పాట లోని పాఠం: చంద్రబోస్ గారు రాసిన "ఎవరేమి అనుకున్న" పాట లో ఉన్న అద్భుతమైన భావం - A Short Note

Updated on
పాట లోని పాఠం: చంద్రబోస్ గారు రాసిన "ఎవరేమి అనుకున్న" పాట లో ఉన్న అద్భుతమైన భావం - A Short Note

చిన్న చిన్న పదాల్లో లోతైన అర్ధాన్ని చెప్పే రచయితల్లో చంద్రబోస్ గారు ఒకరు. "ఎంత చక్కగున్నావే" లాంటి అందమైన భావాలతో అమ్మాయి ని వర్ణించగలరు, "విశ్వ విశ్వ నాయక" అంటూ రాక్షసుడ్ని కూడా పొగడగలరు. "మౌనంగానే ఎదగమని" అని మనలో మౌనంగా ఉత్తేజాన్ని నింపగలరు. ఆయన రాసినా పాటల్లో నాకు చాలా నచ్చిన పాట , మనస్సేమి బాగోనప్పుడు వినే పాటల్లో ఒకటైన పాట "బడ్జెట్ పద్మనాభం" సినిమాలో "ఎవరేమి అనుకున్న" అనే పాట.

సందర్భం: హీరో ఒక పిసినారి, ప్రతి చిన్న విషయానికి లెక్కలు వేస్తూ ఉంటాడు. కానీ ఈ లెక్కలు వేస్తూ తను డబ్బు కూడపెట్టేది చిన్నప్పుడు తను పోగొట్టుకున్న తన ఇంటిని తిరిగి సంపాదించుకోవడానికి. ఈ క్రమం లో తన భార్య కూడా తనని అపార్ధం చేసుకుంటుంది. అయినా తను అనుకున్న లక్ష్యం వైపు మొండిగా సాగుతుంటాడు హీరో. ఆ సమయం లో వచ్చే పాట ఇది.

పల్లవి: ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ॥

ఒకప్పుడు అంటే, రాజ్యాలు ఉండేవి, సైన్యం ఉండేది. కానీ ఇప్పుడు, నీకు నువ్వే రాజు, నీకు నువ్వే సైన్యం, నీ గురించి పోరాడాల్సింది నువ్వే.., జీవితం పెట్టె పరీక్షకి నిన్ను సిద్ధం చేసే బడి కూడా నువ్వే కావలి, నీ ప్రశ్నలు నువ్వే వేసుకోవాలి. వాటికి జవాబు నువ్వే వెతుక్కోవాలి, నీదనే కథ కి నువ్వే హీరో కావాలంటే, నువ్వే పోరాడాలి నువ్వే సాధించాలి..

చరణం 1: అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు అనుకోవాలీ అడుగేయాలీ ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి అలుపొస్తున్నా కలలేకన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి ॥ మొదటి సారి ఒక పని చేద్దామని మొదలు పెట్టాం, నిన్ను ప్రోత్సహించే వాళ్లకన్నా, నిన్ను అవమానించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. "వీడు సాధించ గలడా?" అని అనుమానించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ అవమానాన్ని ఆభరణంగా స్వీకరించి, అనుమానం కూడా అనుకూలంగా మలుచుకుంటూ, సందేహాల్లో కూడా సందేశాన్ని వెతుకుంటూ.. ముందుకు సాగాల్సిందే. నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ఆ దారి లో రహదారి మాత్రమే ఉంటుంది అనుకోకూడదు, ముళ్ళ బాట కూడా ఉంటుంది. వాటికి కూడా సిద్ధపడాలి. కొన్ని సార్లు అలుపొస్తుంది, నిరుత్సాహపడిపోతాం. కానీ మన కల మనమే నెరవేర్చుకోవాలి కదా మరి.. ఈ గజి బిజీ బతుకుల లోకం పరాయి వాడి కష్టాన్ని పట్టించుకునే ఓపిక తీరిక ఎవరికీ లేదు, నిన్ను నువ్వు పట్టించుకోవాల్సిందే..

చరణం 2: బలము నువ్వే బలగం నువ్వే ఆటా నీదే గెలుపూ నీదే నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే నింగిలోన తెల్లమేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టుపైనా పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ॥ నువ్వు ఆట బాగా ఆడితే, నువ్వే కదా గెలుస్తావు, నేడు నువ్వు పడే కష్టం, రేపు నువ్వు అనుభవించే వైభోగానికి వేసే మెట్లు.., చీకటి తరువాత వెలుగు వస్తుంది.. వర్షం రావాలంటే మబ్బులు కమ్మాల్సిందే, ఇవన్నీ చాలా మామూలు, నీలో ఉన్న విజేత ఇవే బలగాలు బలాలు...

ఈ పాట విన్నారో లేదో, తెలీదు కానీ ఒకసారి వింటే మాత్రం ఇంకోసారి వినాలనిపిస్తుంది, బాలు గారి గొంతు, ఎస్వీ కృష్ణారెడ్డి గారి స్వరం ఈ పాట కి అందులో మాటకి ఇంకొంత అందాన్ని పెంచింది. ఒక సందర్భం ఓ ఈ పాట ని ఉదాహరిస్తూ.., చంద్రబోస్ గారు తన పడిన కష్టం గురించి చెప్పారు..