మన దేశంలో ఇన్ని రకాల భిన్న మతాలు ఉన్నా కలిసి మెలిసి ఉండడానికి గల ప్రధాన కారణం పండుగలు.. హిందువుల దీపావళికి అన్ని మతాల వారు హిందూ మిత్రులతో ఆనందంతో టపాసులు పేల్చుతారు, క్రైస్తవుల క్రిస్ మస్ పండుగనాడు, రంజాన్ పర్వదినాలలో బంధువులు మాత్రమే కాదు అన్ని మతాలకు చెందిన మిత్రులను ఆహ్వానిస్తారు. "మతాలు వేరు వేరు కావచ్చు కాని మా అందరి అభిమతాలు ఒక్కటే" అనే సర్వ సంతోష భావనను మన పండుగలు చెబుతున్నాయి. రంజాన్ వచ్చిందంటే ఇక అందరికీ పండుగే.. తెలుగువారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి ఓ మోస్తరు పట్టణం వరకు హలీమ్ షాపులు వెలుస్తాయి. వేసవిలో మామిడి పండ్లలా, రంజాన్ మాసంలో హలీమ్ వచ్చేస్తుంది. మరి మన జీవితంలో ఇంతలా మమేకమైన హలీమ్ చరిత్ర గురుంచి తెలుసుకోవాలిగా..
హలీమ్ = ఓర్పు:
'హలీమ్’ అంటే అరబిక్ భాషలో ‘ఓర్పు’ అని అర్ధం. హలీమ్ ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలిచేవారు. అరబ్బులు దీన్ని హరీస్ అనీ హరిషా అని పిలిచేవారు. హలీమ్ ఎప్పుడు పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేం కాని దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. పూర్వం ఇది ముస్లిం రాజులకు మహా ఇష్టమైన వంటకం. వారి సంస్థానాలకు అతిథులు వచ్చినప్పుడు వారిని మెప్పించేందుకు హలీమ్ ను ప్రత్యేకంగా వండేవారు. ఏడో శతాబ్ద కాలంలో ముస్లిం రాజులు పర్షియాను ఆక్రమించి అక్కడికి వెళ్లిన మహ్మద్ ప్రవక్తకు ఈ పర్షియన్ వంటకం ఎంతో నచ్చిందట. ఆయన వల్ల మరిన్ని ప్రాంతాలలో ఇది ప్రాచుర్యం పొందిందనీ చాలా అరబ్ దేశాల్లో దీన్నే "హరిసా" అంటారనీ రచయిత మార్గరెట్ ఓ పుస్తకంలో రాశారు.
మొహర్రం నెల రోజులూ సంతాప దినాలుగా పాటించే షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటారు. ఉపవాసం ఉండడం మూలంగా ఒక్కోసారి వారు మానసికంగా, భౌతికంగా బలహీన పడతారు. హలీమ్ లో పోషకాలు ఎక్కువ త్వరగా జీర్ణమయ్యి తొందరగా శక్తినిస్తుంది. అందుకోసమే ప్రత్యేకంగా పోషకాలు ఎక్కువ ఉండే హలీమ్‌ను చేసుకుని తినేవారు.
మన హైదరాబాద్ లో:
విదేశాల నుండి మనుషులు మాత్రమే కాదు వారి ఆహార అలవాట్లు కూడా వచ్చాయి. పూర్వం ఇప్పుడున్నట్టుగా హలీమ్ రుచి ఉండేది కాదు దీనికి మనవారి అభిరుచులకు తగ్గట్టుగా చిన్నపాటి మార్పులు చేయించింది మాత్రం హైదరాబాద్ నిజాం రాజు సుల్తాన్ నవాజ్ జంగ్. మహారాజుల వంటశాలలో ఇది తయారుకావడంతో మొదట దీనిని ఖరీదైన వంటగా భావించేవారు. నిజాం సంస్థానంలో ఒక్కసారి రుచిచూసిన అతిథులు మరల భోజనానికి ఆహ్వానిస్తే బాగుండేదని ఆశపడేవారట. ఐతే ఆ తర్వాతి కాలంలో ఇరాన్‌కు చెందిన హుస్సేన్ మదీనా సర్కిల్‌లో దీనిని తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు.
బిర్యానీ తీసుకుంటే హలీమ్ ఫ్రీ:
మనం ఇప్పుడు ఇష్టంగా తినే హలీమ్ ను మొదట మార్కెటింగ్ చెయ్యడానికి హుస్సేన్ గారు చాలానే కష్టపడ్డారు. బిర్యానీ కన్నా హలీమ్ తక్కువ ధరకే వస్తున్నా గాని ఊహించినంత లాభాలు రాలేదు. "హలీమ్ రుచి మామూలుగా ఉండదు, ఒక్కసారి రుచిచూస్తే ఇక మళ్ళీ కావాలంటారు, ఐతే దీనిని ఒక్కసారి రుచిచూపించాలి" అని హుస్సేన్ బిర్యానీ తింటే హలీమ్ ఉచితం అని ప్రచారం చేశారు. టెలిఫోన్ డైరెక్టరీ లో అడ్రెస్ లు తెలుసుకుని హలీమ్ రుచి గురుంచి వర్ణిస్తూ హైదరాబాద్ లోని అపరిచితులకు ఉత్తరాలు రాసేవారు. పేపర్ లో యాడ్స్, గోడలమీద పోస్టర్లు ఇలా రకరకాలుగా హుస్సేన్ గారు హలీమ్ రుచిని పరిచయం చేయడం కోసం శ్రమపడ్డారు. హుస్సేన్ గారు ఊహించినట్టుగానే హలీమ్ రుచి చుసిన తర్వాత డిమాండ్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది, హుస్సేన్ గారిని చూసి చాలామంది నేర్చుకోవడం, తయారుచేయడం మొదలుపెట్టారు.
గంటలకొద్ది శ్రమ:
హలీమ్ తినాలనిపించగానే తయారుచూసుకునే వంట పదార్ధం కాదు. గంటలకొద్దీ శ్రమ పడాల్సి ఉంటుంది. హలీమ్ తయారీకి లేత పొట్టేలు మాంసం బాగుంటుందని చెబుతారు. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో దాదాపు ఐదు గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల మొదలైనవాటిని వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై అడుగు అంటకుండా ఉడికిస్తారు. ఇలా ఉడికించిన తర్వాత దీనికి కమ్మని నెయ్యిని కలుపుతూ గూటా కర్రలతో రుబ్బుతారు. 2010లో హలీమ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ఆహార పదార్ధాల విభాగంలో హలీమ్ స్థానం కూడా పొందింది.
వందలకోట్ల బిజినెస్, 50 దేశాలకు:
మొదటిసారి హలీమ్ ను మార్కెటింగ్ చెయ్యడానికి హుస్సేన్ గారు విపరీతంగా శ్రమపడ్డారు కాని ఇప్పుడు మాత్రం రంజాన్ మాసం కోసమే సంవత్సరమంతా ఎదురుచూసే పరిస్థితికి వచ్చింది. నాడు ఫ్రీ గా ఇచ్చిన రోజుల దగ్గరినుండి నేడు వందల కోట్ల వ్యాపారానికి విస్తరించింది. ఒక్క హైదరాబాద్ లోనే 5000కు పైగా హలీమ్ సెంటర్లు ప్రతి సంవత్సరం వెలుస్తాయి. దాదాపు 30,000 మందికి ప్రతి సంవత్సరం ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్ లో వండే 30% హలీమ్ 50 దేశాలకు ఎగుమతి అవుతుంది.
హలీమ్ సంవత్సరం పొడువునా దొరకదు. సిజినల్ ఫ్రూట్ లానే హలీమ్ కూడా సీజినల్ ఫుడ్. హలీమ్ రుచి, పోషకాల విషయంలో అమోఘమైనది. హలీమ్ సంవత్సరం పొడువునా దొరకదు. సీజినల్ ఫ్రూట్ లానే హలీమ్ కూడా సీజినల్ ఫుడ్. హలీమ్ రుచి, పోషకాల విషయంలో అమోఘమైనది. దీపావళి హిందువుల పండుగ మాత్రం కావచ్చు కాని టపాసులు పేల్చే పండుగ అందరిది, క్రిస్ మస్ క్రైస్తవులది కావచ్చు కాని కేక్ కటింగ్ కు అందరం వెళ్తుంటాం, రంజాన్ ముస్లిం మిత్రుల పండుగ కావచ్చు కాని ఇప్పుడు వచ్చే హలీమ్ మాత్రం అందరిది. ఇదే కదా మన భారతదేశ గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం..