నిజానికి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నా కాని ఇప్పటికి కొన్ని ప్రత్యేక రంగాలలో మాత్రం మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి వాటిలో మెకానిక్ రంగం కూడా ఒకటి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నా నా సైకిల్ ని, బైక్ ని, మా ఫ్రెండ్ కార్ ని ఒక మహిళ రిపేర్ చెయ్యడం ఇప్పటికి చూడలేదు. నాకు విద్య నంబిరాజన్ గురించి తెలియగానే చాలా ఆశ్చర్యమేసింది. తను ఇప్పటికి 17 సంవత్సరాల నుండి ఇదే రంగంలో ఉన్నారు. ప్రభుత్వం తరుపున మొదటి మహిళ మెకానిక్ గా గుర్తింపు పొందారు, తను మాత్రమే మెకానిక్ గా కాదు సాటి మహిళలకు కూడా ఉచితంగా శిక్షణను అందిస్తూ మహిళాలోకానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
దారి తీసిన పరిస్థితులు: ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, ఇక్కడికి మహిళలు రావలంటే అన్ని దారులు మూసుకుపోయి ఇక చేసేదేమీ లేనప్పుడే రావాల్సి ఉంటుంది. కాని విద్య గారి పరిస్థితి అలా లేదు. అప్పటికే విద్య గారు ఎం.బి.ఏ పూర్తిచేశారు. హెచ్.సి.యల్ లో మార్కెటింగ్ హెడ్ గా జాబ్, మంచి సాలరీ అంతా హ్యాపీగా గడిచిపోతుంది. విద్య గారి ఫాదర్ నడిపిస్తున్న 'పారామౌంట్ ఆటో బే సర్వీసెస్'(మధురనగర్,సికింద్రాబాద్) లో నష్టాలు వచ్చాయి. వయసు మీద పడడంతో నాన్నకు చూసుకోవడం కష్టం అవుతుంది.. తమ్ముడు చిన్నవాడు, అన్నయ్య కు ఈ రంగం మీద అంతగా ఆసక్తి లేకపోవడంతో నాన్న కోరిక మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి గ్యారేజ్ బాధ్యతలు విద్య గారు తీసుకోవాల్సి వచ్చింది.
మెకానిక్ గా మొదటి అడుగులు: గ్యారేజ్ బాధ్యతలు తీసుకోవడం అంటే కూర్చిలో కూర్చుని మిగిలిన వారితో పనులు చేయించడం కాదు అని కార్ మెకానిక్ పనిని నేర్చుకున్నారు. ఇందుకోసం తండ్రి సహాయం తీసుకుంది. అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని అనుకుంటుండగానే అక్కడ పనిచేస్తున్న మెకానిక్ లు ఒక మహిళ దగ్గర మేము పనిచెయ్యలేము అని ఒక్కరొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడే తనకు జీవితమంటే, అందులోను ఒక మహిళగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అని ముందుగానే ఒక అవగాహన వచ్చింది..
ఒక మహిళా మెకానిక్ గా కొంతకాలం వరకు తనే వచ్చే కార్లను రిపేర్ చేసేవారు. ఒక పక్క ఇలా చేస్తునే మరో పక్క గ్యారేజ్ కు కస్టమర్లను పెంచడానికి రోడ్డు పక్కన ఒక టెంట్ వేసి అక్కడ కార్ యజమానులకు పాంప్లీట్స్ ను పంచుతూ గ్యారేజ్ గురించి వివరించేది. ఇప్పుడంటే మహిళలు వారికి నచ్చిన జాబ్ చేస్తున్నారు కాని 15 సంవత్సరాల క్రితం అలా ఉండేది కాదు అలా విద్య గారు ఎన్నో వ్యక్తిగత అవమానాలు, వృత్తి పరంగా ఎన్నోకష్టాలను దాటి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా నమ్మకమైన గ్యారేజ్ గా పేరు తెచ్చుకున్నారు. 2014లో ఫాదర్ చనిపోవడంతో ఆయన జ్ఞాపకంగా నంబియార్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ఇందులో మహిళలకు మెకానిక్ విభాగంలో శిక్షణ ఇస్తారు. ఇప్పటికి ఇక్కడ శిక్షణ తీసుకున్న చాలామంది దేశ విదేశాలలో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నారు.