దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టోయ్ పాడిపంటలు పొంగిపొరలే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్..
అది ప్రభుత్వ పాఠశాల ఐనా, ప్రైవేట్ పాఠశాల ఐనా తెలుగు మీడియంలో చదివించే ప్రతి పాఠశాల గోడలమీద గురజాడ గారి సూక్తులుంటాయి.. ప్రతిరోజు జరిగే ప్రార్ధనలో జాతీయగేయం తర్వాత ఆయన రాసిన పద్యాలను వల్లెవేస్తూ ఎంతో స్పూర్తిని పొందేవాళ్ళం. "తెలుగు భాష మహాకవి" అనే కీర్తిని ఆర్జించిన అతి తక్కువ తెలుగు కవులలో ఆయన ఒకరు. ఎప్పుడో 19వ శతాబ్ధంలో జాలువారిన ఆ అక్షరాలు ఇప్పటికి తెలుగుప్రజలలో బ్రతికే ఉన్నాయి, శక్తివంతంగా దారి చూపిస్తున్నాయి.
గురజాడ గారి పదాలు మాత్రమే కాదు చేతలు కూడా ఆయనలోని దేశభక్తిని తెలియజేస్తాయి.. 20లలో ఉండగానే విశాఖ వాలంటరీ సర్వీస్ లో చేరి సాంఘీక సేవ ప్రారంభించారు. మొదట దేశంలోని మరింతమందికి, మిగిలిన ప్రాంతాలవారికి చేరువ్వాలని ఇంగ్లీష్ లో కూడా పద్యాలు రాసేవారు. కాని తర్వాత పూర్తిస్థాయిలో గిడుగు రామమూర్తి(తెలుగు భాషా దినోత్సవం) గారితో భాషోద్యమంలో నిజాయితీగా పాల్గొన్నారు. నిజానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం మొదటిసారి గురజాడ గారు ఇంగ్లీష్ లోనే రచించారు ఈ కథ ముఖ్యంగా మన తెలుగు సాహిత్యంలోకి రావాలని కన్యాశుల్కాన్ని తర్జమా చేశారు. కన్యాశుల్కం ఎంతలా ప్రజాదరణ పొందిందంటే రష్యన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ లాంటి ఎన్నో భాషలలోకి అనువాదం జరిగింది.
గురజాడ అప్పారావు గారు నరనరాన దేశభక్తిని ఏవిధంగా నింపగలరో నాటి మహిళల జీవితాలను కూడా అంతే ఉదృతంగా రాయగలరు. గురజాడ కలంలో నుండి ఉద్భవించిన కొంత అక్షర సైన్యాన్ని మరోసారి మననం చేసుకుందాం.
ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరకులు నింపవోయ్. వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోయి మందగించక ముందు అడుగేయి వెనుకపడితే వెనకే నోయి. సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. "అన్న లారా తండ్రులారా ఆలకించం డొక్క విన్నప మాలు బిడ్డల కాసు కొనుటకు ఆశలే దొక్కొ కులము లోపల ? "పట్టమేలే రాజు అయితే రాజు నేలే దైవ ముండడొ ? పరువు నిలపను పౌరుషము మీకేల కలగదొకో. యీసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుఅగునోయ్ జల్దుకుని కళలన్ని నేర్చుకు దేశి సరకులు నింపవోయ్. మలిన వృత్తులు మాలవారని కులము వేర్చిన బలియు రొక దే శమున కొందరు వెలికి దోసిరి మలినమే, మాల కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి, కులము కలదట నరుల వ్రేచెడి క్రూర కర్ములకున్ మలిన దేహుల మాల లనుచును మలిన చిత్తుల కథిక కులముల నెల వొసంగిన వర్ణ ధర్మ మ ధర్మ ధర్మంబే. అన్నలారా తండ్రులారా ఆలకించం డొక్క విన్నప మాలు బిడ్డల కాసు కొనుటకు ఆశలే దొక్కొ కులము లోపల ? కలగవా యిక్కట్లు ? మేల్కొని, బుద్ధి బలమును బాహు బలమును పెంచి, దైవము నందు భారం వుంచి, రాజులలో "రాజులై మను డయ్య !" ఇట్లని కన్య నరపతి కప్పుడెదురై నాలు గడుడులు నడిచి ముందుకు పలికె నీ రీతిన్.