ఈ ప్రపంచంలో ఎంత కష్టపడినా ఫలితం అంతంతమాత్రంగా, ఒక్కోసారి ఆ మాత్రం ఆదాయం కూడా రాని పని వ్యవసాయం. నాటే విత్తనాల దగ్గరి నుండి, భూమి, ప్రకృతి, పెస్టిసైడ్స్, వాతావరణం, దళారి, ప్రభుత్వం వీరందరూ సహకరిస్తే తప్ప రైతుకు ఆశించిన ఆదాయం లభించదు. ఇవన్నీ సహాయం అందించక పోవడంతో చేసిన అప్పులు తీర్చలేక పశ్చిమగోదావరి జిల్లా శివాపురంకు చెందిన రైతు వెంకటేశ్వర రావు గారు తనని తాను చంపుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నవారు నరకానికి వెళతారనంటారు అది నిజమో కాదో తెలియదు కాని వారిని ప్రేమిస్తున్నవారికి ఖచ్చితంగా నరకమే. రైతు వెంకటేశ్వర రావు గారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని భార్య వయసు 21 సంవత్సరాలు, ఇద్దరు పసి కూనలు. 9వతరగతి చదువుకున్న ఆ 21సంవత్సరాల శాంత కూమారి గారికి తన ముందు రెండు దారులు కనిపించాయి ఒకటి ప్రపంచం నుండి పారిపోవడం, రెండు చచ్చేంత ధైర్యం ఉంది చచ్చేంత వరకు పోరాడడం.. శాంతకుమారి గారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు.
శాంతకుమారి గారికి తొమ్మిదో తరగతి చదువుతుండగానే పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగి ఏడు సంవత్సరాలు గడిచాయి.. జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు మినహా అంతా సవ్యంగానే జరుగుతున్నాయనుకుంటున్న సమయంలోనే పంట నష్టం రావడం, అప్పులు తీర్చలేక భర్త చనిపోవడం, తన జీవితాన్ని ఊహకందని శక్తితో ఎవరో నాశనం చేశారని అర్ధమయ్యింది. ఒకపక్క భర్త కోసం రోదిస్తూ, ఇంకోపక్క చేసిన అప్పులను ఎలా తీర్చగలను అని మధనపడుతూ, మరోపక్క ఇద్దరు పిల్లలను ఎలా కాపాడుకోవాలి అనే అత్యంత విపత్కర పరిస్థితి మొదటిసారి తన జీవితంలోకి వచ్చింది. తను చదివిన చదువుకు ఎలాగూ మంచి జీతంతో ఉద్యోగం రాదు, అలా భర్తని ఏ వ్యవసాయం ఐతే పొట్టనపెట్టుకుందో అదే వ్యవసాయాన్ని మళ్ళి ప్రారంభించాలనుకున్నారు. మొదట్లో పెట్టుబడి కోసం అప్పుకై అభ్యర్ధించినా కాని ఎవ్వరూ తనని నమ్మలేదు. ఆ తర్వాత శాంతకుమారి గారి పట్టుదల కష్టించే మనస్తత్వాన్ని పరీశీలించి అప్పు ఇచ్చారు. మొదటిసారి ఐనా గాని ఏ అనుభవం లేకపోయినా విజన్ తో, ప్రణాళికతో విజయం సాధించారు.
జీవితం ఏది అంత సులభంగా ఇవ్వదు కదా.. మొదటి మూడు సంవత్సరాల పాటు ఆదాయం అంతంగా రాలేదు. ఇదే పద్దతితో విజయం రాలేదంటే మరో కొత్త పద్దతి ఉపయోగించాలని భావించారు. "బంతి పూల సాగు" మంచి ఆదాయం తీసుకువస్తుందని కొంత భూమిలో ప్రయోగాత్మకంగా చేశారు. పెట్టుబడి పోను 20,000 లాభం, తర్వాత మరింత పొలంలో సాగును విస్తరించారు ఈసారి 50,000 ఆదాయం గడించారు. ఈ ఆదాయాల విజయాలను నిరంతరం ఆర్జించాలని ఈసారి బంతితో పాటుగా మిరప, క్యాబేజి, ఆకుకూరలు, బీర, బెండా మొదలైన కూరగాయలను కూడా సాగుచేశారు, ఈసారి మాత్రం శాంతకుమారి గారి ఊహకందనంత ఆదాయం లభించింది. ఆ ఆదాయంతో భర్త చేసిన ఋణాలను, పెట్టుబడి కోసం చేసిన అప్పులను తీర్చివేశారు. ఏ పిల్లల భవిషత్తు కోసమైతో భయపడ్డారో ఇప్పుడు ఆ పిల్లలను ప్రయోజకులను చేసే యజ్ఞంలో నిమగ్నమయ్యారు. ఒక బాబు జమ్ము యూనివర్సిటీలో పి.జి (బయాలజీ), చేస్తుండగా మరోబాబు ఇంజనీరింగ్ చేస్తున్నారు.
వ్యవసాయ పద్దతులు: శాంతకుమారి గారి వ్యవసాయ పొలంలో నీటి వనరులు స్వల్పంగా ఉంటాయి. మొక్కలకు నీరు అనే ఆహారాన్ని అందించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కునేవారు. ఇందుకోసం ఒక నీటి తొట్టిని నిర్మించి ఆ నీటిని అమూల్యంగా ఉపయోగించుకునేవారు. అలాగే వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వాడకుండా పూర్తిగా సాంప్రదాయ ఎరువులు, పద్దతులతో మొక్కలకు ఆహారాన్ని ఇచ్చేవారు. ఇది మంచి సక్సెస్ అవడంతో ఎవరైతే తనకు వ్యవసాయం చేతకాదని విమర్శించిన వారు సైతం శాంతకూమరి గారిని అనుసరించారు.
ఓసారి ఆ ఊరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉపాధి హామి పధకాన్ని పరిశీలించడానికి వచ్చారు. పనిలో పనిగా శాంతకుమారి పొలంలోకి వచ్చారు. మంచి జీవంతో, ఆరోగ్యంగా ఉన్న పొలాన్ని చూసి దీనిని సాగుచేస్తున్న శాంతకుమారి గారి గురించి ఆరా తీశారు. భర్త చనిపోవడం దగ్గరి నుండి 14 సంవత్సరాల పాటు తాను సాగించిన పోరాటాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాగే ఉపాధి హామి పధకం ద్వారా ఇంతలా అభివృద్ధి చెందినందుకు ఉత్తమ రైతు అవార్డ్ తో అభినందించారు. దాంతోపాటు తన జీవితం, అనుభవం లేకపోయినా గాని అద్భుతమైన వ్యవసాయ పద్దతులతో చేస్తున్న వ్యవసాయాన్ని ఫోటలు తీసుకుని పై అధికారులకు అందించారు. అలా అట్టడుగు స్థాయి నుండి భారతదేశ ప్రధానిని కలిసేంత వరకు ఎదిగారు.. అన్నట్టు ఈరోజే(అక్టోబర్ 13) శారంపకుమారి గారు ప్రధానిని కలిసేది.