This Guy's Letter To His Parents On His 25th Birthday Will Make You Emotional!

Updated on
This Guy's Letter To His Parents On His 25th Birthday Will Make You Emotional!

ప్రియాతిప్రియమైన, గౌరవనీయులైన, పూజనీయులైన, ప్రాణ సమానులైన , మీ గురించి చెప్పడానికి నాకు ఏ విశేషణాలు దొరకట్లేదు . అందుకే నేరుగా విషయంలోకి వోచేస్తా...

ముందుగా అమ్మా నాన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు . ఇదేంటి ఇవాళ నా పుట్టినరోజైతే మీకు శుభాకాంక్షలు చెబుతున్నానేమిటి అని ఆశ్చర్యపోతున్నారా ? ?? నా పుట్టిన రోజంటే , తల్లిదండ్రులుగా మీరు పుట్టింది కూడా ఈరోజే కదా . పాతిక సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం లోకి నన్ను తీసుకొచ్చారు,దానికి తొమ్మిది మాసాల ముందు ఒక చిన్న నలుసుగా ఉన్నప్పటి నుంచే నా మీద ఎంతో ప్రేమ ,ఆప్యాయతలు చూపించారు. ఎదో జన్మలో చేసిన పుణ్య ఫలం వల్ల ఆ దేవుడు నాకు మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఇచ్చి గొప్ప వరాన్ని ప్రసాదించాడు. ఎంత అదృష్టమో నాది.

ఈ పాతికేళ్ళు ఎన్నో గొప్ప గొప్ప ఆనందాలు ,మర్చిపోలేని అనుభవాలు, మళ్ళీ రాని అనుభూతులు నాకిచ్చారు . రోజూ సైకిల్ మీద నన్ను స్కూల్లో దింపడం,కొత్త కొత్త బట్టలు వేసి ఫోటోలు తీయడం, ఆడపిల్ల అలంకరణ చేసి మీ ముచ్చట తీర్చుకోవడం . అంతా నిన్న మొన్న లానే ఉంది. నేను నవ్వితే ఆ ఆనందం మీ కళ్ళలో కనిపించేది .నేను ఏడిస్తే భాదంతా మీ మోహంలో ఉండేది . నన్ను కొడితే రోజంతే మిమ్మల్ని మీరు నిందించుకునేవాళ్ళు . నన్ను ఎవరైనా మెచ్చుకుంటే మీరు పొంగిపోయేవారు . మీకెన్ని ఇబ్బందులున్నా అవేవి నాకు తెలీనివ్వలేదు . మీకెన్ని భాధలున్నా నాకెప్పుడూ ఆనందాన్నే పంచారు . మీరు పస్తులున్నా నాకు పరమాన్నం పెట్టారు . అవస్థలెన్నో పడి నాకోసం ఆస్తులు కూడబెట్టారు. మీ రెక్కల కష్టం నా ఈ జీవితం మీ త్యాగాల ఫలితం నా రేపటి భవిష్యత్తు . నా ఆశయాల సౌధానికి పునాదులు మీరయ్యరు . నేను ఆకాశానికి ఎక్కుతానంటే , నిచ్చెనలా మారతారు . అమ్మా , నాకు చదువు చెబుతూ గురువు అయ్యావు,జోల పాడుతూ గాయనివి అయ్యావు . జబ్బు చేస్తే డాక్టర్ వి అవ్వగలవు . ఏదైనా చిన్న కష్టమొస్తే చెప్పుకునే నేస్తానివి అవుతావు . నాన్నా, నాకోసం దేనినైనా ఒదులుకోగలవు, నేను గెలవడం కోసం ఓడిపోగలవు . నా వెనకే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తుంటావు . అసలెలా వీలవుతుంది మీకు . ఏమి ఆశించకుండా , ఇంత ప్రేమ పంచడం మీవల్లే అయ్యింది. ఒక్కోసారి సిగ్గేసేది నన్ను చూసి నాకే,అసలింత ప్రేమ కి నేను అర్హుడినేనా అని. అప్పుడప్పుడు భయమేసేది ,మీరిద్దరూ లేకుండా నేను ఎలా బతికేది అని . అసలు నేనేమి చేసానని నా మీద ఇంత వాత్సల్యం. నా వల్ల ఎన్నో సూటిపోటి మాటలు భరించారు , అవమానాలు తప్పలేదు నావల్ల. నేనెప్పుడూ మీకు వడ్డీ పెరిగే అప్పులనే ఉన్నానే తప్ప విలువ పెరిగే ఆస్తిలా ఉండలేదు .

ప్రపంచం నాలోని పరాజితుడిని చూస్తే , మీరు మాత్రమే నాలో ఓ విజేత ఉన్నాడని గుర్తించింది . నేను కూడా నన్ను నమ్మనంతగా మీరు నన్ను నమ్మారు . ఓటములతో సతమతమౌతుంటే , ఓపికతో నా పక్కనే ధైర్యం చెబుతూ నిల్చున్నారు . నేను గెలిచాక నాకంటే ఎక్కువ మురిసిపోయారు. బాధైనా, భయమైన, వేడుకైన , వేదనైనా నాతో ఉన్నది ఉండేది మీరు మాత్రమే . ఎగరడానికి రెక్కలు ఇచ్చారు , ఎగిరే స్వేచ్ఛనిచ్చారు, దేనినైనా ఎదుర్కోగల ధైర్యాన్ని ఇచ్చారు.

మీ ఋణం నేను తీర్చలేను, జన్మని, జీవితాన్ని, జీవితానికో ఆశయాన్ని, ఆ ఆశయాన్ని సాదించడానికి మనోధైర్యాన్ని, ఇంకా ఎన్నెన్నో ఇచ్చిన మీకు నేనేమి ఇచ్చుకోలేను. ప్రతీ క్షణం మిమ్మల్ని ప్రేమించడం తప్ప. మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా నాన్నా , మీకు, నాకు కూడా

ఇట్లు మీ అబ్బాయి