(Contributed by ప్రవీణ్ కుమార్ రేజేటి)
రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎవరో పిలిఛి "బాబు ఇక్కడ ధర్మసత్రం ఏదన్నా ఉందా ?"అని అడిగితే ఒక్కసారి వాళ్ళని పై నుంచి కింద వరకూ చూసి... ఆపై గూగుల్ లో వెతుక్కునే పరిస్థితి. ఒక్క పది రూపాయలు ఎవరికైనా దానం చేస్తే,ముఖపుస్తకం లో ఫోటోలకు గొప్పలు పోయే రోజులివి. సగటు మనిషి నోరు తెడిచి "ఆకలి" అని అడిగితే, చిరాకు గా చుసి... "అవతలికి పో" అని ఫోనుల్లో మునిగిపోయే బిజీ బ్రతుకుల కాలమిది.
ఇలాంటి ఆలోచనలను మార్చి, 'అమ్మా' అని అడిగిన వారి మనసు లో భావాల్ని, వారి ఆకలిని అర్ధం చేసుకునే లా మనల్ని ప్రేరేపించే మహిళా శిరోరత్నం - అపర అన్నపూర్ణమ్మ - శ్రీమతి డొక్కా సీతమ్మ.
ఆమె పుట్టి, పెరిగింది ఆచ్చ తెలుగు వాకిళ్ళల్లో, మెట్టింది సాంప్రదాయపు లోగిళ్ళల్లొ, అందునా గోదారి ముంగిలి.... గోదావరి జిల్లాల్లో డొక్కా సీతమ్మ పేరు కొత్త కాదు. ఇప్పుడు గోదారి వెళ్ళిన సీతమ్మ సందు అంటే అందరికి తెలియనివారుండరు. అసలు గోదారి ప్రాంతాల్లో ప్రజలు గొప్ప అదృష్టవంతులు. కంటి ముందే గంగమ్మ, కనుచూపు మేరంతా పచ్చని పంట, కన్న పిల్లలతో సమానమైన పాడి, పొద్దున్న లేస్తే మన అని పలకరించే పది మంది. మనిషి సంతోషంగా జీవించడానికి ఇంతకన్నా ఏం కావాలి? సీతమ్మ నాన్న గారు శంకరo ను "బువ్వయ్య" అని పిలిచేవారు, ఆయన నిత్యం అన్నదానం చేసేవారట. సీతమ్మ పుట్టినింట నేర్చుకున్న విషయాలు, అత్తవారింట అలవరచుకున్న గొప్ప నడవడి అతిధి మర్యాద, అన్నదానం ఆమె ను గొప్ప భావాలున్న స్త్రీమూర్తి గా తీర్చి దిద్దాయి.
అలసి ఆకలి తో ఉన్న వారికి కొన్ని దశాబ్దాల పాటు ఆమె అలసి పోకుండా వండి వార్చి వడ్డించింది. ఆమె కులం మతం ఏనాడు చూడలేదు. అర్ధ రాత్రుల్ని కూడా లెక్కచెయలెదు. వరదలు, వర్షాలకు ఆమె జంకలేదు. పేదరికం ఆమె లేదని అనే లా చేయలేదు, ఒక నాడైన ప్రతిఫలం ఆశించింది కాదు, ఆమెకు మిగిలేది ఏమిటన్న ఆలోచన మనసులో రానివ్వలెదు.
భర్త జోగన్న ధనం, దానగుణం, సహకారం ఉన్నవారు, ఆయన రైతు బిడ్డ. సీతమ్మ చేసే గొప్ప పనికి ఆయన నిత్యం చేతోడు గా ఉండేవారట. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే, ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం లో ఆ పరమాత్మను చూసుకోవడం. వచ్చింది ఎంతమందైనా, వారికి ఎంతో ఆదరణ తో అతిధి మర్యాదలు చేయడం, ఒంటి చేత్తో వండి వడ్డించడం. ఉదారమైన జోగన్న, సీతమ్మ దంపతులు చేసే ఆ గొప్ప అన్నదానం ఆ నోట ఈ నోట ఆ లంక గ్రామాల్లో పాకింది. పై వూరి నుండి పొలం పనులకు, కూలి పనులకు వచ్చే వాళ్ళు, ఊరి మీదుగా వెళ్ళే ప్రయాణికులు సీతమ్మ గారింట ఆదరణ పొందేవారు. ఊరిని వరదలు ముంచేసిన రోజుల్లో కూడా వారి ఇల్లు ఆన్నాలయం గా మారి ఎందరికో దిక్కయ్యింది. నిలువ నీడలేని అభాగ్యులకు నిరాటంకంగా సంవత్సరాల పాటు భోజన వసతులు కల్పించాఋ ఆ పుణ్య దంపతులు. అంతటి ఔదార్యం... వారి మానవతా విలువలు ఎందరో నాయకుల్ని కూడా కదిలించి వేసింది .
ఉత్తరాలు కూడా సరిగా లేని రోజుల్లో సీతమ్మగారి పేరు భారత దేశమంతటా వ్యాపించింది. మహిళలకే గర్వకారణం గా మారిన ఆ తల్లి సీతమ్మ పేరు ఇంగ్లాండు వరకు వినిపించింది. ఆమె గొప్ప మాతృత్వ విలువలకు మెచ్చిన ఇంగ్లాండు ప్రభుత్వం ఆమెను సత్కరించుకోవాలని తపన పడింది. ఆ నిరాడంబర మహా ఇల్లాలు సీతమ్మ తాను చేసే పని సత్కారాలకోసం కాదని నిరాకరించింది. ఇంగ్లాండు ప్రభుత్వo ఆమె చిత్రాన్నైన తీసుకు రమ్మని ఆ ఊరి అధికారిని పంపింది. ఆ అధికారి తన ఉద్యోగం పోకుండా కాపాడమని అనగా ఫోటో కు అంగీకరించారట. అక్కడ కట్టిన ఓ కాలువకు ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరిట నామకరణం చేసి గౌరవిందుకుంది.
"ఇక చాలమ్మా అని పుచ్చుకునే వారు అనే దానం అన్నదానమొక్కటే"
అన్ని దానాల్లోకేల్ల అన్నదానం మిన్న అనే సంకల్పం - చివరి రోజుల దాకా ఆమె అన్నం పెట్టడం లోనే ఆనందాన్ని పొందింది, తనకున్న వనరులతో కొన్ని లక్షల మందికి అన్నార్తి ని తీర్చిన చిరస్మరణీయురాలు సీతమ్మ. మానవీయతకు, నిస్వార్ధతకు, నిరాడంబరమైన జీవన శైలికి, అన్నిటికి మించి ఆమె దాన గుణశీలతకు ఎప్పటికి తెలుగు నేల రుణపడే ఉంటుంది.
ఆమె గూర్చి పాఠాల్లో చదువుకున్న మన తల్లిదండ్రులు ధన్యులు! ఆమె గూర్చిన ఈ నాలుగు మాటల్లో నుండి ఇంతైనా స్పూర్తి నిండిన వారుంటే, ఈసారి నుండి ఆకలి అని అన్న వారిని మీరు చూసే ప్రతి సారి డొక్కా సీతమ్మ గారు గుర్తు వస్తారు, ఆమె చేసిన గొప్ప దానశీలత గుర్తొస్తుంది. ఆకలి తో ఉన్నవారికి అన్నం పెట్టడం అనేది, అది స్వయంగా చేస్తే ఉండే తృప్తే వేరు.....!