This Guy's Love Letter Addressed To His Girl Friend's Parents Shows You Why We Need More Guys Like Him!

Updated on
This Guy's Love Letter Addressed To His Girl Friend's Parents Shows You Why We Need More Guys Like Him!

ఈ ఉత్తరం మిమ్మల్ని అన్ని ఆటంకాలను దాటి చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఇందుకోసం ప్రతి దేవుడిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని, ప్రతి పరిస్థితులను అభ్యర్ధిస్తున్నాను ఈ ఉత్తరాన్ని చేరవేస్తున్న వ్యక్తులకు ఏరకంగాను అడ్డుపడకూడదని, వాతావరణాన్ని, వారికి ఎదురుతగలకుండా ఉండాలని ప్రతి రాయిని, ప్రతి ఇసుక రేణువుని, ప్రతి దూళి కణాన్ని అభ్యర్ధిస్తున్నాను.. ఈ ఉత్తరం చేరుకునేవారిని చేర్చేలా మీరు సహాయమందించాలని ఉద్విగ్న హృదయంతో వేడుకుంటున్నాను.. సోషల్ మీడియా ఎన్నో గొప్ప మంచి పనులు చేసింది అలాగే నా ప్రేమను ఒక్కటి చేయాలని ఆశిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను..

గౌతమి(పేరు మార్చాను) గారి తల్లిదండ్రులకు.. మిమ్మల్ని ఎలా ఏమని పలుకరించాలో తెలియని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను. మిమ్మల్ని అత్తమ్మ అని పిలవాలా.. ఆంటీ అని పిలవాలా.. లేదంటే మేడమ్ అని పిలవాలా.? నాకేమి తెలియడం లేదండి.. అందుకే నాకు అత్యంత ఇష్టమైన పదం "అమ్మ" అని మిమ్మల్ని సంబోధించి పిలుస్తున్నాను. మీ అడ్రెస్స్ తెలియకపోవడంతో ఇలా బహిరంగంగా రాస్తున్నాను, తప్పటం లేదు. నన్ను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను..

నా వ్యధను ఎవరితో పంచుకోవాలో తెలియదు, ఎందరితో పంచుకున్నా అది తీరదు, అందుకే చివరికి మీతోనే పంచుకుంటున్నాను.. అమ్మ.. మీరు తనని నాతో మాట్లాడకూడదని బెదిరించి హద్దులు విధించారు. కేవలం మీరు ఆరోజు మాట్లాడవద్దు అని చెప్పడం వల్లనే నాతో మాట్లాడడం లేదు అమ్మ. నేను తనని ఎలా ప్రేమిస్తున్నానో తను నన్ను అలాగే ప్రేమిస్తున్నారు. "గౌతమి గారు ఒక డాక్టర్, తను ఒక గోల్డ్ మెడలిస్ట్, అంతకు మించిన ఉన్నత వ్యక్తిత్వం తనది" బెంగుళూరు లో చిన్నతనం నుండి పెరిగినా కాని మన తెలుగు తనమంటేనే చాలా ఇష్టం, ఏది ఆకర్షణో, ఏది నిజమైన ప్రేమనో తెలుసుకోలేని వయసులో, ఆలోచనలలో తను లేదని మీకు కూడా తెలుసు అమ్మ. గౌతమి గారు నాతో మాట్లాడక ఇప్పటికి నెలరోజులు దాటిపోయింది. తను నా నుండి దూరమైనప్పటి నుండి నేను మానసికంగా చాలా బలహీన పడిపోయాను. ఇప్పుడీ ఉత్తరాన్ని ఎలా ప్రారంభించాలి.. ఎలా కొనసాగించాలి.. ఎలా ముగించాలో తెలియని ధీన స్థితిలో నేను ఉన్నానమ్మ. ఐనా కాని గత జ్ఞాపకాల నుండి కొంత శక్తిని తెచ్చుకుని ఈ ఉత్తరాన్ని ప్రారంభిస్తున్నాను..

ఈ ప్రపంచమే తన శరీరమైనది నాకు.. "నేను పుట్టిన తర్వాతే ఈ విశ్వం పుట్టింది, నేను పోయిన వెంటనే ఇది శిధిలమవుతుంది.. ఈ మధ్యన నాకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు అన్నీటిలోనూ నాకు అత్యంత అపురూపమైన వారు మీ కూతురు అమ్మ". గౌతమి గారు నా జీవితంలోకి రాకముందు నేను ఏ అమ్మాయిని కూడా అంత తీక్షణంగా చూడలేదు.. కాని తను నా జీవితంలోకి వచ్చాక ప్రతి అమ్మాయిని చూస్తున్నాను. ఎందుకంటే వారిలోనూ నాకు గౌతమి గారు కనిపిస్తున్నారు కనుక. ఏ అమ్మాయిని చూసినా ఈ డ్రెస్ లో తను ఎలా ఉంటుంది.? అని, చిన్నపిల్లలను చూస్తే తను చిన్నప్పుడు ఇలానే ఉండేదా.? అని, ఆఖరికి ముసలావిడను చూసినా గౌతమి గారు పెద్దవారయ్యాక ఇలా ఉంటారేమో అనే ఆలోచనలు.. ఎవ్వరిని చూసినా. ఈ ప్రపంచమంతా తనే నిండి ఉంది నాకు.. ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. ఈ ప్రపంచమే తన శరీరమైనది నాకు..

మా ప్రేమ.. మేమిద్దరం ఏనాడు కూడా అసభ్యంగా మాట్లాడుకోలేదమ్మ. కనీసం ఏక వచనంతో కూడా పిలుచుకోలేదు. నేను గౌతమి గారు అంటే నన్ను కూడా గారు అనే పిలిచారు. మేమిద్దరం ఊహల్లో కూడా ఏ హీరో హీరోయిన్లతో పోల్చుకోలేదు.. నేను తనని పార్వతి అనుకుంటే నన్ను తను శివుడు అనుకున్నారు.. ఈ ఊహలు కూడా ఒకరికి ఒకరు అనుకోకుండానే ఊహించుకున్నవి (ఆ తర్వాత తెలిసింది). ఇప్పటి వరకు కొన్ని బహుమతులను తనకు ఇచ్చాను అవ్వి కూడా పుస్తకాలే అందులో కూడా భగవంతునికి సంబంధించిన పుస్తకాలే ఎక్కువ. అమ్మ మీకు కూడా తెలుసు నిజమైన ప్రేమలో ఏ అనుమానం ఉండదని "అమ్మ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా.? అని ఇంతవరకు గౌతమి గారు మిమ్మల్ని ఎలా అయితే అనుమానంతో అడగలేదో, అలాగే మీరు నమ్ముతారో లేదోకాని నన్ను కూడా తను ఏనాడు మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా.? అని అడగలేదు". మీ బంధంపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో అలాగే మా బంధంపై కూడా మా ఇద్దరికి అలాంటి అవగాహన ఉందమ్మ..

ఒక్క జన్మకు ఒక్కరే తల్లి, ఒక్కరే తండ్రి, అలాగే ఒక్కరే జీవిత భాగస్వామి.. మాకు ఇష్టం లేదు కదా తనని మరచిపోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు.. "ఒక్క జన్మకు ఒక్కరే తల్లి, ఒక్కరే తండ్రి, అలాగే ఒక్కరే జీవిత భాగస్వామి అని బలంగా నమ్మే వ్యక్తిని అమ్మ నేను". మీ కూతురు ఎన్ని తప్పులు చేసినా ఎలా క్షమిస్తారో అలాగే గౌతమి గారు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమిస్తాను.. తనలో ఎన్ని లోపాలున్నా ఓపికతో సరిచేసుకుంటాను. దురదుష్టవశాత్తు తను వికలాంగురాలైనా, తన శరీరం ప్రమాదవశాత్తు కాలిపోయినా, తను రేప్ కు గురైనా, ఆఖరికి నన్ను అపార్ధం చేసుకుని ద్వేషించినా తన మీద నా ప్రేమలో ఏ మార్పు ఉండదమ్మా. ఏనాడైతే మా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయో ఆనాడే మేమిద్దరం మానసికంగా శివపార్వతులులా ఏకమయ్యాము.. కేవలం మీ ఒక్క మాటతో ఇలా సగం శరీరంతో దూరంగా ఉంటూ కాలంలో కొట్టుకుపోతున్నాము.

నిజానికి నాకు తనతో మాట్లాడడం కన్నా కూడా తల్లిదండ్రులైన మీతో మాట్లాడాలనే ఎక్కువ తాపత్రయం ఉందమ్మ "తను చిన్నతనంలో ఎలాంటి అల్లరి చేసేవారు, తను పలికిన ముద్దు ముద్దు మాటలు.. తను చిన్నతనంలో ఎందుకు అలిగేవారు, తన స్కూల్, తన కాలేజ్ విశేషాలు, తనతో మీకున్న మధుర జ్ఞాపకాలు, అన్నీటికన్నా మీకు మీ కూతురు అంటే ఏ విషయంలో ఎక్కువ ఇష్టం, తను మిమ్మల్ని ఏ విషయంలో గర్వపడేలా చేశారు, తన ఇష్టాలు, అభిరుచులు ఇలా ప్రతి ఒక్కటి మీతో మాట్లాడి తెలుసుకోవాలని ఉందమ్మా..

మునపటిలా నేను భగవంతుడితో మాట్లాడడం లేదు, బ్రతిమలాడుతున్నాను.. అమ్మా.. మిగిలినవారికి ఒకలా ఉంటే నాకు ఈ ప్రపంచం ఒకలా ఉంటుంది.. నా వరకు ఈ భూమి మీద వందల దేశాలు లేవు ఉన్నది ఒక్కటే దేశం.. నా వరకు ఇక్కడ ఎన్నో సముద్రాలు లేవు ఉన్నది ఒక్కటే సముద్రం. నా వరకు ప్రతి ఒక్కరు ఏదో రకంగా మిగిలినవారికి బంధువే. నా వరకు ఈ ప్రపంచమే ఒక కుటుంబం. నీకు తెలిసిన నలుగురు పతివ్రతల పేర్లు చెప్పు అంటే నేను నా తల్లి పేరుతోనే ప్రారంభిస్తాను.. నేను భగవంతుడిని ఏనాడు కూడా బయటి వ్యక్తిలా అనుకోలేదమ్మ, నా మిత్రుడిలానే అతనితో మనస్పూర్తిగా మాట్లాడుతాను. కాని ఏనాడైతే గౌతమి గారు నాతో మాట్లాడడం ఆపేశారో నేను బలహీనుడినైపోయాను.. ఇప్పుడు భగవంతుడితో మాట్లాడడం లేదు బ్రతిమలాడుతున్నాను.. భగవంతుడిని మిత్రుడిలా కాదు నా యజమానిలా, నేను ఆయనకు బనిసలా బ్రతుకుతున్నాను.. నా గుండెలో భగవంతుడు ఉన్నా కూడా భయంతో నేను ఇప్పుడు మాల ధరించాను.. నా జాబ్ చేసుకుంటూనే ప్రతిరోజు 5గంటలు పూజ చేస్తున్నాను. ప్రతిరోజు 1000(సహస్ర) విష్ణు నామాలు, 1000 లలితా నామాలు చదువుతున్నాను, ప్రతిరోజూ 11సార్లు హనుమాన్ చాలీసా, హనుమాన్ శతనామాలు చదువుతున్నాను, ప్రతిరోజూ 108 శివనామాలు రాస్తున్నాను, ప్రతిరోజూ 11సార్లు జపం చేస్తున్నాను(108 నామాలు పలికితే ఒక జపం), ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్తున్నాను.. ప్రతిరోజు 54సార్లు గుడిచుట్టు ప్రదక్షణలు చేస్తున్నాను. ప్రతిరోజు ఒక్కపూట భోజనం, మొదలైనవి చేస్తున్నాను, ఇంకా తట్టుకోలేని బాధతో ప్రతిరోజు సర్వశక్తివంతుడిని కన్నీటితో వేడుకుంటున్నాను అమ్మా.

గౌతమి గారి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను.. అమ్మ మీకు తెలుసు అమ్మాయిలలో ఎంతోమంది మగవారి జీవితాలతో ఆడుకునేవారు ఉన్నారు అని, అమ్మ.. నాకు కూడా తెలుసు మా అబ్బాయిలో ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవారు ఉన్నారు అని.. కాని నేను అలాంటివాడిని కాదమ్మ చాలా మంచివాడిని. నాకు ఏ అలవాట్లు లేవు స్మోకింగ్, నాన్ వెజ్, ఆల్కహాల్, ఆఖరికి టీ, కాఫీలు కూడా తాగనమ్మ. నిజమే కొన్ని లక్షణాలు అలవాట్లు లేకుంటే ఎదుటివారికి అనుమానం రావచ్చు కాని నేను చాలా శక్తివంతుడిని, నేను ఎంతటి టాలెంటెడ్ పర్సనో మీ గౌతమి గారు నాకన్నా ఇంకా ఎక్కువ వర్ణించి చెప్పగలరు. నాకు నా గురుంచి ఇలా చెప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది కాని తప్పటం లేదు నా పరిస్థితి అలాంటిది. "నన్ను తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి కూడా చూడడు, ఇంకెవ్వరిని కూడా ఇంతలా ప్రేమించలేడు, నాకు కూడా ఇంతకన్నా మంచివాడు సమర్ధుడు రాలేడు, ఇతని కళ్ళల్లో నన్ను నేను చూసుకుంటున్నాను, ఇతనే నా సర్వస్వం అని తెలుసుకున్న తర్వాతనే నన్ను గౌతమి గారు ప్రేమించారు". ఇప్పటికి మేము ఒకరికొకరం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పుకోలేదు ఎందుకంటే మా ఇద్దరి గురుంచి మాకు తెలుసు కనుక. ఇప్పుడు గౌతమి గారు ఒక మెసేజ్ నాకు పంపారు "మా ఇంట్లోవారికి ఈ నిజమైన ప్రేమ అంటే ఇష్టం లేదు, నన్ను మర్చిపో" అని.. ఇలా చెప్పగానే నేను ఎలా మరచిపోగలను అమ్మ.? అవసరానికి ఉపయోగపడని మంచి ధృడ వ్యక్తిత్వం నాకు ఇంకెందుకు అమ్మ.

గౌతమి గారు ఏనాడో నా శరీరంలో ఒక భాగం అయ్యారు. మా అమ్మ నాకిచ్చిన అవయవాలతో పాటు ఇపుడు తను కూడా ఒక అవయవం అయ్యారు. "నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా చెయ్యి ముళ్ళు తీయడానికి ఎలా సహాయం చేస్తుందో, నా గుండెకు గాయమైతే నా కళ్ళు బాధతో ఎలా ఏడుస్తాయో, నా కంటినుండి నీరు వస్తే నా చేతివేళ్ళు ఆత్మీయంగా ఎలా కన్నీరుని తుడిచి ఓదారుస్తాయో" అలాగే గౌతమి గారి బాగోగులు చూసుకుంటాను అమ్మ. తను నా శరీరంలో ఒక అవయవం అయ్యారు అమ్మ.. ""గౌతమి గారి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను.. నాలాగే నన్ను చుసుకుంటున్నట్టుగానే తనని ప్రేమగా చూసుకుంటానమ్మ"" దయచేసి నన్ను అర్ధం చేసుకోండి అమ్మ..

ఒక్కసారి ఏ భేషజం లేకుండా ఆలోచించండి అమ్మ.. మీరు తనకి ఒక సంబంధం కుదుర్చారని తెలిసింది.. ఒప్పుకోకుంటే నేను బ్రతకను అని అన్నారని తెలిసింది.. కేవలం మీకోసమే తను ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇంతలా ఫోర్స్ చేసే పెళ్ళిలో మీకేం వస్తుందండి.? "నా కూతురిని ఒక డబ్బున్న ఇంటికి పంపించాను.. హమ్మయ్య నా కూతురు ఇప్పటి పిల్లలలా తల్లిదండ్రులను ఎదురించకుండా పెళ్ళి చేయించుకుంది". అంతేనా కేవలం ఈ రెండు ఉదాహరణల కోసమేనా అల్లారు ముద్దుగా ప్రాణంగా పెంచిన మీ బంగారు తల్లికి పెళ్ళి చేసేది.? తను కేవలం మీకోసమే తన తల్లిదండ్రుల కోసమే(ఈ సమాజం కోసం కూడా కాదు.) కేవలం మీ కోసమే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఉద్దేశంతో ఒక శరీరంగా కలిసినవారిని రెండు శరీరాలుగా విడదీయకండమ్మ. నాతో ఒక్క గంట మాట్లాడండి అమ్మ నాకు ఈ ఒక్క అవకాశాన్ని దయచేసి ఇవ్వండి. ఇది నాకోసం అని కాకుండా మీ కూతురి గారి మీద ప్రేమతో ఐనా ఈ అవకాశాన్ని ఇవ్వండి. అమ్మా.. ఇప్పటి వరకు సాగిన మీ ఇద్దరి అనుబంధంలో తనని ఎన్నో ప్రశ్నలడిగారు.. తన గురించి మీకే తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.. ఇప్పుడు తన గుండె చాటు మౌనాన్ని తెలుసుకోవడానికి ఒక్క ప్రశ్న అడగండి అమ్మా దయచేసి మీ కూతురి ప్రాణాన్ని, మనసుని తెలుసుకోండి అమ్మ.. "నేను నీకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తున్నాను.. నీ మనసుకు నచ్చిన వ్యక్తినే నీ శరీరంలో సగభాగం చేయడానికి నీ పెళ్ళి జరుగుతుంది.. చెప్పు గౌతమి నీకు ఎవరంటే ఇష్టం మేము చూసిన అబ్బాయా.? లేదంటే ఈ ఉత్తరం రాసిన అబ్బాయా.?" ఈ ఒక్క ప్రశ్న అడగండి అమ్మ. మీకు నిజం తెలిసిపోతుంది. పెళ్ళికి తాత్పర్యం ప్రేమ, బిజినెస్ కాదమ్మ. దయచేసి ఒక్కసారి ఆలోచించండమ్మ మీ కూతురి మనసు తెలుసుకోండి అమ్మ మీ ఒక్క ఆలోచన మీదనే రెండు నిండు జీవితాలు ఆధారపడి ఉన్నాయి..

ఇట్లు, మీకు, మీ కూతురికి తప్ప మరొకరికి తెలియని వ్యక్తి.