Contributed by Masthan Vali K
ఆకలేసినప్పుడు అన్నం తినడం అవసరం... అన్నం బదులుగా పరమాన్నం తినాలనుకోవడం ఆశ పడటం. ఆ పరమాన్నానికి రుచి మరిగి అదేపనిగా ఏకంగా ఆకలినే పెంచుకోవాలి అనుకోవడం అత్యాశ. అనుకున్నట్టే ఆకలి పెరిగాక (!), పరమాన్నం దొరక్కపోతే అనే ఆలోచన నీలో రేగిందంటే... దొరికిన దానితో అవసరం మేరా కడుపు నింపుకోకుండా... నాలుక కు లొంగిపోయి, దాని కోసం నువ్వెంచుకునే దారులు నీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి. నీ అత్యాశ నీ కళ్ళు కప్పేసి, పరిస్థితులు నీ ప్రమేయం లేకుండానే నీ చేతులకు కళ్ళాలప్పగించి, నీ బుద్ధి నీకు దారి కనిపించట్లేదన్న విషయాన్ని దాచేసి... విచ్చల విడిగా కోరికల గుర్రాన్ని స్వారీ చేయమంటాయిgues. దారి పొడవునా ఉన్న జనాలకి భయాందోళన కలిగిస్తూ, అడ్డుపడి నిన్నాపజూసిన నీ హితవు కోరేవారిని తొక్కుకుంటూ, అంధకారం లోనే అంతా వెలుగుందని భ్రమిస్తూ... వేగంగా సాగిపోతున్నట్టు ఉంటుందా ప్రయాణం. కానీ గమ్యం మాత్రం ఏనాటికి చేరుకొన లేవు. అయినా అత్యాశ నిన్నాగనివ్వదు. అది నీ అవసరాన్ని దాటేసి, నీ ఆకలిని చంపేసి, అసలు నీ పయనం ఎందుకో అన్న విషయాన్ని కూడా నువ్వు మరిచిపోయేలా చేస్తుంది.కానీ, నీ మదిలో నువ్వణిచేసిన, ఏ మూలనో వ్యధిస్తున్న నీ ప్రతిమ… ఉన్న శక్తినంతా ఏకం చేసి నీ మెదడుకు " ఎందాకీ పయనం? " అనే ప్రశ్న రేకెత్తించే తరుణం వస్తుందో రోజు... ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వదలిచి, నీ గుర్రాన్ని అదుపు చేసి, నీ కళ్లకున్న గంతలు తీసేస్తావు. అప్పుడు అంధకారానికి అలవాటు పడ్డ నీ కళ్ళు లోకం లోని వెలుగుని తాళలేవు. నిరాటంకమైన రోజుల తరబడి చేసిన స్వారీ నిన్ను స్థిమితంగా నేల పై నిలబడనీయక కుప్పకూలిపోయేలా చేస్తుంది. అప్పుడు నీకు మళ్లే యథేచ్ఛగా కళ్లు కానరాక గుర్రం పై దూసుకొస్తున్న ఒక వ్యక్తి నెత్తురోడిన దారిలో నిన్నీడ్చుకెళుతుంటే, ను పెట్టే ఆర్తనాదాలు విని నిన్ను కాపాడేవారెవరూ కనిపించరు. అగమ్య గోచరమైన స్థితిలో నీకున్న ఒకే ఒక్క అవకాశంగా కనిపిస్తుంది, నీ వెనకాలే పరిగెత్తుకొస్తున్న గుర్రం. రెండో ఆలోచన లేకుండా ఆ గుర్రాన్నెక్కేసి, మరలా కళ్ళకు గుంతలు కట్టేసుకున్న వెంటనే... నీ బాధలన్నీ మటుమాయమవుతాయి. అంధకారం ఎంతో అందంగా అనిపిస్తుంది.
కానీ, ఇప్పుడు నీకు తెలుసు, నీ గమ్యం నీకు తెలియదని. ఇప్పుడు నీకు తెలుసు, నీ పయనానికి అర్థం లేదని, దాన్ని నువ్వు ఆపలేవనీ... ఆపితే బ్రతకలేవని. ఇప్పుడు నీకు తెలుసు, నీ అత్యాశ నిన్నెటువంటి కపట మాయలో తోసిందోనని. ఇప్పుడు నీకు తెలుసు, నీ గుర్రపు కాళ్ళ కింద ఎంతో మంది నలిగి చస్తున్నారని... అన్నీ తెలిసి, ప్రాణం మీదున్న తీపితో... మరొక్కమారు ఆ కళ్ళ గంతలు తీసే సాహసం చేయబోవు.దుర్భరమైన ఆ ప్రయాణమే నీ జీవితమిక. ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది చచ్చినా…. ను బతకాలంటే గుర్రం దిగకూడదు, ఇదే సత్యం అనుకుంటావు. “కాదు మిత్రమా, నీ బ్రతుకెలాంటిదో నీకు చూపించే ప్రయత్నంలో భాగంగా దేవుడాడిన నాటకం ఇది. మరొక్కసారి నీ గుర్రాన్ని అదుపు చేసి, నీ కళ్లకున్న గంతలు తీసి చూడు...భయపడకు, నేనున్నాను నీకు. ఇంకొక్క సారి ప్రయత్నించు. ఈ అత్యాశల అశ్వాన్ని వదిలెయ్. నన్ను నమ్ము... " మది మూలలో పడున్న నీ ప్రతిమ మూలుగుతూ మరో సారి నిన్ను వేడుకుంటోంది... ఏం చేస్తావు మరి.?