రోడ్డు పక్కన ఎవరో బాగా తాగి పడిపోయారు.. మామూలుగా ఐతే ఏం చేస్తారు.? " భార్య పిల్లలను మరిచి ఇలా పీకల్దాక తాగడం.. ఏం మనుషులు రా బాబు వీళ్ళు.. ఐన వీళ్ళను కాదు ప్రభుత్వాన్ని అనాలి" అంటు తిట్టుకుంటు వెళ్ళిపోతారు. కాని "ఇందు" అలా కాదు అతనిని అక్కడి నుండి లేపి కొన్ని మంచి మాటలు చెప్పి వారి ఇంట్లో విడిచిపెట్టి వస్తారు. సామాజిక సేవ అంటే అది 50 సంవత్సరాల వయసు పై బడిన వారు చేస్తుంటారు కాని తను 24 సంవత్సరాల వయసు నుండే సేవ మొదలుపెట్టారు. నవమాసాలు మోసి కని పెంచితేనే అమ్మ అవుతుందా లాలనతో, ఆత్మీయతతో సేవ చేసే ప్రతి మహిళ ఓ కన్నతల్లితో సమానం.
"పెద్ద వారమయితే శారీరకంగా మన శక్తి చాలదు, చిన్నతనం నుండే సేవ చేయడం మొదలుపెడితో ఎంతోమందిని ఆదుకోవచ్చు- ఇందు"
మనసును కలచి వేసిన సంఘటన: చెన్నై లో న్యూరో సైన్స్ సబ్జెక్ట్ మీద పీ.జి చేస్తున్న ఇందు కు సమాజాన్ని తన కుటుంబంలా భావించేందుకు ఒక బలమైన సంఘటన కారణమయ్యింది. సుమారు 80 సంవత్సరాల ఓ అమ్మ రోడ్డు మధ్యలో ఉన్న డివెడర్ మీద కూర్చుని ప్లేటు ఏది లేకపోవడంతో కటిక నేల మీద భోజనం చేస్తున్నది. ఇందు ఆ అమ్మ విపత్కర పరిస్థితిని చూసి చలించి తన దగ్గరున్న డబ్బు ఇచ్చి తనకు కావాల్సిన వన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతి నెలలో తనకు ఇంటి నుండి వచ్చే 1,000 రూపాయలలో 500 రూపాయాలు ఆ అమ్మకు ఇచ్చేవారు. అలా అప్పటినుండి సేవ చేవడంలోని ఆనందం కన్నా అలాంటి వారిని ఆదుకోవాలని కనీసం వారి బ్రతుకులలో ఉన్న కొంత బాధనైన తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.
బాబు రావు గారి కథ: బాబు రావు(56) గారిది భార్య, పిల్లలు ఉన్న మంచి కుటుంబం ఉంది. వ్యాపారంలో నష్టాలు రావడం, ఆరోగ్యం బాగోలేక పోవడంతో అతడిని ఇంటి నుండి గెంటేశారట. చేసేదేమి లేక రాజమండ్రి లోని ఓ గుడి దగ్గర బిక్షం ఎత్తుకుంటూ బ్రతుకుతుండేవారు. అందరూ బిక్షం వేసేవారు, చీదరించుకునే వారు కాని ఇందు మాత్రం అతని గాయానికి వైద్యం చేసి మరోసారి బిక్షం ఎత్తుకోకుండా ఓ పూల వ్యాపారం ప్రారంభింపజేసింది. ఎక్కడైతే ముష్టి ఎత్తుకున్నాడో అదేచోట గౌరవంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. తన కొడుకుకు గౌరవప్రదమైన జీవితాన్ని అందజేసిన మాతృమూర్తి.
విద్యార్ధుల కోసం: మనకు అది చిన్న విషయంలా అనిపించవచ్చు కాని మనం చేసే చిన్న పని వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోతాయి. ఒకసారి రాజమండ్రిలోని బ్లైండ్ స్కూల్ కు వివిధ సరుకులతో వెళ్ళినప్పుడు విద్యార్ధులు ఇందును "మాకు భోజనం, బట్టలు కన్నా ఒక కంప్యూటర్ కొనివ్వండి అక్క" వీటి వల్ల మా ఆకలి తీరుతుందేమే కాని కంప్యూటర్ నుండి ఎంతో నేర్చుకోగలము మేము ఎంతో మారగలము అన్ని అభ్యర్ధనకు ఇందు మనసు ఆనందంతో పరవశించి పిల్లలందరి కోసం ఉత్తమ్మ కానుకగా కంప్యూటర్ ను అందించింది.
"ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడం వల్ల కోల్పోయేది ఏది ఉండదు - కలాం".
పందుల పక్కన: ఇది మరో హృదయవిధారకమైన సంఘటన.. ఓసారి ఇందు కాకినాడ కు వెళ్ళినప్పుడు బ్రిడ్జి కింద చెత్త చెదారం పందుల మధ్యలో ఆరోగ్యం బాగోలేక ఓ దీన మహిళ అక్కడే పడుకునిండి పోయారు. దేవుడు అంటే అది, భారతదేశం భారతీయులు అంటు ఉపన్యాసాలు ఇచ్చే ఈ గొప్ప సమాజంలోనే ఆ మహిళ ఎన్నో నెలలుగా ఆ చేత్తలోనే ఉంటున్నారు. వివరాలు కనుక్కుంటే కని పెంచి, ధృడమైన శరీరాన్ని అందించిన తన ఇద్దరు కొడుకులే అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోయారట. వెన్నుముక పూర్తిగా దెబ్బతినంతోసరిగ్గా నిలబడలేని దుస్థితి ఆ తల్లిది. ఇందు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళకు శుభ్రంగా స్నానం చేయించి, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించి ఓల్డేజ్ హోమ్ చేర్పించి ఆ మహిళ పాలిట దేవతగా అవతరించింది.
"ఒక వేళ నీ వల్లే ఈ ప్రపంచం వెలుగుతుందనంట్టే నిరంతరం మండుతూ ఉండు, కాని ఆరిపోకు - సినారే".
ఇవన్ని కేవలం మూడు నాలుగు రోజులు చేసిన సేవ కార్యక్రమాలు మాత్రమే 2013 నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది అభాగ్యుల పాలిట అమ్మ అయ్యింది. ఇందు ప్రయాణాన్ని చూస్తుంటే అనిపిస్తుంటుంది ఇలాంటి సేవ చేయాలంటే ఎంతటి గుండె దైర్యం కావాలి.? సమాజం పట్ల అనిర్వచనీయమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యపడదు అని. 2013లో ఇందు మొదలు పెట్టినప్పుడు వారి మనసులో తపన ఉన్నా అంతగా ఎవ్వరూ సర్వీస్ చేసేవారు కాదట ఆ తర్వాత ఇందు గారిని చూస్తు "నేను మిమ్మల్ని చూసే మారమండి, సమాజంలోని నిర్భాగ్యులను ఆదుకోవడానికి మేమందరం తపిస్తున్నామని" ఇప్పటికి ఇందు కు ఎంతోమంది చెబుతుంటారు. ఇందు సేవ చేయడం మాత్రమే కాదు ఇందులాంటి మహిళలను సమజానికి అందిస్తూ గొప్ప సేవ చేస్తున్నారు.