An Emotional Fan Note About SPB Garu For Everyone Who Grew Up Listening To His Songs

Updated on
An Emotional Fan Note About SPB Garu For Everyone Who Grew Up Listening To His Songs

Contributed by Sairam Nedunuri

ప్రియమైన బాలు గారి "ప్రాణమే నీవని, గానమే నీదని, ప్రాణమే గానమని" అని పాడి, మీ ప్రతిభ కి ఏనాడో వినమ్రంగా పరమేశ్వరుడి కి కృతజ్ఞతలు చెప్పినట్టున్నారు. "తరలి రాద తనే వసంతం" అన్నట్టుగా, మీ పాట విన్న ప్రతిసారీ వసంతం మాకోసం తరలి వచ్చేసేది. "జాము రాతిరి జాబిలమ్మ, జోల పాడనా ఇలా" అంటూ మీరు పాడిన పాటలు ఎంత మందికి హాయినిచ్చాయో "స్వప్న వేణువేదో సంగీతం ఆలపించి"నట్టు మా చెవులలో తేనె కురిపిస్తూనే ఉన్నారు మీరు.

మీరు పాడిన పాట, తెరపై మా అభిమాన కథానాయకుడే పాడినట్టు సంబరపడ్డాము. మీరు పాడిన ప్రేమ గీతాలు వింటూ, మేమే ప్రేమలో పడినంత అనందపడ్డాము. భాష అర్థం కాకపోయినా మీ గాత్రం కోసం ఎన్నో ఇతర భాషల పాటలు కూడా వినేసాము. కొత్త చిత్రాలలో "గానం: SPB" అని కనపడగానే మొదట ఆ పాటే వినేంతగా మిమ్మల్ని అభిమానించాము.

ఎన్నో రాగలని మీ గానంతో అలంకరించారు. ఎందరో నటులకి మీ గాత్రంతో తోడునిచ్చారు. "అప్పదాసు" లాంటి ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. మీ నడవడికతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

ఎంతో మంది కొత్త గాయకులని, ఇక మీదట పరిచయం చేసేదెవరు ? పాట పాడిన తరువాత, ఆ పాట వెనకున్న కథని ఇకపై చెప్పేదేవరు ? రచయిత గొప్పతనాన్ని, ఆ పాటలోని లోతైన భావాన్ని ఇకపై వివరించేదెవరు ? "మాధుర్య ప్రధానమైన" పాటలు స్వరపరిచిన సంగీత దర్శకులను ఇకపై ప్రశంసించేదెవరు ?

ప్రస్తుతం "పాడుతా తీయగా" అంటూ దేవతల దగ్గర కచేరీ ఇస్తున్నారేమో. స్వరాలతో ఆ సరస్వతీ దేవికి "స్వరాభిషేకం" చేస్తున్నారేమో. మీ ఆరాధ్య దైవం ఎదుట అనందంతో ఆలపిస్తున్నారేమో. దేవలోకం సమస్తం "బాలుడిని" అక్కున చేర్చుకుని మురిసిపోతున్నారేమో.

ఇప్పుడు జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కూడా మీరు వినిపిస్తున్నారు. సంగీతం విన్న ప్రతిసారీ మీరు గుర్తుకొస్తారు. మీ వేల పాటల ద్వారా మీరు మాతోనే ఉంటారు. మీ అనితర సాధ్యమైన ప్రస్థానంతో చిర స్థాయి గా నిలిచిపోతారు.