This Fan's Heartfelt Letter To Suma Garu Explains Why She's An Inspiration

Updated on
This Fan's Heartfelt Letter To Suma Garu Explains Why She's An Inspiration

ప్రియమైన సుమక్క కి, మనం ఎవరినైనా వరుస పెట్టి ఎప్పుడు పిలుస్తాం. మనకు బాగా దగ్గరైనప్పుడు, కావాల్సినవారైనప్పుడు. మిమ్మల్ని చూసినప్పుడు కూడా అలా అనిపిస్తుంది కాబట్టే.., సుమగారు అనడం కన్నా సుమక్క అని పిలుస్తూ సంతోషిస్తాం. సంతృప్తి పడతాం. అందరికి కావాల్సింది చేసి అలసిపోయి సేదతీరడానికి టీవీ పెట్టుకునే అమ్మ లాంటి ప్రతి సగటు మహిళ కి మీ మాటల ద్వారా ఆటల ద్వారా ఆనందాన్ని ఇస్తున్నారు కాబట్టే ప్రతి ఇంట్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.

మాట్లాడం కూడా ఒక కళ. కానీ ఆ మాటలో ఎక్కడ తప్పు దొర్లకుండా మాట్లాడం మాత్రం ఎంతో కృషి చేస్తే కానీ రాదు. పెద్ద వాళ్ళతో ఎంత అణుకువగా మార్యాద గా మాట్లాడతారో. పిల్లలతో అంతే చలాకి గా అల్లరి చేస్తూ మాట్లాడుతారు. కాబట్టే.., ఎన్నో సంవత్సరాల నుండి యాంకర్ గా దిగ్విజయంగా కొనసాగుతున్నారు.., ఆడియో ఫంక్షన్స్ లో పాటల కోసం , హీరో స్పీచెస్ కోసం ఎంతలా చూస్తామో, మీ యాంకరింగ్ కోసం కూడా అంతే చూస్తాం.

సాధించాలి అనుకున్న లక్ష్యం కోసం ఏమైనా చేయగలగాలి, నేర్చుకోగలగాలి. అలా ఎవరైనా చేశారా? అంటే నాకు తట్టే మొదటి పేర్లలో మీ పేరు ఉంటుంది. మాతృ బాషా మలయాళం అయినా తెలుగుని మా లాంటి వాళ్ళ కన్నా బాగా మాట్లాడుతున్నారంటే,అది చేసే పని పట్ల ఉండే ఇష్టమే కదా!. ఒక సినిమానే మూడు గంటలకన్నా ఎక్కువ ఉంటె బోర్ కొడుతోంది. కానీ ఒక ప్రోగ్రామ్ 3000 ఎపిసోడ్స్ అయినాకానీ, సుమ ఈ రోజు ఏ గేమ్ పెడుతుందో అని చూసేది మా అమ్మ.

ఒక పక్క పని ఇంకో పక్క కుటుంబం. సమంగా సమయాన్ని కేటాయిస్తూ రెండిటిని విజయవంతంగా నడిపిస్తున్న మిమ్మల్ని చూసి మహిళలే కాదు, పని ఒత్తిడిని ఇంట్లోవాళ్లపై చూపే నా లాంటి అబ్బాయిలు కూడా చాలా నేర్చుకోవాలి. పని కుటుంబమే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ.. ఇంకెంతో గౌరవాన్ని పొందారు.

పొగడ్త ని, తెగడ్త ని ఒకేలా స్వీకరించ గలిగితే అక్కడే సగం విజయం సాధించేసి నట్టు. పెద్దవాళ్లు పొగిడినప్పుడు ఎంత వినయంగా ఉంటారో, ఎవరైనా పంచ్ వేస్తే అంతే హుందాగా కూసింత వేటకారం తో కౌంటర్ వేసి వాతావరణాన్ని చల్లపరుస్తారు. కానీ ఎక్కడ అసభ్యత ఉండదు. ఈ రోజు సుమ ఈ పంచ్ వేసిందిరా అని మా అమ్మ నాతో చెప్పుకుని నవ్వుకున్నా సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రతి ఉద్యోగి విజయం సాధించాలంటే మీ సమయస్ఫూర్తి ని అనుసరిస్తే చాలు..,

గల గల మాటలు, ఆ మాటల వల్ల వచ్చే నవ్వులు, నవ్విస్తూ చెప్పే సూచనలు.., కొన్ని తరాల తరువాత అయినా యాంకర్ అంటే మొదట మీ పేరు చెప్పుకునేలా చేయాలని ఆశిస్తూ.. అభిలాషిస్తూ.. ఇవే మా నమ"సుమాం"జలులు.