This Open Letter To Veteran Filmmaker SV Krishna Reddy Shows Just How Much We Love His Films!

Updated on
This Open Letter To Veteran Filmmaker SV Krishna Reddy Shows Just How Much We Love His Films!
ఓ ఉత్తరం మీద కరెక్ట్ అడ్రస్ రాసి పంపినా కాని కొన్నిసార్లు చేరుకోవు కాని సోషల్ మీడియాలో అలా లేదండి 'పావురాన్ని ఆకాశంలోకి ఎగిరేస్తే అది వెళ్ళి తన చివరి గమ్యమైన చెట్టు కొమ్మమీద ఎలా వాలుతుందో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరినైతే దృష్టిలో పెట్టుకుని ఉత్తరం రాస్తామో అది ఖచ్చితంగా చేరేవాళ్ళని చేరుతుందని నేను నమ్మతున్నాను'. ఈ ఉత్తరం కూడా మిమ్మల్ని చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటు ఈ బహిరంగ ఉత్తరం రాస్తున్నాను సార్. నమస్కారం కృష్ణారెడ్డి గారు నా పేరు శ్రీకాంత్. ఛాయ్ బిస్కెట్ లో రైటర్ ని.. నిజం చెప్పాలంటే నేను మీకేమి వీరాభిమానిని కాదు అందరిలాగే ఒక సాధారణ అభిమానిని. "మార్కెట్ లో మనం పూలు కొనడానికి వెళ్తాం అక్కడ ఉన్న పూలు కొన్నా కొనకపోయినా కాని అందులోని కొన్ని పూల పరిమళాలు మనకు హాయిని కలిగిస్తాయి, జీవితాంతం గుర్తుంటాయి.. అలాగే మీ సినిమాలు కూడా నా వరకు అంతే. మీ సినిమాలు హిట్టైనా కాకపోయినా కాని అందులోని గొప్ప విషయాలు మాత్రం నాకెప్పటికి గుర్తుంటాయి.. ఆ మంచి విషయాలు జీవితాంతం నా వ్యక్తిత్వానికి ఉపయోగపడతాయి". మీకో విషయం తెలుసా సార్.. నేను నా స్కూల్ లో, కాలేజీలలో నేర్చుకున్న దానికంటే కూడా సినిమాలు చూసి నేర్చుకున్న మంచే ఎక్కువ. నాకు థియేటర్ యే పాఠశాల, సినిమానే పాఠం, థియేటర్ లో నేను ప్రేక్షకుడిని కాదు విద్యార్ధిని. ఏరోజైనా టివిలో ఒక మంచి సినిమా వచ్చిందంటే ఆ రోజు నాకు మా అమ్మనాన్నలతో దెబ్బలు పడాల్సిందే.. ఎందుకంటే నేను ఆరోజు స్కూల్ కి వెళ్ళను కాబట్టి. నిజం చెప్పాలంటే మీ సినిమాలు థియేటర్లో కన్నా టివిలో చూసినవే ఎక్కువ. నేను మీ పర్సనల్ అడ్రెస్స్ కి కాకుండా ఇలా ఈ ఉత్తరం బహిరంగంగా రాయడానికి గల కారణం ఒక్కటే 'నా లాంటి వారు ఎందరో మీకు అభిమానులున్నారు సార్ వాళ్ళ భావాలను కూడా ఈ ఉత్తరంతో పోల్చుకుంటారనే ఉద్దేశంతో ఇలా బహిరంగంగా రాస్తున్నా. ముందుగా నా జీవితంలో, నా వ్యక్తిత్వంలో మీ సినిమాలు, మీరు ఎలాంటి బలమైన మార్పులు తీసుకువచ్చారోనని చెప్పాలనివుంది. ఆహా ఏమి రుచి అనరా మైమరిచి, రోజు తిన్నమరే మోజే తీరనది.. అసలు వంకాయ కూర మీద పాటేంటి సార్.! నాకు వంకాయ అంటేనే అస్సలు నచ్చదు. చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వంకాయ కూర చేస్తుంటే "వంకాయ కూర వికారమొస్తది వద్దు నా తల్లో.." అని మా అమ్మకు అర్ధమయ్యేలా పాట పాడేవాడిని.. కాని ఎప్పుడైతే ఎగిరే పావురమా సినిమాలోని ఆహా ఏమి రుచి అనరా మైమరచి అని ఆ పాటలో వంకాయ కూరను ఎలా వండాలి అని వర్ణించి చూపిస్తుంటే నాకు వంకాయ కూరను తినాలనిపించి గుత్తొంకాయ వండమని అమ్మకు చెప్పాను. అమ్మ కూడా ఆరోజు బాగా చేసింది, అచ్చం ఆ పాటలో వర్ణించినట్టే ఉంది వంకాయ కూర. నిజంగా మీరు నమ్ముతారో లేదోకాని నేను ఇప్పటికి ఎప్పుడు వంకాయ కూర తింటున్నప్పుడు కూడా 'తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి' అని ఆ పాట మాత్రం ఖచ్చితంగా గుర్తుకువస్తుంది. (2:30గంటల సినిమాను కేవలం కొన్ని నిమిషాలున్న పాట పూర్తిగా వివరిస్తుంది. అందుకే ఇక్కడ కొన్ని అలాంటి పాటలను Add చేస్తున్నాను.) విడాకులకు 'ఆహ్వానం'.. ఈ సినిమా నాకు కొంచెం వయసు పెరిగాక చూశాను. ఫస్ట్ ఈ టైటిల్ చూడగానే ఏదో పెళ్ళికి Invite చేస్తున్నట్టుగా అనిపించింది. కాని తర్వాత తెలిసింది పెళ్ళికి ఎలా ఐతే బంధువులను, స్నేహితులను పిలిచి అగ్ని సాక్షిగా తాళి కడతారో అలాగే తాళి తీసేసేటప్పుడు(విడాకులు) కూడా అదే బంధుమిత్రుల సమక్షంలో, అగ్ని సాక్షిగా జరగాలని ఏదైతో మీరు చూపించారో అది అత్యద్భుతం సార్.. ఇలాంటి ఆలోచన కలిగిన మీలో నాకు సతీ సహగమనం, బాల్య వివాహాలను ఎదురించిన ఒక రాజ రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం గారు కనిపించారు. నిజంగా అప్పుడు ఆ సందర్భంలో వచ్చే ఈ పాట ఎంత బాగుంటుంది సార్.. సినిమా సోల్ అంతా ఈ పాటలోనే ఉంటుంది. "చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది.. పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది.. ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిపడుతుందా.. ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా.!? నీ రాతకు ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా.. నువ్వూ రామ్మా ఓ అరుంధతి ఇదే నీ దర్శన బలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా.." అంటూ సిరివెన్నెల గారు రాసిన ఈ పాట విన్నాకనే నాకు మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో తెలిసింది సార్ https://youtu.be/VqJi9IpBXmg ఎంటర్టేన్మెంట్.. మాయలోడు, యమలీల, వినోదం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్కచుడు, కొబ్బరిబోండం, బడ్జెట్ పద్మనాభం, అభిషేకం, నంబర్ వన్ ఇంకా ప్రతి సినిమాలో ఉన్న ఆ స్వచ్ఛమైన కామెడి నేను ఇంతవరకు బాపు, జంద్యాల, త్రివిక్రమ్ గారిలో తప్పా మరెవ్వరిలోను చూడలేదు సార్. ఇప్పటికి నా చిన్ననాటి మిత్రులు కలిస్తే మీ సినిమాలోని కొన్ని సీన్లు గుర్తుచేసుకొని కాసేపు నవ్వుకుంటాం.
Entertainment Phera pic 4
Entertainment Phera pic 3
Entertainment Phera pic 2
Entertainment Phera pic 1
భార్యభర్తల అనుబంధం.. శుభలగ్నం, మావిచిగురు.. ఒక చిన్న తప్పు చేసినందుకు, ఒక చిన్న లోపం ఉన్నందుకు 'నన్ను మోసం చేశావ్ అని విడాకులు తీసుకునే దౌర్భాగ్యపు రోజులు సార్ ఇవి'. అలాంటిది అప్పటివరకు తన భర్తవైపు కన్నేతి చూసే ఆడవారిని తిట్టి తాను ముందుగానే చనిపోతున్నాని తెలిసి బతికుండగానే తన భర్త బాగోగులు చూసుకునే అమ్మాయితో పెళ్ళిచేయడం.. ఆహా ఇది నిజమైన ప్రేమకు మరో ఉదాహరణలా నిలిచింది సార్. అలాగే శుభలగ్నం కూడా. ఎక్కడో ఎందుకు మా రిలేటీవ్స్ లోనే శుభలగ్నం ఆమని లాంటి ఆవిడ ఉండేవారు, ఆమె భర్తకూడా జగపతిబాబు లానే నిజాయితి గల ఆఫీసర్. ప్రతిరోజు అలాంటి గొడవలే వారింట్లో కూడా జరిగేవి. (నాకు ఊహ తెలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది) ఎప్పుడైతే ఆడవారికి డబ్బుకన్నా ఐదోతనం ఏ రకంగా ముఖ్యమొనని మీరు చెప్పిన విధానం చూసి ఆమె కూడా మారిపోయింది.. ఇది నేను చూసిన ఒక యదార్ధ సంఘటన సార్. https://youtu.be/ZoH-dPOnYWo అమ్మ.. కన్నతల్లితో సేవలు, మంచి బుద్దులు నేర్చుకోవాల్సిన వయసులో ఆ బాబు కన్నతల్లికి సేవలు చేస్తాడు. తల్లి కొడుకుల మధ్యగల బంధాన్ని "నాలో నేను చూసుకున్నా.. అన్నమయ్య గీతాల భావన, త్యాగరాజు రాగాల సాధన.. ఉన్నది ఒక్కటి కమ్మని పేరు అమ్మా.." అని సినిమా ద్వారా వారి బంధాన్ని ఎంత అధ్బుతంగా చూపించారు సార్ నిజంగా. యమలీలలో కూడా ఒక పాట ఉంటుంది. ఎదిగే కొడుకు ఎంత ఉన్నతంగా ఉండాలో అని ఆ తల్లి ఊహించి, ఆశించి పాడుకునే పాట "మదిలో మచ్చలేని చందమామే నువ్వని ఊరు,వాడ నిన్ను మెచ్చుకుంటే చూడని.. మహారాజులా జీవించాలి నిండునూరెళ్ళు". మా అమ్మకు ఎంతో ఇష్టమైన పాటలు ఇవ్వి. ఇందులోని పాటలను మారుస్తూ మా అమ్మ ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకుంటుంది. ఈ పాటలు ఎప్పుడు విన్నా మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి సార్.. నేను ఈ పాటల గురించి ఇంకా ఎక్కువ వర్ణించలేను సార్.. దయచేసి నన్ను క్షమించండి. నీ ప్రపంచానికి రాజువు నువ్వే, మంత్రివి నువ్వే, సైన్యం నువ్వే, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే బదులు నువ్వే.. ఇది సంధర్భమో కాదో తెలియదు కాని ఒక విషయం చెప్పాలి. "నేను ఇప్పటికి మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను". నేను చాలా కష్టపడతాను. పరిస్థితిని బట్టి నా మిత్రులు, అమ్మనాన్నల ఊహకందనంత కష్టపడుతాను. ఇప్పటివరకు జరిగిన జీవితంలో ఎంతోకొంత సాధించగాలిగాననే నమ్మకం కూడా ఉంది. కాని ఒకానొక సందర్భంలో కాలం పెట్టే సమస్యలకు తట్టుకోలేక పోయాను. సంవత్సరంలో మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను సార్. నా అదృష్టమో, దురదుష్టమో కాని బ్రతికాను. ఆ సంధర్బంలో నాకు తోడుగా ఎవ్వరు లేరు సార్, ""ఒంటరిగా 15 నెలలు ఒక్కొక్క సెకండు బ్రతికాను"". ఆ సందర్భంలో నాకు పుస్తకాలు, పాటలు ఆసరానిచ్చాయి. అందులో నేను ఎక్కువగా విన్నపాట ఇది. ఈ పాట నాకు మాత్రమే కాదు నాలాంటి ఎంతోమందికి ఓదార్పునిచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఇది నిజం.. " అనుమానాలే అనుకూలాలు,' సందేహాలే సందేశాలు, ఛీత్కారాలే సత్కారాలు.. బలము నువ్వే, బలగం నువ్వే.. ఆటా నీదే, గెలుపూ నీదే.. నారు నువ్వే, నీరు నువ్వే, కోతా నీకే, పైరూ నీకే.." చంద్రబోస్ గారు రాసిన ప్రతి వాక్యం నాకు ఎంతో శక్తినిచ్చింది. ప్రతి ఒక్కరికి ఇలాంటి సంధర్భం అంటూ చాలాసార్లు వస్తుంది అలాంటి సంధర్భానికి మీరు సినిమాలో పొందుపరిచి ఎంతో గొప్ప జీవిత సత్యాలను తెలియజేశారు సార్. మీ ఒక సినిమాలోని కథ, ఒక కాన్సెప్ట్ మరే ఇతర సినిమాలోను, ముఖ్యంగా మీ సినిమాలలో కూడా చూడలేదు. నిజంగా ఇంత రాశాక కూడా నాకు ఈ ఉత్తరం అంతా సంతృప్తికరంగా లేదండి.. ఇందులో కేవలం మీ గురించి ఒక 30% చెప్పి ఉంటానేమో. నా పదాల అమరిక గాని, చిన్న చిన్న పొరపాట్లు, లేదంటే ఇంకా బాగా చెప్పేదుండే అని కాకుండా నా ఇంటెన్షన్ ను మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తూన్నాను.. నేనేమి గొప్ప రైటర్ ని కాదండి ఏదో సాదాసీదా మామూలు రైటర్ ని.. మీ సినిమాల గురించి దేవులపల్లి, శ్రీశ్రీ గారిలాంటి సాహిత్యంతో వర్ణించలేను నాకు తెలిసిన కొన్ని పదాలతోనే నా బావోద్వేగాన్ని తెలియజేస్తున్నాను.. మిగితావారి అభిప్రాయం నాకు తెలియదు కాని నాకు మాత్రం ఒకటి చెప్పాలని ఉందండి "మీ సినిమాలు అచ్చం మీ నవ్వులా ఉంటాయండి". ఆ స్వచ్ఛత, ఆ హాయి, ఆ ఓదార్పు, ఆ ఆప్యాయత.. మీ సినిమాలో కనిపించే గొప్ప విషయాలన్ని మీ నవ్వులో కనిపిస్తాయండి నాకు.. ఈ ఉత్తరం ముఖ్య ఉద్దేశం ఒక్కటే సార్.. అసలు మీరు ఎందుకు సార్ సినిమాలు తీయడం ఆపేశారు.? కథ, కథనం, మంచి విలువలు లేని దిక్కుమాలిన సినిమాలు చేస్తున్నారు కొంతమంది దర్శకులు. ఒక కాన్సెప్ట్ లేదు, ఒక కొత్త సందేశం లేదు. "ఒకే తరహా కథను అటు తిప్పి ఇటు తిప్పి పేక ముక్కల్లా స్క్రిప్ట్ పేపర్లను మార్చి మార్చి సినిమాలు తీస్తున్నారు సార్". నాకు గొప్ప సంధర్భం, సంగీతం, సాహిత్యంతో కూడిన పాటలు వినాలని ఉందండి, ఒక స్వచ్చమైన కామెడి చూడాలని ఉందండి, ఒక ప్రశ్న అందుకు తగిన నిజమైన సమాధానం తెలుసుకోవాలని ఉందండి, మొత్తానికి అప్పట్లో చూసేవాడిని "కథ, స్కీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి.. అనే టైటీల్ కార్డ్ తో మీ సినిమాలు చూడాలని ఉందండి. నేను మీ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి మిమ్మల్ని నా గురువుగా భావించి అడుగుతున్నాను "దయచేసి మీరు మళ్ళి సినిమాలు తీయడం స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్.. మీ మంచి హాస్యం, కథ, పాటలు ఎంటర్టైన్మెంట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు నాకు మాత్రమే కాదండి రొటీన్ సినిమాలు చూసి చూసి విసుగెత్తిపోతున్న మన తెలుగువారందరికి కూడా చాలా అవసరం. దయచేసి మీ తరహా సినిమాలు తీయడం మొదలుపెట్టండి సార్.. మన వాళ్ళు మంచి సినిమాలను ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. ఒక్కసారి మనస్పూర్తిగా ఆలోచించండి.. థాంక్యూ సార్. ఇట్లు, మీ సాధారణ అభిమాని, శ్రీకాంత్ కాశెట్టి.