గాలి అద్దం ఎవరికిపడితే వారికి అందదు, మనం కాస్త ఎత్తులో ఉండాలి, ఎవరినిపడితే వారిలోకి సులభంగా ప్రవేశించదు, ఆహ్వానించే శక్తి ఉండాలి. గాలి అద్దం తన పాఠకులను తానే ఎన్నుకుంటుంది. వారికి ఎలాంటి అర్హతలు ఉండాలంటే.. ఓపెన్ మైండ్ తో ఆలోచించగలగాలి, కాస్త జీవితాన్ని చూసి ఉండాలి, బాధను దుఃఖాన్ని అనుభవించి ఉండాలి, రోజులో కాస్త ఒంటరిగా గడుపుతూ ఏవో ఆలోచిస్తూ ఉండగలగాలి, ఓపిక కూడా ఉండాలి. ఎంఎస్ నాయుడు గారు రాసిన ఈ గాలి అద్దం పుస్తకము మనసుని ఒకేసారి నిశ్శబ్దం చేసి కొత్త ఆలోచనలను పుట్టించగలదు.
1. అద్దం - కిటికీ మనమిద్దరం తొంగి చూసేవాళ్ళమే దేనిని చూశామో గుర్తుంచుకోలేము దేనిని చూడాలో ఎప్పటికీ తెలియదు మనమిద్దరం ఎదురుచూసేది దేనికోసం.?
2. ఎవరికైనా ఒక ప్రదేశం నుంచి ఒక దేహం నుంచి ఒక పదం నుంచి ప్రయాణించడం యెంత ఆసక్తికరం ఒక నిశ్శబ్ద ఆహ్వానం నుంచి వైదొలగటమూ సమీపించటమూ నిర్ధేహ దృష్టితో అంతమొందటమూ ఆనంద విఫలమే. ఓ చిన్న రాత్రి చాలు వేల జ్ఞాపకాలు ఒక్క వాక్యమౌటానికి ఆకాశం ఆగిపోతే రాత్రి పాదాలు ఇక ఎక్కడ కలుసుకోలేని కలలు ఇక ఎవరి భూమిలోనో.. ఏ తోడూ ఉండని నాలుకకి ఎవరు స్నేహితులు ఎవరు హంతకులు ఎవరు మాంత్రికులు.? స్తబ్ధశబ్దశ్మశాన స్థలస్తనశోధన ఎవరికైనా.
3. జీవితం కొనలేనివి ఎన్నున్నా ఆమె అడిగింది కొన్ని పూలనే అవి ఎక్కడుంటాయో అసలు దొరుకుతాయో లేదో ఈ క్షణంలో పూలవాసన గుర్తుకు రావట్లేదు కాలశిల్పం దగ్గర లభించేది ఏది లేదు. ఇక చివరి చీకటి అంచులపై ప్రయాణించాలి ఆత్రుత లేదు ఆదుర్దా అంతకన్నా లేదు పూల అవసరం దేనికి, ఆనంద బంధనాలకా దుఃఖ నిర్బంధనాలకా ఆవేదనల విముక్తికా కడసారి కన్నీళ్ళకా ఎందుకైతేనేం కొన్ని పూలున్న చోటికి వెళ్ళాలి.
4. బుడగ గాలే నా శత్రువు పగలున్నంతసేపే ఈ విర్రవీగుడు ఆకర్షించే అవలక్షణాలే నా ఉనికి నాకు నేనే మురుసిపోయి మిడిసిపాటుతో ఎగురుతుంటాను అనేక కిరీటాల్ని తొడుక్కుని ఊరేగుతుంటాను అర్ధంపర్థం లేని కొయ్యబద్దే అడ్డొస్తోంది నా సుఖాలకి ఇకనైనా తగలెట్టాలి నా బుద్ధినీ.
5. చనిపోయే క్షణాల్లోకి ప్రతి దీవెన ఓ శాపం ప్రతి దుఃఖం ఓ దీవెన ఏది ఎప్పుడు కరుణిస్తుందో నిర్ణయించే క్షమాపణలు దయతో మిగిలే గాయాలు అంగీకరించని అంగీకారాలే సెలవు చెప్పే నీడలు ఆహ్వానించుకుంటాను నన్ను నేను పరిణితిలేని ఛాయాల్లోకి కఠినమైన కృతజ్ఞతలు ప్రాణంలేని వీడ్కోలు మరోసారి చనిపోయే క్షణాల్లోకి ఒంటరిగా నడుద్దాం.
6. అదృష్టం పూలలోని సోమరి పువ్వొకటి సముద్రస్నానానికి సిద్ధమైంది అలలన్నీ రమ్ కమ్ అంటున్నా కాలిరేకును కూడా కదపలేని పువ్వు తీరానికి కోపమొచ్చి పూలనేలను నీళ్ల లోపలికి తోసింది సముద్రం సిగ్గుపడ్తోంది అలల్తో సోమరి అలొకటి పువ్వుతో లేచిపోయింది.
7. నహి.. నహి ఇక్కడెవరో నిద్రించి వారి కలల్ని మోసుకెళ్లారు సాక్ష్యం చెప్పమని చెట్టుని అడక్కండి ఇక్కడెవరో ప్రయాణించి వారి ఆనందాల్ని మరిచారు సాక్ష్యం చెప్పమని నేలను ప్రాధేయపడకండి ఇక్కడెవరో మతిచలించి వారి కన్నీళ్లను మిగిల్చారు సాక్ష్యం చెప్పమని దుఃఖాన్ని నిలదీయకండి ఇక్కడెవరో స్థలకాలాల్ని నిర్బంధించారు విముక్తి కోసం కొత్త ప్రశ్నల్ని నాటకండి ఇక్కడెవడో చిట్లిన వాక్యం చివర్న అక్షరం ఎక్కడైనా ఎప్పుడైనా ప్రారంభమౌతుందా.?
8. హంతకులు చూసింది ఏదీ నిలవట్లేదు నేత్రాలు హంతకులు వినింది ఏదీ ఉండట్లేదు చెవులు గాడిదలు చదువుతున్నది ఏదీ ఎక్కట్లేదు నాలుక ఓ పందికొక్కు చేతులతో అలల్ని తాకాను వాటి చేతులు నల్లగా పిలిచాయి ఇష్టంలేని చోటునుంచి బయలుదేరాలి జ్ఞాపకాల్ని ఆత్మహత్య చేసి.
9. ప్రియుడా కన్ను మొదలయ్యే స్థలం నీ దగ్గరుంటే చెప్పు అద్దం ఆక్రమించే నేత్రం నీలో ఉంటే ఎవరికీ చూపకు శ్మశానంకి సాయంత్రమైంది వాన సమయం ఎవరికో నిప్పు ఉప్పటి గాలి తేనెలేని ఎముకలు మనసులోని చర్మానికి పాడు బురద పదం మొదలు నరికేస్తే నాలుక ఇక పెరగదా ప్రియుడా నీ రాత్రికి విరామసంకేతాలు ఎన్ని.?
10. ఇల్లు ఇల్లు పెద్దదవ్వదు పిల్లలే మరీ పెద్దయ్యారు రాగలిగిన వాళ్ళు వచ్చెళ్లారు కాలం పేరుకుపోయింది కళ్ళ పెంకులపై ఇల్లొక శవపేటిక.
11. తిరిగే చేతుల్లో కొన్ని చీమల చేతుల కింద తిరుగుతున్నా వాటి నిద్రని తాకాలని నా తలకాయలో వాటి ప్రియురాళ్ల ముఖాల్ని తుడిచేశాను నిద్రలోకి పాకి నా ప్రియురాళ్ల ముఖాల్ని అవి తినేశాయి కొన్ని కలలు చీమల చేతుల్లో ఉంటాయి మరికొన్ని తలలు కలల చేతుల్లో చితుకుతాయి తిరిగే చేతుల్లో వంకర్లో కొంకర్లో పోయే కలలే మిగిలుతాయి.
12. ఇంకెంతసేపో అంతరంగంలో నన్నెప్పుడూ ఉండనివ్వను పట్టేంత ఖాళీ ఉంటే నన్ను నన్నుగా ఇరికించే వాణ్ణి పరాయినై నేరేడు రంగుల్లాంటి కొత్త ఊహలకి సీతాఫలాల్లాంటి గతించిన బాధలకి చలించని వృద్ధ వృక్షాన్నయ్యాను చరించని పుష్పాలేవో వాహనాలై తరించని త్రికాల బిందువుకై తిరుగుతున్నాయి రేపటి రోజులో నలుదిక్కులూ పర్యటించిన ముఖంలో ఏ చిరుగుల రాత్రీ లేదు నిన్న శేషించిన పగలు ఇంకెంతసేపో మానసిక వ్యాకరణంతో వాఖ్యానంతా బంధించాలి.
13. ఖాళీ వాసన ఆకుపచ్చటి ఆకాశాన్ని మోసుకెళ్లే మధ్యాన్నపు నత్తి అలలు. తలుపు గాలిలో. మాట్లాడే నిశ్శబ్దం. దేహానికీ, అక్షరానికీ సంబంధంలేని శ్వాసని వింటున్నాను నోటితో అక్కడ వొదిలి వచ్చిన కాలం ఎవరికి దొరికిందో. పదాల దుంపల స్పర్శలో ఖాళీ వాసన. చీకటి తింటున్న వర్షం. వానపము ముద్దు నవ్వు. పువ్వులు తిరుగుతున్నాయి. గాడిదల్ని ఎక్కి. రోత సుఖం కన్నీళ్ళల్లో. పుల్లటి కలలు. గడ్డిలో. ఇంట్లోకి సముద్రాన్ని వెంట తెచ్చుకున్నాను. చంద్రుడి గుర్రాలు నక్షత్రాల్ని మింగి నీళ్లు తాగటానికి సూర్యుడి దగ్గరకెళ్ళాయి.
14. నకిలీ నవ్వు పువ్వులపై కొండనీడ, నీ జ్ఞాపకం. సూర్యుడా నీ దువ్వెన ఎవరి జేబులో నీ దూది కళ్లపై ఎన్నో కలలు ఎండాకాలం వానలో నీ జుట్టు చెరిగిపోదా సీతాకోక. అక్షరాలకీ మృత్యువుకీ దూరం తెలిసేది కాయితపు కంటిలోనేనా ఏదైనా సత్యం ఉండుంటే విధ్వంసం అందులో ఉండును. నీడా నీ ఇల్లెక్కడా, ముడతలు పడ్డ కనుపాప నీ ప్రేమ దైవమెక్కడ. ఓ మనసా ముళ్లపందీ నీ మాంసం రుచిగా ఉండునా
15. అవ్యక్తం ఎంత రాసినా పెన్సిల్ ములుకు ఒక్క వాక్యం కూడా పూర్తిచెయ్యదు. అంతరంగం దుఃఖంలో పరిచయం కాదు నూకలు తిన్న సూర్యుడు ఎక్కడ ఆడుతున్నాడో ఏ మైదానంలోంచో దారితప్పి ఒచ్చిందోక సాయంత్రం పెన్సిల్ గీతల్తో ఒక అద్దాన్ని తయారుచేశాను నా ముఖాన్ని తుడిచేశాను.