Youth for anti corruption అనే NGOకు దాదాపు 50,000 పైగా వాలంటీర్లు ఉన్నారు. పరిస్థితులను వివిధ రకాలైన కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు కోవిడ్19 వ్యాధి పై అవగాహన కల్పించడానికి హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకరోజు 75 సంవత్సరాల వృద్ధురాలికి తను ప్రతిరోజు వేసుకునే మాత్రలు కొనాల్సివచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేరు, తాను ఈ వయసులో బయటకు వస్తే కనుక వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఓ వాలంటీర్ తనే మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకువచ్చి ఇచ్చాడు. ఆ క్షణంలో ఆ బామ్మ చూపిన కృతజ్ఞత, ప్రేమ వర్ణించలేనివి. ఇలాంటి పరిస్థితులు ఒక్కచోట అనే కాదు చాలా కాలనీల నుండి ఎదురవడంతో ఈ NGO మెడిసిన్ ను ఉచితంగా డెలివరీ చేస్తున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో వీరికి ప్రతిరోజు 400 నుండి 500 కాల్స్ వస్తుంటాయి. కావాల్సిన మందుల ప్రెస్క్రిప్షన్ ఫోటో తీసి వాట్సాప్ చేసినా, లేదంటే కాల్ లో వివరిస్తే వీరు దగ్గరలో ఉన్న వాలంటీర్ కు కాల్ చేస్తారు. వాలంటీర్ మందుల షాప్ కు వెళ్లి కొని, మందులకు ఐన ఖర్చులను మాత్రమే తీసుకుని ఉచితంగా డెలివరీ చేస్తుంటారు. పెట్రోల్ మరియు ఇతర ఖర్చులు వాలంటీర్ మాత్రమే భరిస్తారు. వికలాంగులకు, పేదవారికి మాత్రం మందులకు సంబంధించిన డబ్బులు కూడా తీసుకోకుండా ఉచితంగా అందిస్తారు.
వైరస్ ప్రమాదం పెద్దవారికి, పది సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువ. వృద్ధులలో ఎక్కువశాతం దీర్ఘకాలిక వ్యాధులకు బాధపడుతూ ఉంటారు, వ్వారు ఖచ్చితంగా ప్రతిరోజు మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ వీరు మాత్రల కోసం బయటకు వస్తే కనుక వైరస్ అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ. అందుకే మందులను ఉచితంగా డెలివరీ చెయ్యాలని NGO నిర్ణయించుకున్నారు, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న సేవ. ప్రస్తుతం మన ఇండియాలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నా ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఇంట్లో ఉంటేనే మనల్ని కానీ మన కుటుంబాన్ని కానీ కాపాడుకునేవాళ్ళమవుతాము. ప్రాణాలకు లెక్కచేయకుండా, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ NGO చేస్తున్న సేవ డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవకు సమానమైనది.
Youth for anti corruption సంస్థను ను రాజేందర్ గారు ప్రారంభించారు. రాజేందర్ గారు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. MA పూర్తిచేసి ఇంతకు మునుపు జర్నలిస్ట్ గా పనిచేశారు, ఆ తర్వాత సివిల్స్ పరీక్షలు రాశారు కానీ అధికారమే ప్రజాసేవకు అర్హత అని భావించకుండా స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజంలో ఎన్నో మంచి మార్పులకు కారణమయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారిలో లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసే వారికి సన్మానం చెయ్యడం దగ్గర నుండి చదువులకు సహాయం చెయ్యడం, న్యాయం కోసం ఎదురుచూసే పేదవారికి అండగా నిలబడడం, RTA యాక్ట్ ద్వారా ఎన్నో అక్రమాలను వెలికితియ్యడం కూడా చేస్తుంటారు. వీరికి కొంతమంది ఐఏఎస్ లు అన్నిరకాల సలహాలు సూచనలు అందిస్తుంటారు. వీరి కోర్ టీం వాసిరెడ్డి గిరిధర్, జగత్ సూరి, కొన్నె దేవేందర్, కొమటి రమేశ్ బాబు, మారియా అంతోని, ప్రదీప్ రెడ్డి, హరిప్రకాశ్, మంత్రి భాస్కర్, దేవిరెడ్డి స్వప్నారెడ్డి, జి. జయరాం మొదలైనవారు.
ఉచితంగా మందులు డెలివరీ చేసే ఈ సేవ ప్రస్తుతం తెలంగాణ ఆంద్రప్రదేశ్ లోని సాధ్యమైనంత వరకు అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు కూడా ఈ డెలివరీ కొనసాగుతుంది. ఈ సర్వీస్ ను మీరు వినియోగించుకోవాలంటే కనుక కాల్ చెయ్యవలసిన నెంబర్లు 9491114616, 8143304148, 7799553385, 9000042143.