This Story About A Farmer Who Turned A Laborer After Going To Dubai Will Hit You In The Feels!

Updated on
This Story About A Farmer Who Turned A Laborer After Going To Dubai Will Hit You In The Feels!

దుబాయ్ నుండి హైదరాబాద్ కు విమానం పయనం మొదలవ్వుడుతోటె,ఏడేండ్ల కింద,ఇళ్లు ఇడిసి,పల్లెని ఇడిసి, దేశం దాటి దుబాయ్ కొచ్చిన రోజులు యాదికొస్తున్నాయ్ . విమానం ఆకాశం లో మబ్బుల్ని దాటుకొని ముందుకుపోతాంది,నా పాణం మాత్రం ఏడేండ్ల ఎనకకి పయనం అయ్యింది. నా పేరు సత్యం, కరీంనగర్ జిల్లా బోయినపల్లి నా ఊరు,మా నాయన ఊర్ల ఓ మాములు రైతు,12 ఎకరాల భూమి ఉండే,అక్క పెండ్లికి 5 ఎకరాలు,అప్పులకు 2 ఎకరాలు,సర్కారోళ్లు రోడ్డుకు 2 ఎకరాలు పోయి,మూడెకరాలు మిగిలినయ్ నాకు,ఉన్న దాంట్లనే కాయకష్టం చేస్కుంట బతుకుతుండే,కానీ చెరువుల నీళ్లు లేవు,బోర్ల నీళ్లు రావు,పండించే పంటకు ఖరీదు రాదాయె,రైతు కష్టానికి విలువ లేదాయె. వ్యవసాయం తప్ప ఉంకో పని తెల్వదు,చేతకాదు,నెత్తి మీద అప్పులు, బతుకుదామంటే బతుకు లేదాయె, ఆత్మహత్య సేసుకుందామంటే పెళ్ళాం పిల్లలు అన్నాయం అయితరు అని అదో భాధ,రైతు కు అన్యాయం సేసుడు తెల్వదు,కానీ చివరికి రైతే అన్యాయం ఐతడు.

ఊర్ల శానా మంది పట్నాలకు వలస పోయి కూలీలు అయినారు , ఆ కూలి పనికి పోయి,మిద్దెలు కూలి మా ఊరోళ్ళే ఐదుగురు చచ్చిపోయినారు. ఇంకొంత మంది దుబాయ్ ల నౌకరికి పైసల్ బాగా ఇస్తరు,అప్పులు తీర్చొస్తాయి ఆ పైసల్ తోటి అని చెప్తే ,ఉన్న అప్పుకు ఇంకింత అప్పు చేసి ఉన్న మూడెకరాలల్ల రెండు ఎకరాలు అమ్మి,ఇంటిదాని బంగారం కూడా అమ్మి అప్పు చేసిన. దాంట్ల లక్ష రూపాయిలు ఏజెంటు కమీషనుకె పోయినయ్, నా అవసరం వానికి అవకాశం. ఇన్ని ఇబ్బందులు పడుకుంటా దుబాయ్ ల బతకనీకి ఒచ్చిన, మా ఊరోళ్లు నాలుగురితోటి. ఆస్తులు సంపాదించనీకి కాదు,అప్పులు తీర్చనీకి, బిడ్డలు ఇంత కష్టం పడొద్దని.

నౌకరికి జిమ్మెదారి ఇచ్చిన ఎంజెంటు ఈడకి రాంగానే మాట మార్చి,మోసం చేసిండు,ఖర్జురా తోటల పని అని చెప్పినోడు,ఎదో ఫ్యాక్టరీల చాకిరికి పెట్టిండు,ఎదురుతిరగనీకి దమ్ములేదు,ఇడిసి పొనికి ధైర్యం లేదు,మా పాసుపోర్టులు కూడా ఆళ్ళతాననే పెట్టుకున్నరు. ఉద్యోగం అనుకోని ఈడికి ఒస్తే ఊడిగం చేయాల్సివచ్చే. ఎర్రటిఎండ, ఫ్యాక్టరీల పని,15 మందికి ఒక్కటే చిన్న రూము,గోస అంటే మామూలు గోస కాదు,పారిపోయి బయటికి ఒద్దామంటే పోలీసోళ్ళకి చిక్కితే జైళ్ల నూకుతరు,అది ఇంకా పమాదం అని ఈడ్నే బానిసలెక్క అన్నీ భరించుడు అలవాటు అయ్యింది,ఊర్ల బతుకులేదు,ఈడ బతకలేము,పగోనికి కూడా ఈ కష్టం రావొద్దు దేవుడా అని రోజుకోసారన్న అనుకుంటుండే. సొంత ఊర్ల, సొంత పొలంల రాజులెక్క మంచిగ వ్యవసాయం సేస్కుంట ఉండే నాలాంటి రైతుకు ఈ పరాయి దేశం ల బానిస బతుకు ఎందిరా శంకరా అని అనుకోని రోజులేదు.

ఆమాస పున్నమికోసారి ఒక ఐదు నిముషాలు ఇంటోళ్ళతోటి మాట్లాడుడు. మల్ల ఫోను చేసేదాకా ఆ ముచ్చట్లు యాదిచేసుకునుడు, ఇట్లనే రోజులు గడుపుతుండే. మూడేండ్లు కష్టపడితే ఆ పైసలు అప్పు మీది మిత్తికి కూడా సాలలే,ఊర్ల పిల్లలు పెద్దోళ్ళు కావట్టె ఇంకా కొంచెం కష్టం పడితే ఆళ్ళకి ఏదోరీతిన మంచి భవిషత్తు ఉంటదని మా ఫ్యాక్టరీ ఓనర్ ను బతిలాడుకొని,వీసా పొడగించుకొని,మొత్తం ఏడేండ్ల నౌకరి చేసి,అప్పులు తీర్చి,బిడ్డ పెండ్లికి,కట్నానికి పైసల్ పంపి,నా బిడ్డ పెళ్ళికి,వారం ముందుగాల చుట్టం లాగా పోతున్నా,..నేను ఈడ ఇట్ల కష్టపడుతాంటే,ఆడ నా ఇంటిదాని కష్టం ఇంకో తీరుగ ఉండే,ఆమ్మేసినంక మిగిలిన ఎకరంల కూరగగాయలు పండించి, పట్నంల అమ్మి, చల్ల నీళ్లకు వేడి నీళ్లు తోడు అన్నట్టు, నా కష్టానికి, దాని కష్టం కలుసుడుతోటె ఈ మాత్రం అప్పులు తేరినయ్, పిల్లల సదువుల కాడ్నుంచి,బిడ్డకు సంబంధం చూసుడు, పెండ్లి పనులు చేసుడు దాకా మొత్తం ఒక్కత్తే చూసుకున్నది,మా పెండ్లినాడు కష్ట సుఖాలల్ల తోడుంటా అని ప్రమాణం చేసింది,సుఖాల సంగతి దేవుడెరుగు,నా కష్ఠాలని దానికి తోడుగ ఇడిసి పోయిన,ఆడ ఒంటెద్దు బండిని లాగుకుంట అది, ఈడ ఎడారి దేశంల చాకిరీ చేస్కుంట నేను, పొద్దు తెల్వకుండ పని చేస్తేనే ఇవాళ బిడ్డ పెండ్లికి,అప్పులు చేయనవసరం లేకుండ పోయింది, బిడ్డ పెండ్లికి దగ్గరుండి అన్నీ చేసే భాగ్యం కూడా లేకపాయె నాకు,పెండ్లి అయినాక వారానికే మల్ల తిరుగు పయనం కావాలె,ఒంట్ల పాణం మంచిగా ఉన్నన్నిరోజులు పనిచేస్కుంటా కష్టపడితే రేపు చిన్నోడి సదువులకో దేనికో అక్కరకువస్తాయ్ అని,ఇష్టంలేకున్నా మల్ల ఈడికే రావాలె,.

చెరువుల ఉండే చేప పిల్లని వలల పడితే,అది దాని పాణం పోయే దాకా,పోరాడతానే ఉంటది,ఎదో రీతిన పాణం ఉన్నంతవరకు దాని పోరాటం అది చేస్తనే ఉంటది. మా బతుకులు కూడా అంతే, వలసబతుకులు,చచ్చే దాకా పోరాడాలె ,పోరాడుకుంటనే బతుకు ఎల్లదీయాలే...

PS-ఇది ఒక్క సత్యం కథే కాదు, అపార్ట్మెంట్లలో వాచ్మెన్ గానో రోజూవారీ కూలిలాగా,ఇళ్లలో పనివాళ్ల లాగ ఇలా కడుపునింపుకోడానికి చిన్న చిన్న పనులు చేస్తున్న ఒకప్పటి రైతులు మనకి రోజూ ఎదురవుతూనే ఉంటారు . గౌరవంగా బతకాల్సిన అన్నదాత,అన్నమో రామచంద్ర అంటూ ఆర్జించే స్థితికి వచ్చారు,వీరందరి జీవితాల్లోని యదార్ధ సంఘటనలకి అక్షరరూపమే ఈ మా “వలస బతుకులు”