Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP08)

Updated on
Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP08)

జరిగిన కథ – రాధే గోవింద, GREP01, GREP02, GREP03, GREP04, GREP05, GREP06, GREP07

తాతగారి మరణం తర్వాత ఊరిలో ఆరోగ్య పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఒకవైపు ఊరి ఆరోగ్య సమస్య, మరో వైపు గోవిందు మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించే వాళ్ళ ఆగడాలు, ఇంకోవైపు రాధమ్మ మీద విపరీతంగా ప్రేమ పెంచుకుంటున్న వైద్యుడు, మరో వైపు రాధమ్మ వాళ్ళ మేనత్త గొడవ...ఇన్నిటి మధ్య గోవిందు ఇరుక్కుపోయాడు. నీకొచ్చిన కష్టాన్ని ఎదురుకొనడంలో నువ్వు చూపిన సాహసాన్ని బట్టి నీ ధీరత్వం తెలుస్తుంది అంటారు, దేవుడు గోవిందుని సాటిలేని మహా వీరునిగా నిలపాలి అనుకున్నాడో ఏమో అన్ని కష్టాలు ఒకేమారు నెత్తిమీద వేసాడు. తాతగారు మరణించిన రోజే ఊరిలో మరో నలుగురు మరణించారు. తాతగారిని దహనం చేసి అలా ఇంటికి వెళ్ళిన గోవిందు... జయమ్మ భర్త అకాల మరణం కారణంగా మరో మారు హరిశ్చంద్ర వేదికకు రావాల్సి వచ్చింది. దహనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, దహనం చేసే ఒక్క క్షణం ముందు వైద్యుడు ఆపమని కాపరి వైపు సైగ చేసాడు. ఏమైందని అడిగాడు గోవిందు, "మీకు తెలియనిది కాదు గోవిందరాజులు గారు, కానీ మీరు నేను కోరిన విధంగా చేయడం లేదు." దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ? "అదే" అని గొంతు సరి చేసుకుంటూ... "అదేనండి, ఈ జబ్బు ఓ పెద్ద అంటువ్యాధని, ఆ జబ్బు కారణంగా ఎవరైనా చనిపోతే, భార్య పిల్లా పాపలతో సహా ఆస్తిపాస్తులు మొత్తం సమాధి చెయ్యాలని ఎప్పటి నుండో నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మీరు..." అని ఇంకేదో చెప్పబోతుంటే, ఆపండి అని గోవిందు అన్నాడు. మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా ? సతీ సహగమనంతో పాటు సర్వసహగమనం అని కొత్తగా మాట్లాడుతున్నారే, దీనికి నేను ఒప్పుకోను. ఏదైతే అది జరుగుతుంది, జయమ్మ వాళ్ళ కుటుంబాన్ని సజీవ దహనం చేయడానికి నేను ఒప్పుకోను. "సరే, మీ ఇష్టం. రేపు ఇంకొంతమంది చనిపోతే నేను భాద్యుడ్ని కాను. చివరి సారిగా అడుగుతున్నాను, సర్వసహగమనం జరిపిస్తారా లేక ఊరినే వల్లకాడు చేసుకుంటారో మీ ఇష్టం. నేను మా ఊరు వెళ్ళిపోతాను, అనుమతి ఇవ్వండి." ఈ సమయం లో మీరు ఇంత నిక్కచ్చిగా మాట్లాడడం సబబు కాదు వైద్యులు గారు. మీరే ఏదోక దారి చూపాలి కానీ, ఇలా, ఈ సమయంలో మాట్లాడడం తప్పు. రేయ్ మల్లన్న, నువ్వు చేయాల్సింది మొదలుపెట్టు. "అయితే, మీ పట్టు మీదే కాని ఊరి జనం ప్రాణాల మీద మీకేం గౌరవం లేదంటారు. సరే, మీ ఊరు, మీ జనం, మీ ఇష్టం. ఊరి జనం మీరు కూడా గోవిందరాజుల గారి మాట మీదే నిలబడతారా ? వల్లకాడు కాబోయే ఈ ఊరిలో ఉండలేను, మీ అజ్ఞ లేకపోయినా వెళ్ళిపోతాను, క్షమించండి." అంటూ వెళ్ళిపోతున్న వైద్యుడుని, గోవిందరాజులు అంటే గిట్టని కొంతమంది ఊరి పెద్దలు ఆపారు.

హరిశ్చంద్ర వేదిక లో ఇంత తతంగం జరుగుతుందని తెలిసి ఊరి జనం సాంతం అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరిని చూస్తూ, కొంతమంది ఊరి పెద్దలు "ఏరా! మీరేం అంటారు. జయమ్మ మన పిల్లే, దాని కష్టం మనకు కష్టమే. కాని, కష్టం కంటే ప్రాణం ముఖ్యం కదా. చెప్పండి, జయమ్మ కుటుంబాన్ని పూడ్చేద్ధామా ? వద్దా ? వైద్యులు గారు చెప్తునట్టు రేపు ఇది వీళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు రావచ్చు. ఊరంతా పాకొచ్చు. చెప్పండి, మీ మాటే ఊరి మాట. దాని ముందు ఎవ్వరి మటైనా తక్కువే." ఊరి జనం అంతా "పుడ్చేయాలి, పూడ్చేయాలి... పూడ్చేయాలి" అంటూ అరుస్తున్నారు. గోవిందు "మతి పోయిందా అందరికి. ఈ రోజు జయమ్మ, రేపు మనలో ఎవరో ఒకరు ఇక్కడ ఉంటాం. అప్పుడూ ఇదే మాట చెప్తారా ? పోయే ప్రాణం పట్టుకు కూర్చుంటే ఆగుతుందా ?!" ఇంకేదో అనేలోపు జయమ్మ కూతురు, కొడుకు కక్కుకోవడం మొదలెట్టారు. జయమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి. వైద్యుడు వాళ్ళను పరిక్షించి వాళ్ళకు అదే జబ్బు ఉందని నిర్ధారించి, ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం అని అనగానే ఊరి జనం అందరు జయమ్మను, పిల్లలతో సహా, బతికుండగానే చనిపోయిన భర్త శవంతో పాటు ఆస్తిపాస్తులు అన్నీ వేసి సజీవ సమాధి చేసారు. పాతికేళ్ళ జీవితంలో మొదటిసారి ఓడిపోయాడు గోవిందు, వందల మంది తన జనమే తనకి అడ్డుపడుతుంటే, ఏమి చేయలేని నిస్సహాయుడిలా, కళ్ళల్లో నీళ్ళతో, గుండెల్లో బరువుతో, మోకాళ్ళపై కుప్పకూలి, జయమ్మ ఆఖరి చూపు వరకు తననే చూస్తూ అక్కడే ఉండిపోయాడు. ఊరి జనం అందరు వెళ్ళిపోయారు వైద్యుడు, కాపరి తో సహా, గోవిందు మట్టుకు మోకాళ్ళ పైన కుప్పకూలిన ప్రదేశం నుండి కదలకుండా అలానే ఆ సమాధిని చూస్తూ ఉండిపోయాడు. చీకటి పడే ముందు రంగడు గోవిందుని వెతుకుంటూ వచ్చాడు. గోవిందుని కదిలించగానే, రంగడుని పట్టుకొని గట్టిగా అరుస్తూ చాలా సేపు ఏడ్చాడు గోవిందు.

ఆ తర్వాత ఓ రెండు వారాల వరకు ఊరిలో ఎవ్వరు జబ్బు వలన చనిపోలేదు. వైద్యుడి చెప్పినట్టుగా సర్వసహగమనం చేయడం మూలానే ఇప్పటివరకు ఊరిలో ఎవ్వరు చనిపోలేదని అందరు వైద్యుడిని పొగడడం మొదలెట్టారు. సర్వ సహగమనం చేయడం తప్పు కాదు, అదే సరైన పద్ధతని చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా నమ్మడం మొదలెట్టారు. తాతగారికి పదకొండవ రోజు చేయవలసిన కర్మలు జరిపించడానికి గోవిందు తో పాటు రాధమ్మ కూడా స్మశానానికి వచ్చింది. మధ్యాహ్నం ఆలస్యంగా మొదలెట్టడం వలన, ఆ కార్యక్రమం పూర్తయ్యే లోపు కొద్దిగా చీకటి పడింది. గోవిందు వాళ్లతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, స్మశానంలో కాపరి, రాధమ్మ, గోవిందు, రంగడు తప్ప ఇంకెవ్వరు లేరు. కొద్దిసేపటికి అప్పటివరకు ఉన్న వాతావరణం మొత్తం మారిపోయి, చాలా చల్లగా మారిపోయింది. గోవిందుకు వ్యతిరేకంగా, కాపరికి ఎదురుగా ఉన్న రాధమ్మ మోహంలో ఎదో మార్పు. గాలి రాకున్నా రాధ కురులు ఎగురుతున్నాయి, తల దించుకొని, ఏడుస్తూ కోపంగా "నా భర్త, పిల్లలు వాడి వలెనే చనిపోయారు. ఆ వైద్యుడిని చంపేస్తాను." అని అరుస్తున్న రాధమ్మ చేతిని గోవిందు గట్టిగా పట్టుకున్నాడు. గోవిందు చేయి విడిపించుకొని ఎదురుగా ఉన్న కాపరి వైపు పరిగెత్తి, వాడి పీక పట్టుకొని, పైకి లేపుతూ "ఏరా! మా ఆయనతో పాటు, నన్ను, నా పిల్లల్ని సజీవ సమాధి చేస్తావా. నీ ప్రాణాలు తీస్తా ఈరోజు." అంటూ వాడి ఊపిరి ఆపేల ఉండగా గోవిందు వచ్చి కాపరిని విడిపించి, రాధమ్మను గట్టిగా హత్తుకున్నాడు. చాలాసేపు విడిపించుకోవడానికి ప్రయత్నించి, కొద్దిసేపటికి ఏమి చేయలేక, కన్నీరు పెట్టుకుని శాంతించింది. ఒక్కసారిగా గాలి తీసేసిన బుర్రలా, శక్తి మొత్తం కోల్పోయి నీరసించి పడిపోయింది రాధమ్మ. చుట్టూ ఉన్న వాతావరణం మళ్ళీ మామూలు స్థితి కి వచ్చింది.

నీరసంగా ఉన్న రాధమ్మను తీసుకొని, మామిడి తోట గుండా ఇంటి వైపు వస్తున్న గోవిందును చుట్టుముట్టారు మొహానికి గుడ్డ కప్పుకున్న ఓ ఆరుగురు. వాళ్ళ వెనుక చీకట్లో, చెట్ల మధ్య నుండి, పై నుండి కిందవరకు తెలుపు రంగు వస్త్రాలలో మెరిసిపోతూ, చుట్ట వెలిగించుకుంటూ, గంభీరంగా నవ్వుతు, అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు ఓ యాభై ఏళ్ల పెద్దాయన. ఆయన్ని చూసాక కూడా గోవిందుకు వాళ్ళెవరో అర్ధం అవ్వలేదు. గోవిందుని చూస్తూ వచ్చి, గోవిందుకు ఎదురుగా ఓ చెక్క కూర్చి వేయించుకొని, కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు ఆ పెద్దాయన. గోవిందుకు ఎవరో గుర్తురాలేదు, ఎందుకు ఆపారో తెలుసుకోవాలని లేదు, రాధమ్మ పూర్తిగా పడిపోయేలోపు ఇంట్లో ఉండాలి అనే ఆలోచన తప్ప అతని మనసులో మరేమీ లేదు. ఎటువంటి ప్రతిస్పందన లేని గోవిందు ముఖాన్ని చూస్తూ "ఏరా సిన్నోడా, ఎంత పెద్దోడివి అయిపోయావ్ రా! నన్ను గుర్తుపట్టలేదూ ?" లేదండి అనట్టు సైగ చేసాడు గోవిందు. "ఎలా గుర్తుంటుంది లే, ఎప్పుడో నీ చిన్నప్పుడు చూసావ్. నా గురించి చెప్పడం ఎందుకు లే కాని, నేనెందుకు వచ్చానో సెప్తాను." రాధమ్మ నీరసంతో పడిపోతే మధ్యలో మీ నస ఏంటి అనట్టు చూస్తున్నాడు గోవిందు. "మీ నాన్న, నాకు మంచి దోస్తులే. ఓ సారి నిన్ను తీసుకొని మా ఊరు తిరనాళ్ళకు వచ్చాడు. మీ అమ్మ కూడా వచ్చింది మీతో పాటే. పొరపాటున నా చేయి మీ అమ్మకు తగిలింది, ఓ నాలుగైదు సార్లు. క్షమాపణ చెప్పమన్నాడు మీ నాన్నా, నేను చెప్పాను. ఏమి అనకుండా వదిలేసాడు, క్షమాపణతో పొయ్యేదే కదాని ఈ సారి కావాలనే మీ అమ్మను తాకింది నా ఒళ్ళు. ఈ సారి క్షమాపణ అడగలేదు మీ నాన్న...నా ఒళ్ళు మీ అమ్మను తాకితే, మీ నాన్న ఒళ్ళు మండింది, నా ఒళ్ళు పగిలింది." ఇప్పుడు ఈ గోలంతా ఏంటి అనట్టు చూస్తున్నాడు గోవిందు. "మీ నాన్న అక్కడితో ఆగుంటే నేను ఇక్కడికి వచ్చేవాడ్ని కాదు. తగిలింది, క్షమాపణ చెప్పాను. పట్టుకున్నాను, పగిలింది ఒళ్ళు. అక్కడి వరకు తప్పు లేదు, కానీ ఊరందరి ముందు నాకు గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టించి, గాడిద మీద ఊరేగించాడు మీ బాబు. అలుపు లేకుండా చావు దెబ్బలైనా తినేవాడ్ని, కాని అవమానాన్ని భరించలేక పోయాను. మీ నాన్నని చంపి, మీ అమ్మని ఉంచుకుందాం అని కొన్నాళ్ళకు మీ ఊరొచ్చా, అప్పటికే వాళ్ళు పైకి పోయారు. మీ నాన్నతో నాకు చాలా లెక్కలు ఉన్నాయ్ రా, నువ్వు అన్నీ పరిష్కరిస్తావట కదా". ఒక్క పది నిమిషాలు మీవి కావనుకోండి, ఇలా వెళ్లి, అలా రాధమ్మను ఇంట్లో దింపి, వెంటనే వచ్చేస్తాను. ఆ తర్వాత అన్ని లెక్కలు సరిచూసుకుందాం, ఏమంటావ్ బాబాయ్ ?. "ఆగరా అబ్బాయ్, ముందు నన్ను చెప్పనీయ్. అప్పుడు నేను అనుభవించిన నరకం మీ బాబుకు తెలిసేలా చేద్దాం అనుకున్నాను, దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ దేవుడు కరుణించాడు." అంటూ రాధమ్మ వైపు చూస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు. గోవిందు కనుపాప పైకి లేచింది, కళ్ళలో నెత్తురు మరగడం మొదలైంది, చేతుల పిడికిలి బిగిసుకుండగా, కొద్దిగా నెమ్మదించి...వద్దు బాబాయ్, దయచేసి వెళ్ళిపొండి. ఈ వయసులో మీకెందుకు ఇవన్నీ. పొండి, చక్కగా ఇంటికి వెళ్లి, నవ్వారు మంచం మీద లుంగీ ఎగ్గట్టి, కాళ్ళు బార్ల చాపుకొని పడుకోండి, తీసుకెల్లండ్రా. "వెళ్తాను, దాన్ని నా తొడల మీద కూర్చోపెట్టి నువ్ వెళ్ళగానే, నీ వెనుకే మేము వెళ్తాం". హ్మ్...చెవులతో విననంటావ్, పెదాలు పలకొద్దంటావ్, మామూలుగా కుదరదంటావ్, ఇలానే కావాలంటావ్ అంతేగా...సరే నువ్వంతలా అడుగుతుంటే తప్పదుగా. కానీ ఒక్క విషయం... చేతులే మాట్లాడాలి అంటే నీ దేహం తట్టుకోగలదా బాబాయ్?! ఆ తర్వాత నువ్వెంత బతిమాలిన నా చేతులు వినిపించుకోవు మరి. "ఆహా! అబ్బకు మించి పోగారుంది రా నీకు. చూస్తారేంట్రా... దాన్ని తీసుకొచ్చి నా ఒళ్ళో పడేసి, వాడి ఒళ్ళు పగలదియ్యండి".

రాధమ్మకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ ఆరుగురుని, తెల్ల బట్టల పెద్దాయన్ని ఉతికి ఆరేసాడు గోవిందు. వాళ్ళని వచ్చిన బండిలోనే ఎక్కించి, జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పి పంపించాడు. ఇంటికి వెళ్ళాక కాని తెలీలేదు, ఆ గొడవలో ఓ చెక్కపేడు ఎగిరొచ్చి రాధమ్మ చేతికి కుచ్చుకుని రక్తం ధారగా కారుతున్న సంగతి. రాధమ్మ పూర్తిగా నీరసించి పడిపోయింది, గోవిందు కన్నీళ్ళతో వెళ్లి వైద్యుడిని తీసుకొచ్చాడు. రాధమ్మను అలా చూడగానే వైద్యుడి కంట్లో నీళ్ళు తిరిగాయి, అది గోవిందు గమనించాడు, గోవిందుని వైద్యుడు గమనించలేదు. నీళ్ళు బయటకు రాకుండా వైద్యుడు రాధమ్మకు పసరు కట్టు కట్టి, గుళికలు ఇచ్చి, వెళ్ళబోతూ... "అసలెలా జరిగింది" అని అడిగాడు. తోటలో నుండి చీకట్లో నడుచుకుంటూ వస్తుంటే... "ఆ చెక్క పేడు చూస్తుంటే గొడ్డలి కర్రాలా ఉంది. ఏదైనా గొడవ జరిగిందా ?". అలాంటిదేం లేదు వైద్యులు గారు. "గోవిందరాజులు గారు, మీకో విషయం చెప్తాను ఏమి అనుకోరు గా". చెప్పండి వైద్యులు. "మీ శత్రువులకు రాధమ్మను లక్ష్యంలా మార్చకండి" అంటూ గోవిందు ప్రతిస్పందన వినకుండానే కోపంగా వెళ్ళిపోయాడు వైద్యుడు. వైద్యుడి మాట గోవిందును బలంగా తాకింది, అప్పటివరకు లేని కొత్త ఆందోళన మొదలైంది గోవిందులో. రాధమ్మను చూస్తూ ఆలోచనలో పడ్డాడు గోవిందు... చిన్నప్పటి నుండి తను గొడవ పడిన మనుషులు, ఆ సందర్భాలు, ఆ సమయంలో తాతగారి మాటలు అవన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి గోవిందుకు.

ఓ హరిజనుడిని భయపెట్టాలని చూస్తున్న ఓ పెద్దమనిషితో... అందరికి ఎదిగే హక్కు ఉంటుంది బాబాయ్, నీ ఒక్కడి సొత్తు కాదది. ఒక మామూలు వ్యక్తిని విజేతగా మార్చే శక్తి ఒక్కటే అహం. దాన్ని రగిలించాలని చూడకు బాబాయ్, ఆ సెగకే తట్టుకోలేవు తాకాలని చూడకు.

ఊరి చివర జలపాతం దగ్గర వదిన వరసైన ఆడపిల్ల పై అగాయత్యం చేయబోయిన కామంధుడితో... ఏం పర్లేదు, ఎవ్వరూ చూడట్లేదు, ఎవ్వరికి తెలిసే అవకాశమే లేదని... వావివరసలు మరిచి, ఎవరిపైన పడితే వాళ్ళ పైన చెయ్యి వెయ్యం. దానికి కారణం మనలో ఉండే సంస్కారం, నిగ్రహం, మన చుట్టూ ఉండే సాంప్రదాయాలు, మన సంస్కృతి. బహుశా నీలాంటి వాళ్ళకో జీవితం పట్టొచ్చు అర్ధమవ్వడానికి. ఐనా అవుతుందన్న హామీ ఇవ్వలేను బాబాయ్. ఇంకెప్పుడూ ఈ ఊరిలో, ఆ తల్లికి దగ్గరలో కనిపించకు. గ్రామంలో సామాజిక వర్గాల మధ్య సయోధ్యను దెబ్బతీయ్యలని తీవ్రంగా శ్రమిస్తున్న ఓ మూర్కుడితో... నువ్వెలా పుట్టావో నేను అలానే పుట్టాను. నువ్వు మట్టిలోకే, నేనూ అక్కడికే. మనం మట్టి తినడంతో మొదలై, మనల్ని మట్టి తినడంతో ముగిసిపోయే ఆటలో ఇన్ని వర్గాలు, విభేదాలు, విరోధాలు ఎందుకు బాబాయ్. పో... ఉన్నంతకాలం హాయిగా బతుకు, బతకనివ్వు. ఇంతకంటే మాటలతో చెప్పలేను, నీ దేహం తట్టుకోలేదు, వెళ్ళు. ఏదైనా కడుపు నింపే పని చేసుకో, కడుపులు కొట్టే పని కాదు.

ఎన్ని సార్లు తప్పు చేయొద్దని చెప్పినా వినని వ్యక్తితో...తప్పులందరూ చేస్తారు బాబాయ్, తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఏం చేసావన్న దానిపైనే నువ్వేంటో తెలుస్తుంది. నీకు మంచి, చెడుల గురించి చెప్పేంత పెద్ద తప్పు నేను చేయాలనుకోవడం లేదు. ఒకరోజు ఎవరికో సాయం చేయడానికి బయలుదేరేముందు, తాత గారు " ఆకలైన, కన్నీరైనా, కష్టమైనా కర్మానుసారమే అంతా. వాళ్ళ గురించి నీకెందుకు గోవిందా, ఎవరి కర్మ కి వారిని వదిలెయ్యాలి. అందరికి తోడుండడానికి నువ్వేం దేవుడివి కాదు, మామూలు మనిషివి". భుక్తాయాసపు త్రేన్పులు మాటున ఆకలి కేకలు వినపడవండి. మనమే మనసుపెట్టి వినాలి. ఎండిన గొంతు లోపలి కన్నీటి జాడ మనమే కనిపెట్టాలండి. మనిషినేనండి... మామూలు మనిషిని కాబట్టే మనసును ఆపలేకపోతున్నాను. ఐనా, మన అనే మాట తెలీనివాడు, మన అనుకోని సాయం చేయలేనివాడు మనిషెలా అవుతాడండి. మీకు చెప్పేంతవాడిని కాను, కానీ చెప్పాలనిపించింది. "కుర్రతనం కదా, ఇప్పుడు అర్ధం అవ్వదులే. ఏదో ఒకరోజు ఈ సంఘటన తలుచుకుంటావ్. తలుచుకుంటున్నావ్ అంటే, నువ్వు దేనికో భయపడుతున్నావని అర్ధం చేసుకో అప్పుడైనా."

ఆ గడిచిపోయిన జ్ఞాపకాల లో కొట్టుకుపోతున్న గోవిందును గట్టిగా నెట్టి లేపింది రాధమ్మ. "బావా... బావా... బాగా నొప్పిగా ఉంది బావా" అంటూ కన్నీరు కారుస్తున్న రాధమ్మను చూడగానే గోవిందు గుండె పగిలిపోయింది. వైద్యుడు ఇచ్చిన గులికలు వేసి, పడుకోపెట్టాడు. ఆ ఒక్క సంఘటన వలన రాధమ్మ పక్కన గోవిందు ఉండడం, రాధమ్మ ప్రాణాలకు ప్రమాదమే అనే భయం నాటుకుపోయింది గోవిందు లో.

ఆ తర్వాత గోవిందు రాధమ్మను తీసుకొని బయటకు ఎక్కువ వెళ్ళలేదు. వెళ్ళిన ప్రతీసారి ఎవరో ఒకరు దాడి చేయడం, వాళ్ళ నుండి రాధమ్మను కాపాడడం గోవిందు దిన చర్యగా మారిపోయింది. ఓ సారి అలానే దాడి జరిగినప్పుడు గోవిందుకు బాగా గాయాలయ్యాయి, రాధమ్మను ఇంటి దగ్గర దింపి, విశ్రాంతి తీసుకోమని, మందు కోసం వైద్యుడి దగ్గరకు వచ్చాడు. వైద్యుడు పసరుతో కట్టు కట్టి, గుళికలు ఇచ్చి, కాసిన్ని మజ్జిగ తాగి వెళ్ళండి అని అడిగాడు. ఈ సారి వచ్చినప్పుడు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతున్న గోవిందుని చూస్తూ, "ఎంతకాలం ఇలా రాధమ్మకు దిన దినగండం చూపిస్తారు ? తను ప్రశాంతంగా, ఆనందంగా, నవ్వుతు, సుఖంగా బతకడం మీకు ఇష్టం లేదా ? ఈ రోజు కాపాడారు, రేపు కాపాడతారేమో, మరి ఎల్లుండి ? ఆ తర్వాత ?. రోజులు మారుతున్నా కొద్ది సత్తువ తగ్గిపోతుంది కాని పెరగదు. ఆలోచించుకోండి, రాధమ్మ బతికుండాలా వద్దా ?" అని వైద్యుడు అరుస్తుంటే గోవిందు ఏమి పట్టని వాడిలా వెళ్ళిపోతాడు. అలా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తూ, రంగడితో...(ఏడుపు స్వరంతో) రంగా! భయమేస్తుంది రా. నాకేదో అవుతుందని కాదు, రాధమ్మకు ఏమైనా అవుతుందేమోని. ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా కాపడగలను కానీ, ఎదో ఒక్క క్షణం ఆ కన్ను కునకు తీస్తే, ఆ ఒక్క క్షణం రాధమ్మకు ఏమైన అయితే ? అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అని భయంగా ఉందిరా రంగ. వీటన్నిటి నుండి రాధమ్మను దూరంగా, ఎవరైనా ప్రేమగా చూసుకునే వాడ్ని వెతికి, వాడితో పంపెయ్యాలి రా. కానీ, రాధమ్మ నేనుండగా వేరొకర్ని చేసుకోదు. ఏదోటి చెయ్యాలి, రాధమ్మను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. రాధమ్మను, నా రాధమ్మను... అంటూ ఆ పై చెప్పలేక రంగడుని పట్టుకొని ఏడుస్తాడు గోవిందు.

ఇంటికి వెళ్ళిన గోవిందుని చూస్తూ, "బావా...నాకు ఆ వైద్యుడి పైన నమ్మకం లేదు. పదా పట్నం వెళ్లి మంచి వైద్యుడి దగ్గర కట్టు కట్టించుకొని వద్దాం." మంచి వైద్యమే చేస్తున్నాడు రాధమ్మ వైద్యులు గారు. నువ్వు అలా ఆలోచించకు. "లేదు బావా, నాకెందుకో మనసొప్పడం లేదు. పదా, ఎందుకైనా మంచింది ఓ సారి పట్నం వెళ్లి చూయించుకొని వస్తే పోయేదేముంది". ఇప్పుడు నాకేం అవ్వలేదు రాధమ్మ, ఇంకో సారి ఐనప్పుడు చూద్దాం లే. "ఉహు... లేదు. ఇప్పుడే వెళ్ళాలి. నువ్వు చూపించుకోవాలి. పదా..." అంటూ వెళ్లి జట్కాలో కూర్చుంది రాధమ్మ. ఇక చేసేది లేక, పట్నం బయలుదేరారు. పట్నంలో పేరున్న వైద్యుడి దగ్గరకు వెళ్లి చూపించుకుంటే, అంతా మంచిగానే ఉందని చెప్పడంతో రాధమ్మ శాంతించింది. తిరుగు ప్రయాణంలో... సాంబడు పొలం వ్యవహారం లో పగతో వెళ్ళిన పట్నం అతని కంట్లో పడ్డారు గోవిందు రాధమ్మ. పట్నం దాటినా కొద్దిసేపటికి, ఆ పట్నం అతను మోటారు వాహనాలతో గోవిందు, రాధమ్మపై దాడి చేసారు. రాధమ్మను కాపాడే క్రమంలో, ఎదురుదాడిలో గోవిందుకు బాగా గాయాలయ్యాయి. ఒకానొక సమయంలో రాధమ్మను కాపాడలేనేమో అనే భయం గోవిందులో తీవ్రంగా కనిపించింది. మొత్తానికి అందరిని పడగొట్టి, రక్తం కారుతున్న దేహంతో ఊరు చేరుకున్నారు. రాధమ్మ కూడా వైద్యుడు దగ్గరికి వస్తా అన్నా, వద్దని గోవిందు ఒక్కడే వైద్యుడి దగ్గరికి వచ్చాడు. రాధమ్మకు ఏమైనా అయ్యిందేమో అనే ఆందోళనతో చూస్తున్న వైద్యుడ్ని చూస్తూ రాధమ్మకు చిన్న దెబ్బ కూడా తగలలేదు, కాస్త ఈ దేహాన్ని చూడండి అంటూ వైద్యుడి బల్ల పైన బోర్లా పడ్డాడు గోవిందు. వైద్యుడి దగ్గరికి వచ్చి, చొక్కా విప్పిన తర్వాత, వైద్యుడు చూసి చెప్పేంత వరకు గోవిందుకు కూడా తెలీదు అతని వెన్నులో కత్తి దిగిందని. ఆ కత్తిని చిన్నగా తీస్తూ...వైద్యుడు "ఐపోయినట్టుందండి". నొప్పిని దిగమింగుతూ, అంత నొప్పిలోనూ నవ్వుతూ ఏంటి వైద్యులు గారు ? ఒంట్లో రక్తమా, గొంతులో ప్రాణమా ?. "రాధతో మీ బంధం". ఉన్నపళంగా వైద్యుడి వైపు చూసి, నొప్పి తో నవ్వుతు నాకు అలానే అనిపిస్తుందండీ. "మరేం చేద్దామని ?". ముందు కట్లు వెయ్యండి, ఇలా జరిగిందని తెలిస్తే రాధమ్మ తట్టుకోలేదు. "మీరు ఆ విషయం చెప్పాల్సిన పని లేదు గోవిందరాజులు గారు. నేను పసరు కట్టు కట్టాను, ఓ తైలం ఇస్తాను ప్రతి రోజు మర్దన చేయండి ఓ నెల రోజుల్లో మాయం అయిపోతుంది. కానీ..." ఎందుకు సంకోచిస్తారు, చెప్పండి. "ఈ రోజు ఇక్కడ దిగింది కత్తి, రేపు గుండెల్లో దిగొచ్చు, ఇలా ఎంతకాలం ?" ప్రాణం ఉన్నంతవరకు. "మీరు ప్రాణాలతో ఉండి రాధమ్మకు నరకం చూపిస్తారా ?". అదీ నిజమే. ప్రతీ చోటా వెంబడిస్తున్నారు. నన్ను ఎదురుకునే ధైర్యంలేని చవటలు. ఈ రోజుతో రాధమ్మను ఎల్లప్పుడూ కాపాడగలననే నమ్మకం పోయిందండి. ఈ సమస్యలకు పరిష్కారం చిక్కడం లేదు. "అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉండవు గోవిందరాజులు గారు, కొన్నిటిని సమూలంగా నిర్మూలించడమే". హ హ హా... "మీరు ఉన్నంత కాలం రాధమ్మ ఆనందంగా ఉంటుందేమో కాని, ప్రాణాలతో ఉంటుందో లేదో అనే భయం మట్టుకు తోడుగా ఉంటుంది. రాధమ్మను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉండే ఉంటారు, వాళ్ళతో ఉంటె మీతో ఉన్నంత ప్రేమగా ఉండకపోయినా కలకలం ప్రాణాలతో హాయిగా బతికే ఉంటుంది." నా ఊపిరే రాధమ్మ వైద్యులు గారు. "ఆ ఊపిరినే ప్రాణ భయం లేకుండా బ్రతకనివ్వండి అంటున్నాను గోవిందరాజులు గారు. సరే మీరిక వెళ్ళండి, రాధమ్మ ఎదురుచూస్తూ ఉంటారు మీకోసం." నిజమే అంటూ లేచి వెళ్ళిపోతూ, ఎదో గుర్తోచినట్టు వెనక్కి తిరిగి... కాసింత మజ్జిగ ఇవ్వండి. మీరు ఎప్పటి నుండో నాతొ తాగించాలని ఆరాట పడుతున్న మజ్జిగ. అలా అడగగానే వైద్యుడు పరిగెత్తుకు వెళ్లి, క్షణంలో మజ్జిగతో ముందున్నాడు. ఆ మజ్జిగను చూసి, ఓ రెండు క్షణాలు కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచి ఒక్క గుటకలో తాగేసి, బాగా చూసుకుంటారు కదా అని వైద్యుడి వైపు చూసి అడగగానే , "ప్రాణంలా" అని వైద్యుడు సమాధానం ఇస్తాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు గోవిందు ఆరోగ్యం క్షీణిస్తుంది. వైద్యుడి పై తన అభిప్రాయం గురించి అడుగుతాడు గోవిందు, రాధమ్మను. రాధమ్మ "వైద్యులు గారు నాకు విద్య నేర్పిన గురువు, మన ఊరిని కాపాడడానికి వచ్చిన దేవుడు. కానీ, ఈ మధ్య కొద్దిగా వింతగా ప్రవర్తిస్తున్నారు ఎందుకో. అయినా ఇప్పుడు వారి గురించి ఎందుకు బావా, హాయిగా నిద్రపో". వైద్యులపై నా మీద ఉన్నంత గౌరవం ఉన్నట్టుంది కదా రాధమ్మ నీకు. "ఉహు... నీ మీద కన్నా ఎక్కువ గౌరవం ఉంది. వైద్యులు, గురువు గారు కూడాను". ఆ మాట వినగానే గోవిందు ముఖంలో ఆనందం కనిపించింది. "ఏంటి బావా, ఒక్కసారిగా ఆనందం". ఏం లేదు అనట్టు తల ఊపాడు గోవిందు. ఆ తర్వాత చాలా రోజులు గోవిందు ఇలానే రాధమ్మ ను వైద్యుడి గురించి, వేరే విషయాల గురించి, ఆస్తుల గురించి అడుగుతూ, చెప్తూ ఉండేవాడు. పెళ్లి ముహూర్తంగా నిర్ణయించిన తేదీకి వారం ముందు గోవిందు పరిస్తితి పూర్తిగా చేయిదాటిపోయిందని వైద్యుడు చెప్పి వెళ్ళిపోయాడు. గోవిందు చనిపోయే ముందు రాధమ్మాతో… నేను ఉన్నా లేకున్నా ఎప్పుడూ కన్నీరు పెట్టకు. అమ్మ దగ్గరికి వెళ్తున్న ఆనందం కన్నా, అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అనే బాధ ఎక్కువ ఉంది. చివరి వరకు తోడుగా ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు. అంటూ చివరి శ్వాస విడుస్తాడు."""

ఆ సరస్సు గట్టున కూర్చొని గోవిందరాజులు కథ రాస్తున్న గోవిందుకు అడుగు దూరంలో బైక్ మీద ఉంచిన బ్యాగ్ లో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వస్తూ ఉంటుంది. గోవిందరాజులు కథను పూర్తి చేసిన ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అను అని గోవింద్ ఎదో చెప్పబోయేలోపు "రాజ్... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి రా " అని కాల్ కట్టవుతుంది. గోవిందరాజులు స్టొరీ రాసిన బుక్ ని జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టుకొని, అతి వేగంగా ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వచ్చి, డోర్ ఓపెన్ చేయగానే, గోవింద్ వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లెలు, బావ, అను రాధా వాళ్ళ అమ్మ,నాన్న అందరు హలో లో దిగాలుగా కూర్చొని ఉంటారు. హేయ్! మీరందరూ ఏంటి ఇక్కడ ? అనూ... pregnancy confirm అయ్యిందా అనట్టు సైగ చేస్తాడు. By the way గోవిందరాజులు కథ మొత్తం పూర్తి చేసాను. అమ్మా... మన ఊర్లో వైద్యుడి ఇల్లు ఉండేదే దాని గురించి, ఆ హరిశ్చంద్ర వేదిక గురించి, రాధ గోవిందుల గురించి మొత్తం తెలుసుకున్నాను. I know everything now, finally. ఇలా గోవిందు సంతోష పడుతుంటే మిగిలిన అందరూ ఇంకా ఆందోళన పడుతుంటారు. "రాజ్... నాతో రా ఒకసారి" అంటూ అను గోవింద్ ను తీసుకొని సైకియాట్రిస్ట్ రిషి దగ్గరకు తీసుకొస్తుంది అను. గోవింద్ "thanks అను, నేనే రిషి దగ్గరకు వద్దాం అనుకుంటున్నా. స్టొరీ అవ్వగానే ఫైనల్ draft ఇవ్వమన్నాడు." అంటూ లోపలకు వెళ్ళారు. రిషి కేబిన్ లో ఓ ముగ్గురు డాక్టర్ లు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ముగ్గురిలో సీనియర్ డాక్టర్ గోవింద్ ని డీప్ హిప్నోటిక్ స్టేట్ లోకి తీసుకెళ్ళి అతనితోనే అన్ని చెప్పించి, గోవిందరాజులు, రాధే గోవిందా ఇవన్నీ తన కల్పనే కాని నిజంగా వాళ్ళ ఊర్లో జరిగిన విషయాలు కాదని చెప్పిస్తారు. ఆ టైం లో రికార్డు చేసిన వీడియో ని గోవింద్ నార్మల్ స్టేట్ కి రాగానే చూపిస్తారు.

గోవింద్ అది నమ్మక, ఇంటికి వెళ్లి వాళ్ళమ్మను, నాన్నను అడుగుతాడు. వాళ్ళు కూడా అలాంటివి ఏమి లేవని, అదంతా గోవింద్ ఊహని చెప్తారు. వాళ్ళ మాటలను నమ్మని గోవిందు, వాళ్ళను తీసుకొని ఊరు వస్తాడు. అక్కడ అంతా కొత్తగా ఉంటుంది, రాధే గోవిందలో చెప్పింది ఏది ఉండదు. అసలు వాళ్ళ ఊర్లో పాత ఇల్లులే ఉండవు, మామిడి తోట ఉంటుంది కాని, దాని వెనుక వరి చేను ఉంటుంది. హరిశ్చంద్ర వేదిక అనే పేరు ఆ ఊర్లో ఎవ్వరిని అడిగిన తెలీదనే చెప్తారు. గోవిందుకు మతిపోతుంది, ఇదంతా అతని ఊహే అంటే అతను నమ్మలేక పోతాడు. ఓ రెండు నెలల తర్వాత మామూలు స్థితికి వచ్చి, తన పుస్తకం గోవిందరాజులు టైటిల్ తో ప్రచురిస్తాడు. అది మంచి హిట్ అవుతుంది, గోవిందుకు బాగా డబ్బులు వస్తాయి, కాని అతని మనసులో ఎక్కడో అది కథ కాదు చరిత్ర అని గట్టి నమ్మకం ఉంటుంది. ఓ ఆరు నెలల తర్వాత తన కొత్త కథ కోసం, మళ్ళీ గోవిందరాజులు రాసిన సరస్సు దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. పుస్తకం తీసి కథ పేరు 'రియ' అని రాయగానే... "యో...యారు..." అని లీలగా అరుస్తూ తన వెనుక వైపుగా అరుస్తూ వస్తున్నట్టు అలికిడి కలిగి చూస్తాడు. వెనుక నుండి ఓ 70 ఏళ్ల ముసలయ్య మాసిన గడ్డం, జడలు కట్టిన జుట్టు, చిన్న లంగోటి, పెద్ద కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి గోవిందు ముందు ఆగుతాడు. "యో! యారు పా నీ ?". యారా... నేనో రైటర్ ని తాతా. "తాతా వా, ఓహ్ తెలుంగా". ఆ. "ఈ నేరంలో ఇక్కడ ఏమి పుడుస్తున్నావు ?" ఏమి పూడవట్లేదు, తియ్యట్లేదు. కొత్త స్టొరీ స్టార్ట్ చేసాను, లాస్ట్ స్టొరీ ఇక్కడే రాసాను బావోచ్చింది. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది, అందుకే మళ్ళీ వచ్చాను. "నచ్చిందా... ఇది ఏమి ప్లేస్ అనుకుంటున్నావు ?". చల్లటి గాలి, స్వచ్చమైన నీరున్న సరస్సు, చుట్టూ చెట్లు ఇంతమంచి టూరిస్ట్ ప్లేస్ ని ఎందుకు డెవలప్ చేయలేదు మీ గవర్నమెంట్. "పా... ఇదు నీ అనుకున్న మాదిరి ప్లేస్ ఇల్లా". ఏ మాదిరి ప్లేస్ ? "బయట కమాన్ చూడలేదా ?" లేదు. "ఎంగూడ వా..." అంటూ కమాన్ దగ్గరికి లాక్కోస్తాడు ఆ ముసలయ్య గోవింద్ ని. చాలా పాతబడి, బీటలు వారి ఉన్న కమాను మీద తమిళ్ లో ఎదో రాసుంటుంది. తాతా ఏముంది అక్కడా అని అడిగేలా సైగ చేస్తాడు గోవిందు. అదా

"ஹரிஷ்சந்திர வேத்ஹிக".

కథ సమాప్తం :)