ఈ క్వారెంటైన్ టైంలో మనకు ఆకలికి, డబ్బుకు ఇబ్బంది కలిగితే గవర్నమెంట్, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. మరి మనుషులు బ్రతకడికే కష్టంగా ఉన్న ఈ మహా నగరంలోని జంతువుల పరిస్థితి ఏంటి.? మాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైన ఉంటే పెట్టమ్మా.. అని అడిగినా వాటి భాషను అర్ధం చేసుకోలేని స్థితిలో చాలామంది ఉంటారు. సింధూర, విద్య గార్లు మాత్రం వాటి మాటలను విన్నారు, అన్ని భయాలను దాటి ప్రతిరోజు కడుపునిండా నింపుతున్నారు.
ఈరోజు జంతువులకు పెట్టె ఫుడ్ కోసం నిన్నటి నుండే వారి ప్రిపరేషన్ మొదలవుతుంది. రాత్రి బియ్యం పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఉదయం వంటచేస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కుక్కలు పిల్లులు దాదాపు వందశాతం బయటనే ఉంటాయి కనుక వాటికి పెరుగన్నం కూడా ప్రత్యేకంగా వండి పెడతారు. ఆకలితో ఉన్న ప్రాణానికి కాస్త ఫుడ్ పెడితే తీసుకుంటున్న వారు పొందే ఆనందం కన్నా పెట్టేవారి ఆనందం ఎక్కువ. పక్షులకు గింజలు, అలాగే సరిపడినంత మంచినీరు కూడా అందిస్తారు. "మీకు కుక్కలకు ఫుడ్ పెట్టాలని ఉంటే పెట్టండి అంతే కానీ వాటిని ఊరికనే కొట్టడం లాంటివి చేయకండి, ఈ భూమి మీద హక్కు మీకెంత ఉందో వారికి అంతే హక్కు ఉంది. వాటిని కొట్టడం చంపడం చట్టరీత్యా నేరం" కూడా అని సింధూర, శాంతి గారు అంటుంటారు.
సింధూర గారు డెంటిస్ట్. హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తనకు జంతువుల పట్ల ప్రేమ పెరగడానికి గల కారణం అమ్మమ్మ గారు. అమ్మమ్మ కాలంలోనూ పాలు ఇవ్వని ఆవులను, గేదెలను కబేళాలకు అమ్మేవారు, వాటిని ఒక్కోసారి కొని ఇంటికి తీసుకువచ్చి జీవితాంతం పెంచేవారు. చిన్నతనం నుండి అమ్మమ్మను చూస్తూ పెరగడం వల్ల మూగ జీవుల భాషను అర్ధం చేసుకుంటున్నారు. విద్య గారు రిటైర్డ్ టీచర్. వీరిద్దరూ ఒకరోజు సరూర్ నగర్ ప్రాంతంలో వీధి కుక్కలకు భోజనం పెడుతూ పరిచయం అయ్యారు. ఇక అప్పటి నుండి కూడా ఇద్దరూ కలిసి వీధి కుక్కలు, ఆవులు, పక్షుల ఆకలిని తీరుస్తున్నారు.
ఈ క్వారెంటైన్ నుండి మాత్రమే కాదు, సింధూర గారు, విద్య గారు చాలా సంవత్సరాలుగా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. వీధి కుక్కలు జీవితకాలంలో 50 నుండి 70 వరకు పిల్లలనుకంటాయి, ఇలా జరిగితే వాటి పాపులేషన్ పెరగడమే కాక కుక్కలు బలహీనమవుతాయి. ముఖ్యంగా వీటి ఆరోగ్యం కోసమే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కూడా చేయిస్తారు. ఒకరోజు సింధూర గారికి రోడ్డుపక్కన ఒక ఆవు భారీ పొట్టతో కనిపించింది. అది గర్భంతో ఉన్నదేమో అని అనుకున్నారు. కానీ ఎందుకే అనుమానం అనిపించి హాస్పిటల్ కు తీసుకువెళ్లి చూయించారు. ఆశ్చర్యం!! 25 కేజీల ప్లాస్టిక్ తో పొట్ట నిండిపోయింది. ఒక్కోసారి చెత్తకుండిలో దొరికే ఫుడ్ తో పాటు ప్లాస్టిక్ తినడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. వెంటనే ఆ ప్లాస్టిక్ అంతటిని తీసివేసి దాని ప్రాణాలను కాపాడగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే సింధూర, విద్య గారు చేస్తున్న సేవలు ఎన్నో ఎన్నోన్నో...