అందరూ వ్యవసాయం చేయడానికి కష్టపడితే హరి గారు మాత్రం "వ్యవసాయం చేయడానికి అనుమతి కోసం కష్టపడ్డారు.." అంతేకదా ఏ తండ్రైనా తాను చేసిన పనిలో లాభాలు ఉండేదుంటే లక్షణంగా ఆహ్వానించేవారేమో అందులో నష్టాలే ఉంటే ఎవరు మాత్రం ప్రోత్సహిస్తారు కనుక. స్వతహాగ తాతయ్య, నాన్న చిన్నతనం నుండి వ్యవసాయం చేయడం, ఆ పచ్చని పంట పొలాల్లోనే పెరిగి ఉండడం వల్లనేమో హరి గారికి వ్యవసాయం అంటే ఇష్టం పెరిగింది. "నేను అగ్రికల్చర్ లో డిగ్రి చేసి వ్యవసాయం చేస్తాను నాన్న" అంటే తండ్రి ఒప్పుకోలేదు.. తండ్రి మాటలకు గౌరవమిచ్చి ఇంజనీరంగ్ పూర్తిచేశారు. క్యాంపస్ సెలక్షన్స్ లో మంచి కంపెనీలో ఉద్యోగం పొందారు..
కాని చిన్నతనం నుండి మనతో పాటే పెరిగిన మన ఇష్టం ఓ పట్టాన మనల్ని ఒదిలిపెట్టదు. హరి గారు ఉద్యోగం మీద అమెరికాకు వెళ్ళినా అక్కడ ప్రమోషన్స్, గ్రీన్ కార్డ్ లాంటి ఆలోచనలు ఏవి ఉండకపోయేది. వ్యవసాయ కుటుంబం అన్నాక అప్పులు కూడా వారి జీవితంలో ఒక భాగంగా ఉంటాయి అలా నాన్న చేసిన అప్పులను తీర్చి తన కోరికను మళ్ళి విన్నవించారు, కొడుకు ఇప్పటికి అదే తపన ఉండడంతో నాన్న కూడా ఒప్పుకున్నారు. కట్ చేస్తే మాంచి సక్సెస్ సాధించారు. ఎంతలా అంటే నాన్న ద్వారా 15 ఎకరాలు వస్తే దానిని 6 సంవత్సరాలలో 35ఎకరాలు చేసేంతలా.. హరిగారు అందరిలా వ్యవసాయం చేయడం మొదలుపెట్టగానే ఉద్యోగానికి రాజీనామా చేసి కంప్లీట్ గా ఇందులోనే ఉండిపోలేదు, కంపెనీ వారి సహకారంతో ఇంటివద్దనే ఉంటూ ఒకపక్క వ్యవసాయం మరోపక్క ఉద్యోగం చేస్తున్నారు.
ఆర్గానిక్ మాత్రమే: మనం ఎదుటివారికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగివస్తుంది.. పెస్టిసైడ్స్ తో భూమికి అపాయం చేస్తున్నాం కనుక మనకు అదే తిరిగివస్తుంది. హరిగారు తన శరీరాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగే తన పంట భూమిని చూసుకుంటారు. భద్రాచలం జిల్లా సత్తుపల్లి అనే గ్రామంలో తన తోటి రైతులు పెస్టిసైడ్స్ తో పండించిన పంట ఎకరానికి 35 బియ్యం బస్తాలనిస్తే, తను మాత్రం సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎకరానికి సుమారు 25 బస్తాల బియ్యం పండించేవారు.. రసాయన పెస్టిసైడ్స్ తో పండిన పంట కన్నా హరి గారికి ఎక్కువ ఆదాయం వచ్చేది. ఇందులో డబ్బు సంపాదించామన్న ఆనందం కన్నా సమాజానికి ఆరోగ్యకరమైన పంటను ఇస్తున్నానన్న తృప్తే ఎక్కువగా ఉంటుందని అంటారు.
కొత్తగా వచ్చేవారి కోసం: ఎందులోనైనా సక్సెస్ వస్తే ఆ సక్సెస్ ను అందుకోవడం కోసం మరింత మంది వస్తుంటారు. "సాఫ్ట్ వేర్ లైఫ్ బోర్ కొట్టేసిందండి, నాకు వ్యవసాయం మొదలుపెట్టాలని ఉందండి" అని హరిగారితో చెప్పినవారు కేవలం సంవత్సరానికే ఇందులోని కష్టాన్ని తెలుసుకుని తిరిగి జాబ్ చేసుకుంటున్నారు. వ్యవసాయం అంటే ఆకర్షణ కాదు ఇదే నా తదనంతర జీవితం, ప్రేమ ఉంటే తప్పా ఇందులో మనం రాణించలేం. ముందుగా ఒక ఎకరంలా కొద్దిపాటి భూమితో మొదలుపెడితే లాభనష్టాలను అంచనవేయడం తెలుస్తుందని తనలాంటి యువరైతులకు వీలైనంతగా సలహాలను అందిస్తుంటారు..