Meet The Man Who Quit His Job In America To Do Organic Farming Here

Updated on
Meet The Man Who Quit His Job In America To Do Organic Farming Here

కొంతకాలం సాఫ్ట్ వేర్ ట్రెండ్ నడుస్తుంది.. కొంతకాలం రియల్ ఎస్టేట్స్, కొంతకాలం మరొకటి.. ఎన్ని ట్రెండులు మారినా మనిషి ఉన్నంతకాలం వ్యవసాయం ఉంటుంది.. రైతు ఉంటాడు. వ్యవసాయం ఎవర్ గ్రీన్, రైతు ఎవ్వరితో పోల్చుకోలేనటువంటి హీరోనే!! అందుకే ట్రెండుకు తగ్గట్టు వెళ్లిన వారందరూ ఇప్పుడు చెప్పులు విప్పి మట్టిని ముట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డి.. సిద్దిపేట్ లో వ్యవసాయం చేస్తున్న ఈ మాజీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గారు కూడా రెక్కలు వచ్చిన తర్వాత అమెరికా, యూరప్, దుబాయ్ వెళ్లిపోయారు. పెద్ద ఉద్యోగం ఇంటికి మంచి డబ్బు పంపేంత సంపాదన.. ఊరిలో "ఎల్లారెడ్డి గాడు చెడ్డీలు వేసుకొని ఎలా ఉండేవాడు, ఇప్పుడు సూటు బూటు వేసుకుని దొర లా మారిపోయాడు". డబ్బు పేరు.. ఇలా పది సంవత్సరాల పాటు రెండు రకాలుగా సంపాదించిన తర్వాత "మనశాంతి" కరువయింది.. అమ్మ నాన్న ఉంటున్న ఊరి వైపు ప్రాణం లాగింది. కట్ చేస్తే ఎల్లారెడ్డి గారు 26 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు.

తన పంటను తనే అమ్ముతారు: రైతుకు తన భూమితో తనకు ఆత్మీయ సంబంధము ఉంటుంది, ఎటొచ్చి ఈ దళారి వ్యవస్థ రావడం వల్ల రైతుకు, వినియోగదారునికి ఆత్మీయ సంబంధం లేకుండా పోయింది. అందుకే ఇద్దరికి ఎన్నో సమస్యలు.. ఎల్లారెడ్డి గారు పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటారు. పాలిహౌజ్, కమ్యూనిటీ ఫార్మింగ్, పాలేకర్ వ్యవసాయం మొదలైన పద్దతిలో పండించిన బియ్యం, పండ్లు, మిల్లెట్స్, పప్పులు, పాలు, నెయ్యి, అడవిలో స్వచ్ఛంగా దొరికే తేనె మొదలైనవన్ని "ఆహార యోగ" పేరుతో తనే అమ్ముతారు. కాటన్, పసుపు కొమ్ములు మొదలైనవి నేరుగా రైతులకు ఉపయోగం ఉండదు కనుక అలాంటివి పండించరు. ఎల్లారెడ్డి గారి షాపులో వేరే రైతులు అమ్మలనుకుంటే కనుక పంట వేసే దగ్గరి నుండి కోత కోసేవరకు పెస్టిసైడ్స్ వాడలేదు అని తన పర్యవేక్షణలో నిరూపణ అయ్యాకనే అనుమతినిస్తారు.

ఆర్గానిక్ డైరీ ఫామ్: ఎల్లారెడ్డి గారి వ్యవసాయంలో డైరీ ఫామ్ కు కూడా చోటు ఉంది. 20 గిరి జాతి దేశీ ఆవులు పెంచుతున్నారు. వీటికి మేత కొన్ని ఎకరాలలో పండిస్తారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే వ్యవసాయం చెయ్యడం, మేత బలవర్ధకంగా ఉండడం వల్ల ప్రతిరోజు దాదాపు 40 లీటర్ల పాలు అమ్ముతున్నారు. స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, పెరుగు కోసం ఎల్లారెడ్డి గారి దగ్గరకే వెళ్లాలని భావిస్తారు. హైదరాబాద్ కు కూడా కొన్ని ఇళ్లకు ప్రతిరోజూ పాలు చేరవేస్తుంటారు.

జీరో ఫార్మింగ్: రసాయనిక పెస్టిసైడ్స్ వల్ల భూమిలో శత్రు పురుగులు, సూక్ష్మక్రిములు, నీరు ఇంకక పోవడం లాంటి రకరకాల కారణాలు మాములు వ్యవసాయంలో చూశాక పాలేకర్ వ్యవసాయ పద్ధతులే బెస్ట్ అని భూమిలో పెరిగిపోతున్న సూక్ష్మజీవులను తగ్గించడానికి జీవామృతం, అలాగే ఆవుల నుండి వచ్చే ఎరువులను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. పాలేకర్ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ ఐదు అంచెలుగా పంటను విభజించి సంవత్సరమంతా ఆదాయం తీసుకుంటున్నారు. ఎల్లారెడ్డి గారు ఈ వ్యవసాయం ద్వారా తన పంటను అమెరికా సింగపూర్ ఇంకా మన తెలుగు ప్రదేశాలకు కూడా పంపిస్తున్నారు.

మనం మనదేశంలో నేర్చుకున్న జ్ఞానం, విలువలు వేరొక దేశంలో నిర్వీర్యం అయిపోతాయి ఎందుకంటే అక్కడి పద్ధతులు అక్కడి సాంప్రదాయాలు వేరు కనుక. ఎల్లారెడ్డి గారు చెప్పేది ఒక్కటే "నా తండ్రి ఒక రైతు, నేను రైతుని, రేపు నా పిల్లలు కూడా రైతులు అవ్వాలి, వేరే ఫీల్డ్ లో ఆసక్తి ఉంటే వెళ్లొచ్చు. కానీ భయంతో వ్యవసాయం వదలకూడదు, ఆర్ధికంగా లాభసాటిగా వ్యవసాయం మారాలి. నా కుటుంబం మాత్రమే కాదు రైతులందరి పిల్లలు రైతులే కావాలి(ఇష్టంతో).

For more information: http://www.ahaarayoga.com