ఎవరో ఒకరు ఎపుడో అపుడు : A Deeper Meaning Into The Song Written By Sirivennala Garu

Updated on
ఎవరో ఒకరు ఎపుడో అపుడు : A Deeper Meaning Into The Song Written By Sirivennala Garu

ఒక పాట కి ఒక కొత్త ఉత్తేజాన్ని నింపే శక్తి ఉంది.. అలాంటి పాటలు సిరివెన్నెల గారు ఎన్నో రాశారు.. వాటిలో బాగా ప్రాచుర్యం పొంది.. ప్రతొక్కరి playlist లో పదిలంగా ఉన్న పాటలు ఎన్ని ఉన్నాయో.. ఎంతో మందికి తెలియని పాటలు కూడా అన్నే ఉన్నాయి.. వీటిలో నాకు మొదట గుర్తొచ్చేది.. అందరు వినాలి అనిపించేది, "అంకురం" సినిమాలో "ఎవరో ఒకరు" అనే పాట..

"అంకురం" ఈ సినిమా కి "Best Telugu Feature Film" గా 1992 లో National award వచ్చింది. సి. ఉమామహేశ్వర రావుగారు direct చేశారు. అప్పుడే పెళ్లి అయినా అమ్మాయి ట్రైన్ లో ఎవరో తెలియని వ్యక్తి వదిలేసిన బిడ్డ ని ఇంటికి తీసుకొస్తుంది. ఆ బిడ్డని తన తండ్రి దగ్గరికి చేర్చాలని ప్రయత్నిస్తుంది.. ఆ ప్రయత్నం లో చాలా పెద్ద విషయాలు బయటపడతాయి వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనేదే ఈ సినిమా కథ. చుట్టూ జరిగే ఎన్నో విషయాలను చూసి చూడకుండా వదిలేయకుండా తమ శక్తి వంతు ఏదైనా చేయాలి అనుకునే ప్రతొక్కరిని ప్రతిబింబిస్తుంది ఈ పాట..

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎంత పెద్ద లెక్క అయినా ఒకటి తో నే మొదలవ్వాలి. ట్విట్టర్ లో అయ్యే ట్రెండ్ నుండి.. ప్రపంచాన్ని మార్చే ప్రయోగం వరకు ఏదైనా మొదటెప్పుడు ఒంటరే. ఆ అడుగు ధైర్యంగా నమ్మకంగా వేసినప్పుడే, అద్భుతంగా మారుతుంది..

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకుని కోడి కూత నిదరపోదుగా జగతికి మేలుకొల్పు మానుకోదుగా

మొదటి చినుకు సూటిగా దూకిరానిదే మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే వానధార రాదుగా నేలదారికీ ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ

నేను కూసిన ఎవరు నిద్దుర లెవరు అని కోడి కూయడం ఆపదు.. జగతి మేలుకొల్పాలనే తన కర్తవ్యాన్ని ఆపదు... మబ్బు చాటున దాగిన చినుకు కూడా అక్కడే ఉంటాను అంటే, వాన పడదు... నీళ్లు రావు, ఎన్నో జీవ రాశులు అసలు బతికే అవకాశం కూడా ఉండదు.. "కర్మణ్యేవాధికారస్తే" మన పని మీదే మన హక్కు ఉండాలి, దాన్ని మీదే మన నమ్మకం, ఆలోచన ఉండాలి.. ఫలితం అనేది మనం ఆలోచించాల్సిన విషయం కాదు, అనే భగవద్గీత సారాన్ని, ప్రకృతి లో జరిగే ఒక మామూలు విషయం తో అన్వయిస్తూ.. అద్భుతంగా వర్ణించారు శాస్త్రి గారు..

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ సాగలేక ఆగితే దారి తరుగునా? జాలిచూపి తీరమే దరికి చేరునా

మిణుగురులు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, వాటి వెలుగుతో చీకటి ని పోగొట్టుతాయి. ఆ చిన్న పురుగే చీకటి ని లెక్క చేయనప్పుడు, నీ కష్టాన్ని నువ్వెందుకు లెక్క చేస్తావ్, దాన్ని మీద ఎందుకు నీ ఆలోచన సారిస్తావ్. నీ కన్నీరుని దాచుకుని నీ పదవి అనే ప్రమిదపై నవ్వు అనే దీపాన్ని వెలిగిస్తూ నీ ప్రయాణం సాగించాలి. నువ్వు వెళ్లే దారి చాలా దూరం అని చూస్తూ ఆగిపోతే ఆ దారి మాత్రం నీ దరిచేరదు. ప్రయత్నం చేయాలి. అప్పుడే ఫలితం అంటూ వచ్చేది..

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా

మామూలుగా ఆశలు ఆవిరవ్వడం అనే పదాన్ని వాడుతుంటాం. కానీ, ఆ ఆవిరి అవ్వడం లో కూడా ఒక సానుకూల దృక్పథాన్ని చూపించారు శాస్త్రి గారు ఈ లైన్స్ లో, నింగిని తాకాలని అలలా ఎగిసి పడుతుంది నీళ్లు, కానీ మండి ఆవిరి గా మారితేనే .. మబ్బుగా మారి సూర్యుడ్ని సైతం కమ్మేయగలుగుతుంది.. మండకూడదు అనుకుంటే నీరు ఆవిరిగా ఎలా మారలేదో.. కష్టపడలేను, అంటే మనిషి కూడా అనుకున్నది సాధించలేడు...

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు కావున మొదటి అడుగు ఎవరో ఒకరు వేయాల్సిందే, అది నువ్వైనా, నేనైనా, ఎవరైనా... ఆ అడుగు అటైనా ఇటైనా ఎటువైపైనా... అప్పుడే పని జరుగుతుంది.. అద్భుతం పుడుతుంది..

ఈ సినిమా పాటలు గానీ, సినిమా గానీ official గా ఎక్కడ లేదు.. స్వరాభిషేకం లో విన్నప్పటినుండి.. నా playlist నుండి పొవట్లేదు. సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైనా వస్తే మాత్రం తప్పకుండ చూడాల్సిన సినిమా..