I'm A Doctor Also, IPS Also. This Women Proved That You Can Be Whoever You Want To Be

Updated on
I'm A Doctor Also, IPS Also. This Women Proved That You Can Be Whoever You Want To Be

చేతన గారికి మనుషులంటే మహా ఇష్టం. వారు బాధలో ఉంటే చూడలేకపోతారు. అందుకే మెడిసిన్ చదివితే డాక్టర్ మరింతమందికి సేవ చేసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశ్యంతో ఇంటర్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ పూర్తిచేశారు, ఉస్మానియా మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ గా కూడా అనారోగ్య బాధితుల బాధలు తీర్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు చివరికి చేతన గారు కూడా ఊహించలేదు ప్రజల మీద ప్రేమ మరో రంగంలోకి తీసుకువెళ్తుందని..

ప్రపంచంలోని గొప్ప నాయకులందరూ సున్నిత మనస్కులే.. వారు సున్నితంగా ఉండడం వల్లనే కదా ప్రజల సమస్యలను నిశితంగా చూడగలిగింది. నాన్న సతీష్ చందర్ గారు హైదరాబాద్ లో స్థిరపడ్డ జర్నలిస్ట్, రచయిత. సొసైటీలో ప్రతిరోజు జరిగే వివిధ సంఘటనలు వార్తలతో ఇంటి వాతావరణం ఉండడం కూడా చేతన గారి వ్యక్తిత్వ నిర్మాణంపై ప్రభావం చూపాయి. నిజానికి ఎం.బి.బి.ఎస్ చెయ్యడం వల్ల ప్రజా సేవ ఎక్కువ చెయ్యొచ్చు అనుకున్న చేతన గారికి తన లక్ష్యానికి మరో మార్గం ఎన్నుకోవాల్సి వచ్చింది. డాక్టర్ గా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చే పేషేంట్స్ లో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉండేవారు.

మహిళలు గర్భస్రావాలతో, ఎనీమియా బాధితులు, పిల్లలు పోషకాహాలోపాలు వంటి రకరకాల వారిని కలుసుకోగలిగారు. వారితో మరింత తీవ్రంగా మాట్లాడడం మూలంగా గృహహింస, వరకట్న వేధింపుల ద్వారా వారి జీవితాలను చూడగలిగారు. "డాక్టర్ గా ఉంటే కాసేపు వారికి శాంతిని ఇవ్వగలనేమో, అదే ఐ.పి.ఎస్ ఆఫీసర్ ఐతే వచ్చే అధికారంతో మరింత ఉన్నతంగా వారి జీవితాలను బాగుచేయొచ్చని "సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు.

సివిల్స్ మొదటి ప్రయత్నంలోనే ఐ.ఆర్.ఎస్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొంతకాలం జాబ్ చేశారు కాని అందులో తనకు నచ్చిన పని చెయ్యడం చాలా తక్కువగా ఉండేది. మళ్ళి సివిల్స్ రాశారు ఈసారి ఐ.పి.ఎస్ వచ్చింది. ఐ.పి.ఎస్ ట్రైనింగ్ తన లక్ష్యానికి మరింత సన్నద్ధం చేసింది. డాక్టర్ గా ఏ.సి రూమ్ లో కూర్చుని పనిచేసుకోవచ్చు కాని పోలీస్ వృత్తి అలా కాదు.. తీవ్రమైన ఒత్తిడి, శాంతి భద్రతల సమస్యలు, శత్రువుల నుండి దాడులు మొదలైనవి ఇక్కడ సర్వసాధారణం, చేతన గారికి మహిళలకు రక్షణ ఇవ్వాలనే కాంక్ష ముందు ఇవ్వి చిన్నగా తోచేవి. వృత్తిపరంగానే కాకుండా సాధ్యమైనంత వరకు పిల్లలకు, మహిళలకు అండగా ఉంటూ స్పూర్తి నింపుతూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు.

సుల్తాన్ బజార్ ఏసీపీ గా చార్జ్ తీసుకున్న తర్వాత ఛేదించిన మొదటి కేసు కోటి ప్రసూతి హాస్పిటల్ లో అపహరణకు గురైన చిన్నారి కేసు. హాస్పిటల్ నుండి ప్రతి కిలోమీటర్ ను టీం తో క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి వాహనం, చెత్త కుండీలు, ఆ దగ్గర్లో ఉన్న ప్రతి సీసీ టీవీ వీడియోలను చూశారు. పాపను అపహరించిన మహిళ బీదర్ కు వెళ్లిందని తెలియడంతో హుటాహుటిన టీం తో బీదర్ కు వెళ్లి పాపను గుర్తించారు. అలా అప్పటికే రెండు సార్లు అబార్షన్ జరిగిన ఆ తల్లి బిడ్డను దాదాపు 24 గంటల వ్యవధిలోనే ఆచూకీ కనుగొన్నారు. అన్నట్టు మరో విషయం చేతన గారిలో సమాజానికి ఉపయోగపడే రచయిత కూడా ఉన్నారు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలతో "అల" అనే పేరుతో పుస్తకం కూడా వెలువడింది.