హిందోళ గారిది వరంగల్. అమ్మ నాన్నలిద్దరూ డాక్టర్లు. అంతమాత్రాన వారిద్దరి నుండి వచ్చిన బిడ్డపై వారిద్దరి ఆశలను కుమ్మరించలేదు. హిందోళ గారు ఈ భూమి మీద మొలకెత్తుతున్న దగ్గరి నుండి "నువ్వు ఇలాగే పెరగాలి, ఫలానా సమయానికి మేము నీ నుండి ఆశించిన పండ్లనే ఇవ్వాలనే పరిధులు విధించి అమ్మానాన్నలు పెంచలేదు. "అమ్మ హిందోళ.. ఇది నీ భూమి, నీ ప్రపంచం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నీకు నచ్చిన విధంగా బ్రతకవచ్చు" అని మాత్రమే గైడెన్స్ ఇస్తూ పెంచారు. నాన్న ఖురాన్, బైబుల్, భగవద్గీతలు మూడు ఒకేసారి ఇస్తే, మామయ్య మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, మహాత్మా గాంధీ, నెల్సన మండేలా లాంటి ప్రపంచాన్ని ఇంకో మెట్టకు చేర్చిన నాయకుల పుస్తకాలను అందించారు. "మతాలలోని ఆధ్యాత్మిక భావనతో సర్వ మతాల మనుషులపై ప్రేమ, దాంతోపాటు నాయకుల చరిత్రలు చదవడం వల్ల రివేల్యూషనరీ థాట్స్ కలయికతో సహజీవనం చేస్తూ పెరిగారు".
అజంతా టూర్ వల్ల: నేనొక మహిళను, మా అమ్మ నాన్నలు వీరు, మామయ్యా ఇతర బంధువులు ఫలానా వాళ్ళు అని తెలుసుకున్న వయసులోనే హిందోళ గారు అజంతా ఎల్లోరా, హంపీ, మన హైదరాబాద్ గోల్కొండ కోటలను పలుకరించారు. మొదటిసారి చూసినప్పుడు "అసలేంటి ఈ శిల్పాలు, కోటలు.. మనుషులేనా వీటిని రూపొందించింది, నిర్మించింది అనే అనుభూతికి లోనయ్యేవారు. "పెద్దయ్యాక ఒక చరిత్ర కారిని కావాలని, మంచి ఫోటోగ్రాఫర్ ని కావాలనే" ఆశయం తనలో అప్పుడు లేదు కాని, ఆ టూర్, వాటి ద్వారా వచ్చిన ఉద్వేగం తన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యింది. ఒక వయసు వచ్చాకనే ఆ ఇష్టం బయటకు వచ్చింది. హిందోళ గారి దృష్టిలో "ఒంటరి తనం వేరు ఏకాంతం వేరు". అమ్మ నాన్నలిద్దరూ హాస్పిటల్ కు వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చేవారు. హిందోళ గారికి చిన్నతనం నుండే ఏకాంతం లభించడం వల్ల పుస్తకాలు చదవడం, ఆకాశంలో ఈదుతున్న పక్షులను గమనించడం, భూమిని చీల్చుకుంటూ ఆకాశాన్ని అందుకునేలా నిటారుగా పెరుగుతున్న చెట్లను గమనించడం లాంటి వాటి వల్ల గ్రాస్పింగ్ పవర్ పెరిగింది.
డెంటిస్ట్ అయ్యాక: అమ్మ నాన్నలిద్దరూ డాక్టర్లే కనుక వారింటి నుండి మరో డాక్టర్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఐతే డాక్టర్ గా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఇంజినీరింగ్ చేసుకుంటే బాగుంటుందని అమ్మ నాన్నలే సజెస్ట్ చేశారు. కాని హిందోళ గారికి చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించడం, ప్రయాణించడంతో పాటు, ఆలోచనలతో తనలో తాను ప్రయాణించడం కూడా ఇష్టం. తన ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు సైన్స్ లో ఉండడంతో అటు వైపుగా తన ఎడ్యుకేషన్ సాగింది. ఖమ్మం మమత మెడికల్ కాలేజ్ లో BDS కంప్లీట్ చేశాక మళ్ళి వరంగల్ కు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వరంగల్ తనకు చాలా కొత్తగా కనిపించింది. శిల్పాలు, ఆలయాలు వందల సంవత్సరాల నుండి ఒకే విధంగా ఉన్నాయి కాని తనకు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి.
అప్పటి కోటలు, దేవాలయాలు, శిల్పాలలో వాటి చరిత్రతో పాటు ఒక ఆత్మ కనిపిస్తుంది. చిత్రకారుడు తన శిల్పం శాశ్వితంగా నిలిచి ఉంటుంది అనే నమ్మకంతో ఆ శిల్పాలలో ఎదో ఒక విషయాన్ని భవిష్యత్ తరానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. హిందోళ గారిని ఇదే ఎక్కువ ఆకర్షించింది. ఆ శిల్పం తాలుకు బాడీ లాంగ్వేజ్ ను ప్రత్యక్షంగా చూసి, పుస్తకాలు మరియు రాతి గోడల మీద రాసిన చరిత్రను తెలుసుకుని తనదైన శైలిలో వివరించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు డెంటిస్ట్ గా సమస్యకు పరిష్కారానికై వచ్చే పేషేంట్స్ ను కలుస్తూనే ఒక బ్యాగు, కెమెరా పట్టుకుని తన ప్రశ్నలకు సమాధానాలను, భౌతక రూపాన్ని తెలుసుకున్నారు.
నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు: హిందోళ గారు స్థానిక రచయితల పుస్తకాలతో పాటు James Fergusson, Sir John Marshall, D. D. Kosambi, Anand. K. Coomaraswamy, Stella kramrisch, P. V. Parabrahma sastry. Max Muller, Romila Thapar మొదలైనవారి పుస్తకాలు చదువుతూ ఉంటారు. చరిత్ర చరిత్ర లా ఉండాలి కాని ఒక మతానికో, ఒక ప్రాంతానికో ఎవరికి నచ్చినట్టు వారు మార్చుకోకూదని ఎన్నో నిజాలను నిగ్గు తెలుస్తుంటారు కూడా. ఒకసారి రీసెర్చ్ లో భాగంగా వరంగల్ పద్మాక్షి టెంపుల్ కు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో జైనుల ప్రతిమలు ఉన్నాయి ఐనా కాని అది హిందువుల దేవాలయం అంటూ మభ్య పెడుతున్నారు. అజ్ఞానం, బ్రతుకు తెరువు, ఆధిపత్యం కోసం వాస్తవాలు బయటకు రావడం లేదని హిందోళ గారి నమ్మకం. త్వరలో వీటి పైన పూర్తి స్థాయిలో పుస్తకం కూడా తన నుండి రాబోతుంది.