Contributed By Raviteja Ayyagari
RK బీచ్... వైజాగ్... సమయం: రాత్రి 9:00...
ఎన్ని సార్లు కాల్ వచ్చినా ఫోన్ ఎత్తలేదు నిశ్చయ్. అలా ఒక 5 కాల్స్ వచ్చిన 10 నిమిషాల తర్వాత వాళ్ళ నాన్నగారు, సుబ్రమణ్యం గారు వచ్చారు.
నాన్న: ఏరా, ఏమైంది ఫోన్ ఎత్తట్లేదు? ఏంటి కథ? నిశ్చయ్: ఏముంది, రోజు నా జీవితంలో జరిగే కథే. నేను రోజు సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు స్పాన్సర్స్ చుట్టూ తిరగం, ఆళ్ళు మబ్బులు కమ్మేసిన సూర్యుడిలాగా నన్ను చులకనగా చూడడం. చిరాకేసి, ఇక్కడ కూర్చున్నాను. రేపు పైడితల్లి వాళ్ళ కంపెనీ లో ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు. ఈ స్టార్టుప్స్ అన్ని పక్కన పెట్టి ఉద్యోగం చేసుకుంటాను.
నాన్న: 100 రోజులు. నీ లక్ష్యం కోసం నువ్వు చేసిన ప్రయత్నం విలువ కరెక్టుగా 100 రోజులు. చిన్నప్పుడు నీకు సైకిల్ కొనలేదని నన్ను ఒక సంవత్సరం పాటు ప్రతి రోజు బతిమాలావ్. దాన్ని నువ్వు వాడింది రెండు సంవత్సరాలు. నీ లైఫ్ లో 2% టైం ఉన్న ఒక వస్తువు కోసం నువ్వు అంత తపన పడినప్పుడు, నీ లైఫ్ కోసం ఇంకా ఎంత తపన పడాలి? 100 రోజులకే ఓటమిని ఒప్పేసుకుంటే ఎలా?
అయినా జాబ్ ఏ కావాలి అంటే పైడితల్లి ఏంటి, నేనే ఇస్తాను రా నీకు. కానీ నువ్వు రొటీన్ లైఫ్ లీడ్ చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందులో నీకంటూ ఎం చేయాలో క్లారిటీ ఉంటె, రొటీన్ లైఫ్ నీకు నచ్చదు కూడా. నువ్వు మాకేమి ఇవ్వక్కర్లేదు. పైగా నేను నీ నుంచి expect కూడా ఏమి చెయ్యను. నువ్వు ఒక మంచి citizen అవ్వాలి. మీ అమ్మ అయితే నువ్వు నవ్వుతూ ఉంటే చాలు అనుకుంటుంది.
ట్రై చెయ్. నీ goal reach అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? సంవత్సరం? రెండు? మూడు? అయిదు? నాకు ఒకే. నువ్వు నీ గోల్ రీచ్ అవ్వాలి. ఒరేయ్, తొమ్మిది నెలలు అమ్మ కడుపు లో ఉండి, అమ్మ కడుపు చీల్చుకుని బయటకి వచ్చాము. నాకు తెలిసి మన లైఫ్ లో అతి పెద్ద సక్సెస్, మన జననం. దాంతో పోల్చుకుంటే ఈ struggles ఎంత రా?
నీ పేరు కి మీనింగ్ తెలుసా? నిశ్చయ్ అంటే determination. నీ పేరులోనే కాదు, నీ పనిలోనూ అది ఉండాలి. అప్పుడు నేను అమావాస్య రోజు ఇలా బీచ్ లో కూర్చును పార్థాయ ప్రతిభోదితామ్ అని నీకు గీతోపదేశం చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా?
జనరల్ గా 100 రోజులంటే పండగ చేసుకుంటారు జనాలు. మనం కూడా చేసుకుందాం. నీ విజయానికి ఈ రోజు నువ్వు పునాది నాటుతున్నావ్. అందుకే advanced గా సెలెబ్రేట్ చేసుకుందాం. పద!
నేను ఈ కథలో చెప్పింది నిజంగా జీవితంలో జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఒక తండ్రి సంపాదించని కొడుకుతో ఇంత ప్రశాంతంగా మాట్లాడతాడో లేదో అనేది కూడా తెలియదు. కానీ తండ్రి కొడుకు నుంచి పెద్దగా ఏమి ఆశించడు. మనం బాగుపడాలి అని నాలుగు మాటలు అంటాడు కానీ, మనం బాధపడాలి అని మాత్రం అనుకోడు. మన లైఫ్ లో అందరి కంటే ముఖ్యమైన ఇద్దరిలో ఒకడై, ఎప్పుడు నీడలాగా మిగిలిపోయి ఎటువంటి పేరు ఆశించని నాన్న కి నేను రాసిన ఈ కథ అంకితం.