Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP04)

Updated on
Chai Bisket’s Story Series – గోవిందరాజులు (EP04)
జరిగిన కథ – రాధే గోవింద, GREP01, GREP02, GREP03 నా ఎదురుగా వచ్చిన అగోరా చూడడానికి వారణాసి వాసిలా ఉన్నాడు, ఒంటి మీద కౌపీనం తప్ప మరేం లేదు, కౌపీనాన్ని కప్పిపుచ్చుతూ ఒళ్ళంతా కప్పేసిన విభూది, ఊడలుగా ఊగుతున్న ముడేయని జడలు, నుదుటుని కుంకుమ కన్నా ఎర్రగా నిప్పుల కాంతిలో మెరుస్తున్న కనులు, చేతి వేళ్ళను మించి ఉన్న గోళ్ళు, తాయత్తుల మధ్యలో కనిపించని మెడ, కంకణాల కలయికలో మాయమైన మణికట్టు, చూడడానికి సమాధిలో నుండి లేచివచ్చిన శవంలా ఉన్నాడు. అసలు నాదగ్గరకు ఎందుకు వచ్చాడు ? ఏదో "ఫిర్ ఆయేగా... కల్ ఫిర్ ఆయేగా!" అని చెప్పి అదృశ్యమయ్యాడు. అసలదేం భాష? దాని అర్థమేమిటి ? అందరికి కనిపించలేదా ? నాకొక్కడికే కనిపించాడా ? పొగలో అతను కనపడకపోయుండొచ్చు మిగిలినవారికి. అసలు అగోరా ఉన్నాడా ? లేడా ? అనే సంశయం కంటే అతనేం చెప్పాడనే కుతూహలం పెరిగిపోయింది నా లోపల. ఎవర్ని అడగాలి, అర్ధం చెప్పేదెవరు అంటూ ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టేశాయి. ఎక్కడున్నానో కూడా పట్టించుకోవడం లేదు. ఆ సమయంలో ఎవరో కదిలించినట్టు అనిపించింది, నేను వైద్యశాల లో ఉన్నాను. స్మశానం నుండి వైద్యశాల వరకు దాదాపు తొమ్మిది మైళ్ళు ఎలా వచ్చానో తెలీదు. "గోవిందా, అమ్మ నిన్ను పిలుస్తుంది " అంటూ తాతగారు తట్టిలేపిన తర్వాత కానీ ఈ లోకంలోకి రాలేదు. ఈ లోకంలోకి రాగానే "ఫిర్ ఆయేగా... కల్ ఫిర్ ఆయేగా!" అంటూ పెద్దగా పలికి, దీని అర్ధం ఏమిటండి అని అడిగాను తాతగారిని. ఆయన ఏమైంది వీడికి అన్నట్టు చూసారు, మరోసారి అడిగాను. ఆ పక్కగా వెళ్తున్న ఓ సిక్కు పెద్దాయన, "మళ్ళీ వస్తావ్ ... రేపు మళ్ళీ వస్తావ్!" అని అనుకుంటూ నా వైపు చూస్తూ వెళ్తున్నాడు. మళ్ళీ వస్తావ్ ... రేపు మళ్ళీ వస్తావ్! ఇదే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది నా లోపల. మళ్ళీనా ? ఎక్కడికి ? స్మశానంలో ఉన్నప్పుడు అన్నాడంటే, మళ్ళీ స్మశానానికి వెళ్ళాలా ? ఎందుకు ? మళ్ళీ ఎందుకు వెళ్తాను. ఎవరికి ఏమవుతుంది ? ఇలా ప్రశ్నల్లో కొట్టుకుపోతూ...అమ్మ తలకు దెబ్బ తగిలింది, తను వైద్యశాలలో చికిత్స పొందుతుంది, నేను వైద్యశాలలో ఉన్నాను అనే విషయం మర్చిపోయాను. నా మనసులో ఇదంతా జరుగుతున్నా, నోటిలో నుండి "ఫిర్ ఆయేగా... కల్ ఫిర్ ఆయేగా!" పదం పలుకుతూనే ఉన్నాను, తాతగారు నన్ను ఏమైందిరా అని అడుగుతూనే ఉన్నారు. తాతగారికి నా గురించి భయమేసి, ఏదైనా గాలి ఆవహించిందేమో అని సందేహంలో చెప్పు తీసుకొని, చెంప పగలకొట్టారు. ఆ దెబ్బతో మనః అంతరాలలోనుండి ఒక్కసారిగా బయటకు వచ్చి పడ్డాను. అమ్మకెలా ఉంది ? అని అడగ్గానే, "నిన్నే కలవరిస్తుంది రా, పదా" అంటూ నన్ను లాక్కొని గదిలోకి తీసుకొచ్చారు తాతగారు. బంగారు పట్టీలతో, పట్టు వస్త్రాలతో, పసిపాపలాంటి నవ్వుతో, పండుగలా తిరిగే అమ్మను అలా ఆ గదిలో చూడగానే ఏడ్చేసాను. వైద్యులు ఏడవకూడదని, అమ్మకు ఏమి అవ్వదని, కొన్ని రోజుల్లో మామూలుగా మారిపోతుందని చెప్పినా నాకు శోకం ఆగడంలేదు. అమ్మ చూడకుండా కన్నీళ్లను ఆపేసాను, వెళ్లి తన పక్కన కూర్చున్నాను. నన్ను చూడగానే అమ్మ కళ్ళలో ఓ మెరుపు, పెదాలపై చిరునవ్వు, దేహంలో కదలిక కలిగింది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, వైద్యుడు తనని కూర్చోపెట్టారు. రాధమ్మ చేతిని నా చేతిలో ఉంచి “గోవిందా…బావంటే బాధ్యత తీసుకునేవాడు, బాధ పెట్టనివాడు, భరోసా ఇచ్చేవాడు, భయం పోగొట్టేవాడు, భద్రంగా చూసుకునేవాడు. నువ్వు రాధకు బావవి తనని బరువు అనుకోకు ఎప్పటికీ.” అంటూ చివరి శ్వాస విడిచింది. అప్పుడు, ఆ సమయంలో నా కన్నుల్లో కటిక చీకటి కమ్ముకుపోయింది, ఆ చీకటిలో వెలుగుతున్న దీపంలా తిరిగి ఆ ఆగోరా కనిపించి "వాళ్ళు వెళ్లాల్సిన సమయం, వెళ్తున్నారు. అందరూ వెళ్తారు, నువ్వు నేను అంతా. నువ్వు చేయాల్సిందంతా చేస్తూ వెళ్లడమే. వెళ్ళు." అని చెప్తూ ఆ చీకటిలో చెరిగిపోయాడు. తిరిగి మామూలు స్థితికి వచ్చేసరికి, మళ్ళీ స్మశానంలో ఉన్నాను. తలంతా ఖాళీగా, గుండెంత బరువుగా, కనుల నిండుగా నీళ్లతో అమ్మని చివరిసారి చూసి, అమ్మ గుర్తుగా తన ముక్కుపుడకను చెవి దిద్దుగా పెట్టుకుని, తను కోరినట్టుగా రాధమ్మను చూసుకుంటానని మనసులోనే ప్రమాణం చేసి, అక్కడే పడుకుండిపోయాను. అమ్మ చనిపోయిన వారం తర్వాత, అమ్మ పుట్టినరోజు నాడు లక్ష్మి పండంటి మగ దూడకు జన్మనిచ్చింది. దాన్ని చేతిలోకి తీసుకోగానే అమ్మ వాళ్ళు ఉంటె అనే తలపులో...ఆ రోజు కోవెలకు బయలుదేరే ముందు లక్ష్మి ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో, కోవెల నుండి బయలుదేరేముందు మబ్బులు పట్టడం, ఈతకోసం వెళ్ళినప్పుడు ఏదో చెడు జరగబోతున్న సంకేతాలు అన్నీ కళ్ళముందు మెదిలాయి. అంటే ప్రకృతి మనల్ని ముందుగానే హెచ్చరిస్తుందన్నమాట, మనమే వాటిని పట్టించుకోము. ఇకపై ప్రతీ శకునాన్ని పట్టించుకోని కదలాలి అని నిశ్చయించుకున్నాను. తాతగారు కొత్తగా వచ్చిన దూడకు పేరేమి పెడదాం అని అడగ్గానే "రంగ" అని వచ్చేసింది నా నోటి నుండి. మంచిపేరు అంటూ రంగా, రంగా అంటూ దాన్ని పిలవడం మొదలెట్టారు అందరూ. ఆ తర్వాత చాలా కాలం అమ్మగురించే ఆలోచిస్తూ, స్మశానంలోనే చాలా సమయం గడిపేవాడిని రంగని పక్కనే ఉంచుకొని. అప్పుడప్పుడు అమ్మ,నాన్న నాతో మాట్లాడుతున్నట్టు, నాకు దారి చూపిస్తున్నట్టు, నాతోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. నేను వాళ్ళతో ఏమి చెప్పాలనుకున్నా, రంగ గాడ్ని వాళ్ళ ప్రతినిధిగా అనుకోని వాడితో మాట్లాడేవాడిని. ఆ క్షణంలో అనిపించింది అందరూ జీవితం అని ఎదో ఉందని, ఏదో చేయాలని, ఎంతో ఎదగాలని ఏవేవో ఊహలతో పరిగెడుతుంటారు కానీ, నిజానికి గడిచిపోయిన క్షణాలతో, కదిలిపోయే జ్ఞాపకమే కదా జీవితం అంటే. నాన్నగారు కాలం చేసిన తర్వాత తాతగారికి, అంజయ్య మామ కుడి భుజంలా నిలబడ్డాడు. మా మీద ఆధారపడి బ్రతుకుతున్న వారికి, మా సాయం కోసం వచ్చినవారికి లేదనకుండా కోరినది చేసి పంపించేవారు. కాలం కట్టు తెగిన చెరువు కంటే వేగంగా కదిలిపోయింది, తాత గారికి వయసయిపోతుంది అంటే మాకు వయసొస్తుంది. అన్నీ ఆయనే చూసుకోవడం కష్టంగా మారింది. పద్దెనిమిదేళ్ల కుర్రాడి భుజాలు అంతమంది ఆశల బరువుని, కష్టాల కన్నీటిని మోయలేవేమోనని సందేహపడుతున్నారు తాత. సాయం కోసం వచ్చిన వారికి న్యాయం చేసేంత పెద్దవాడిని కాలేదేమో అని భయం ఆయనకు. అప్పటికీ అడపాదడపా నాకు తోచిన విధంగా, నాకు చేతనైనంత వరకు ఏదోటి చేస్తూ అందరికి దగ్గరవుతున్నాను. ఆ రోజు వరకు ఆయనకు నా మీద ఉన్న సందేహాలకు పూర్తి నివృత్తి కలిగింది ఆ ఒక్క సంఘటనతో. రెండు సంవత్సరాల కరువు తర్వాత ఆ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. ఎండిపోయిన చెరువులు, కుంటలు, సరస్సులు నిండిపోయేంతగా. పెద్ద చెరువుకు, రాళ్ల చెరువుకు సమీపంలో మధ్యగా ఉన్న హరిజన వాడలో దాదాపు ఇరవై కుటుంబాల వరకు తలదాచుకునేవి. పొద్దుపోయే ముందు ఓ మోస్తరు వర్షం మొదలైంది. అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటి తర్వాత రెండు చెరువుల గట్లు ఇంచుమించుగా ఒకేసారి తెగిపోవడంతో హరిజన వాడంతా నీటిలో మునిగిపోతుంది. సమాచారం అంది, మేము వెళ్ళేప్పటికీ పరిస్థితి చేయిజారిపోయే స్థాయిలోఉంది. తాతగారు, అంజయ్య మామ, ఇంకొంత మంది పని వాళ్లతో కలిసి చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. ఓ పక్క చెరువుల్లో నుండి నీళ్లు, మరోపక్క పైనుండి కుండపోతగా వర్షం, కారుచీకటి, అమావాస్య, నీళ్ల చప్పుడు, సాయంకోసం చేసే అరుపులు, అంతా కోల్పోయాం అన్న రోదనలు, ఒకరికోసం ఒకరు ముందుకురావడం ఇవన్నీ మొదటిసారి చూస్తున్న నాకు మొదటిసారి భయమేసింది. ఇదే పరిస్థితిలో రాధమ్మ ఉంటె అనే తలపు వెన్నులో వణుకు పుట్టించింది. నాకు రాధమ్మలా, ప్రతీ ఒక్కరికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, అందుకే ఎవ్వరికి ఎవ్వరిని కోల్పోనివ్వకూడదు అని నిశ్చయించుకున్నాను. అంజయ్య మామ, మిగిలిన వాళ్ళు అందరు తలో పనిలో మునిగిఉన్నారు. తాతగారు, నేను అందరిని చూస్తూ అందరిని కాపాడాం అనుకుంటూ ఉండగా...నా ఇద్దరు పిల్లలు కనిపించడం లేదయ్యా అంటూ ఓ తల్లి రోదిస్తూ నా కాళ్ళ మీద పడి మీరు తప్ప నాకింకెవరు లేరయ్యా, కాపాడండి అని బ్రతిమాలుతుంది. తాత గారు వెతికిస్తాను తల్లి, నువ్వు నిశ్చింతగా ఉండు అని ఆమెని తీసుకెళ్లి వస్త్రాలు మార్చుకొమ్మని చెప్పారు. నేను వెళ్తానండి వాళ్ళను వెతకడానికి అని తాతగారిని అడిగాను. "వద్దు, అంజిగాడు చూసుకుంటాడు లే. నువ్ అందరికి పొడి వస్త్రాలు అందాయో లేవో చూడు. రేయ్! అంజి... అందరూ వచ్చినట్టేగా" అని అడగ్గానే దూరంగా ఉన్న అంజయ్య మామ "దాదాపు అందరూ వచ్చినట్టే అయ్యా! నీటి ఎద్దడి పెరిగింది, ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమి లేదు, పొద్దున చూడడమే." అని అంజయ్య మామ గట్టిగ అరిచాడు. "సరే... అందరికి దుప్పట్లు అవి పంచండి. ఈ పొద్దు గడిస్తే రేపు అంత సరైపోతుంది. ఎవరికైనా గాయాలయ్యాయేమో చూడండి. " అంటూ... "నువ్వేంట్రా, ఇంకా ఇక్కడే ఉన్నావ్. వెళ్ళు, వెళ్లి పని చూడు." అని నాకు చెప్పారు. లేదండి. వెళ్తాను. "ఎక్కడికి ?" ఆ పిల్లల్ని వెతకడానికి. "మతి చెలించిందా? వినలేదా, అంజిగాడే కుదరదని చెప్పాడు. ఇప్పుడు కుదరదు. నేను చెప్పింది చేయి పో". క్షమించండి తాత గారు, మొదటి సారి మీ మాట దాటుతున్నాను. "గోవిందా... పరిస్థితిని బట్టి సాయం చేయడం తప్పు కాదు. కన్నీళ్లు కనపడగానే వెళ్లిపోకూడదు. నాకు తెలీదా...పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళు లోపలకి". మీకు కన్నీళ్లు మాత్రమే కనపడుతున్నాయండి, నాకు వాటి వెనుక ఆ తల్లి పడుతున్న నరకం కనపడుతుంది. మన్నించండి. "గోవిందా... గోవిందా..." నా వెనుక ఎవర్ని పంపకండి, నేను వాళ్ళను తీసుకొనే వస్తాను. "గోవిందా...". ఆ నీట మునిగిన హరిజన వాడ అంతా చూసాను ఈదుకుంటూ. ఎక్కడా ఎవరు కనిపించలేదు. వేరే వైపు వెతుకుదాం అని వెళ్లేప్పుడు, ఓ పెద్ద వేప దుంగ ఎదురుగవచ్చింది, దాని పైన స్పృహ తప్పి, ఆ దుంగను గట్టిగా పట్టుకొని ఉన్నారు ఇద్దరు కుర్రాళ్ళు. వాళ్ళను చూడగానే నాకు ఆనందంతో కన్నీరొచ్చింది. ఆ దుంగను అలానే సురక్షిత ప్రదేశం వైపు తీసుకొచ్చి, వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. వైద్యుడు వాళ్ళని పరీక్షించి ప్రమాదం ఏమి లేదని నిర్ధారించిన తర్వాత, ఆ తల్లికి బిడ్డలను అప్పగించాను. ఆ క్షణం ఆమె చూసిన చూపును మాటల్లో వర్ణించలేము. తాత గారు ఆ తర్వాత కొద్దిగా కోప్పడినా, ఊరంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాత నుండి చాలా విషయాలు తాతగారి వరకు తీసుకెళ్లకుండా నేనే పరిష్కరించడం మొదలెట్టాను. రాధమ్మ చూస్తుండగానే పెద్దగా అయిపోతుంది. కాలం ఎలా గడిచిందో తెలీదు, ఇరవై మూడేళ్లు వచ్చేసాయి. మధ్య మధ్యలో తాతగారు రాధమ్మతో పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు కానీ, ఎందుకో నాకు పద్దెనిమిదేళ్లు నిండకుండా పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. చెప్పేసాను ఆయనకు, రాధమ్మకు పద్దెనిమిది నిండిన తర్వాత, ఆమెకు నా పైన ఇష్టం ఉంటె చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని. రంగడు కూడా పెద్దయ్యాడు, నా చేతుల్లో తీసుకున్న చిన్న రంగడు ఇప్పుడు నా కంటే పెద్దగా ఉన్నాడు. అంతా బావుంది కానీ, ఊర్లోనే ఓ వింత సమస్య వచ్చిపడింది. ఊర్లో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఉన్న సాధారణ వైద్యుడు సరిపోవడం లేదు. రోజుకో కొత్త సమస్య పుట్టుకొస్తుంది. ఉన్న వైద్యులుగారు ఆయన వళ్ళ కాదని, మన ఊరిలోనే ఉండే ఆయుర్వేద వైద్యుడు ఉంటె మంచిదని, త్వరగా తీసుకొస్తే అందరికి మంచిదని చెప్పాడు. చాలా కాలం, చాలా ప్రాంతాలు, చాలా మందిని పంపించాను, ఆయుర్వేద వైద్యుడిని తీసుకురమ్మని. చివరకు 200 మైళ్ళ దూరంలో ప్రసిద్ధి చెందిన ప్రకృతి చికిత్సాలయంలో పేరుపొందిన ప్రధాన వైద్యుని దగ్గర శిక్షణ పొందుతున్న ఓ కుర్రాడు ఉన్నాడని, అతను మాకు సరిపోతాడని అనిపించి అతని కోసం నేనే ఆ ఊరు బయలుదేరాను. ప్రతీ రోజు బయటకు వెళ్లే ముందు గుమ్మం ఎదురుగ వచ్చే రాధమ్మ, గేటు ఎదురుగ వచ్చే రంగడు ఇద్దరు ఈ రోజు ఎదురు రాలేదు. జట్కా ఎక్కి కూర్చొగానే రయ్యిన కదిలే రాముడు కదలకుండా మారం చేశాడు చాలాసేపు. చాలా కాలం తర్వాత తప్పించుకోలేని కీడు జరగబోతున్నట్టు మనసులో స్ఫురించింది. ఎందుకో వీటన్నిటి కంటే ముందు ఊరిలో జనాలు ఆరోగ్యంగా ఉండాలి, దానికోసం ఆయుర్వేద వైద్యుడు ఊరిలో ఉండాలి అని రెండోసారి ప్రకృతి సంకేతాలు పట్టించుకోకుండా బయలుదేరాను. మిగిలిన కథ తర్వాతి భాగంలో... 16 10 2016