యారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో స్టూడెంట్ లీడర్ గా ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు ప్రణీత్.

‌కేవలం ఒక్క సంవత్సరం లోనే:

‌ప్రతి పిల్లాడికి తన తండ్రే హీరోగా కనిపిస్తాడు. చిన్నతనం నుండి నాన్న బాధ్యత గల అధికారిగా సర్వీస్ చేస్తుండడం, దానికి ప్రజల నుండి అనిర్వచనీయమైన హర్షద్వానాలు అందుకోవడంతో పాటు, దాదాపు ప్రణీత్ ను కలిసిన ప్రతిఒక్కరు కూడా లక్ష్మీ నారాయణ గారి వృత్తి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వివరిస్తూ "నువ్వు కూడా నాన్నంత స్థాయికి ఎదగాలి" అంటూ మోటివేట్ చేసేవారు.

‌బిట్స్ పిలానిలో నాయకుడిగా ఎన్నికవ్వడం కూడా సివిల్స్ పట్ల ఆసక్తిని మరింత పెంచింది. నాయకుడిగా కొన్ని కొన్ని అధికారులతో కాలేజీలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగితే ఇంకా సివిల్ సర్వెంట్ గా ప్రజలకు ఎంతో మంచి చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో పాటు, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ లో సివిల్స్ బెస్ట్ ఆప్షన్ అని ఇంజినీరింగ్ పూర్తిచేసిన 2016లోనే (ఢిల్లీ) కోచింగ్ మొదలుపెట్టాడు. అలా కేవలం ఒక్క సంవత్సరంలోనే సివిల్స్ లో జాతీయ స్థాయిలో 196 ర్యాంక్ సాధించాడు.

‌నాన్న గారి సహకారం:

‌నిజానికి ప్రణీత్ ఈ స్థాయి ర్యాంక్ సాధిస్తాడని అనుకోలేదట. కేవలం తన తరపున తనలోని బెస్ట్ టాలెంట్ ను పరీక్షలో ప్రదర్శించాలని భావించాడట. లక్ష్మీ నారాయణ గారు ఫోన్ ద్వారా సబ్జెక్ట్ విషయంలో గైడెన్స్ ఇచ్చేవారు. అలాగే అత్యంత కీలకమైన ఇంటర్యూలో "బాడీ లాంగ్వేజి కానీ, మన మాటతీరు" లాంటి వాటిలో విలువైన సూచనలు అందించారు. 40 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ ఇంటర్యూలో తన భావాలను తెలియజేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది.

‌ఐపీఎస్ ఆఫీసర్ గా:

‌మన సంఘంలో పోలీస్ అంటే తప్పుచేసిన వారికే కాదు మంచివారికి సైతం ఓ విధమైన భయం, కోపం ఉంది, దీనికి రకరకాల కారణాలు అయ్యుండొచ్చు. ఆ భయం, కోపం వల్లనే నేరాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనిని నివారించడానికి ఉన్న మొదటి మార్గం ప్రజలతో మమేకం అవ్వడం. వారికి దగ్గరిగా ఉంటూ సమస్యలపై పోరాడడానికి ముందుకు సాగుతున్నాడు 23 సంవత్సరాల ప్రణీత్..