మన జన్మకు గల అర్ధాన్ని ఈ కాలం అడుగడుగునా మనకు చెబుతూనే ఉంటుంది. అప్పుడు తనుజ గారి వయసు పదకొండు. అప్పుడే జీవితాన్ని నడిపించే అనుభవాలు ఒక్కొక్కటిగా తనలో ముద్ర పడుతూ వస్తున్నాయి. తన బిడ్డ కడుపునిండా తినాలని అమ్మ ప్రేమతో ఇడ్లి వండి లంచ్ బాక్స్ లో పెట్టింది. స్కూల్ కు వెళ్లే మార్గం మధ్యలో ఒక వృద్ధుడు ఆకలితో బాధపడుతున్నాడు. తనుజ గారు మరో ఆలోచన లేకుండా లంచ్ బాక్స్ ఓపెన్ చేసి రెండు ఇడ్లీలలో ఒకటి ఆ వృద్ధుడికి ఇచ్చింది. 'వయసులో చాలా చిన్నదైనా సరే ఆ వృద్ధుడు రెండు చేతులెత్తి మొక్కి, ఇంకా మానవత్వం అనేది బ్రతికే ఉందనే ఈ ఉదాహరణకు అతని కళ్ళు నమ్మకంతో తడిచాయి.'
తనుజ గారికి ఆకలి విలువ ఆ వయసులోనే పరిపూర్ణంగా తెలిసింది. <em>ఆకలి బాధ్యతను నేర్పుతుంది, ఆకలి కొత్త స్కిల్స్ నేర్పుతుంది, ఆకలి పాజిటివ్ థింకింగ్ నేర్పుతుంది, ఆకలి గ్రాటిట్యూడ్ ను నేర్పుతుంది. ఆకలి అంటే ఏమిటో తెలిసినవారికి కూరలో ఉప్పు తక్కువయ్యింది, కారం ఎక్కువయ్యింది అనే కంప్లెయింట్స్ ఏమీ ఉండవు. పదకొండేళ్ల వయసుకు ఒక ఇడ్లీ ముక్క సహాయమైతే, జీవితంలో ఎదుగుతున్న కొద్దీ తన సహాయాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి.
బాధ్యతలకు కొలమానాలు లేవు: ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు ఫీజులు, దివ్యాంగులకొరకు కృత్రిమ అవయవాలు, ప్రతినెల పేదవారు నివసించే ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు, వస్త్రాల పంపిణీ, గ్రాసరి పంపిణీ, ప్లాసిక్ పై అవగాహన కార్యక్రమాలు, ఒంటరి మహిళలకు స్కిల్ డెవెలప్మెంట్, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించడం.. ఇలా ఫలానా సహాయం మాత్రమే మేము చేస్తామని కాకుండా అన్నిరకాలుగా మనిషికి అండగా నిలబడుతున్నారు. తన జీవితానికి అర్ధం తెలుసుకున్న తనుజ గారికి మరికొందరు మిత్రులు కూడా తోడయ్యారు. వారి ఆర్ధిక వనరులలో భాగస్వామిగా, పనులలోను భాగస్వామ్యులుగా తనుజ గారితో కలిసి నడుస్తున్నారు.
ఉద్యోగాన్ని వదులుకుని: తనుజ గారిది హైదరాబాద్. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత కొంత కాలం టీచర్ గా, కొంతకాలం మెడికల్ డిపార్ట్మెంట్ లోనూ, మరికొంతకాలం కాలేజి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు. ఏ ఉద్యోగం చేసినా 100% కమిట్మెంట్ చెయ్యడం మూలంగా అత్యున్నత స్థాయికి చేరుకునేవారు. ఎన్ని చేసినా కానీ జీవన గమ్యానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకుని పూర్తిస్థాయిలో సేవకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చిన్నతనంలో ఒక్క ఇడ్లీ ముక్కుతో మొదలైన తనుజ గారి సేవా ప్రస్థానం దాతల అండతో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలోను పదివేల మీల్స్ సమకూర్చగలిగే స్థాయికి చేరుకున్నారు.