A Real Life Love Story Documented In A Girl’s Diary. Will They Meet Or Not? Episode-2

Updated on
A Real Life Love Story Documented In A Girl’s Diary. Will They Meet Or Not? Episode-2

Contributed By Pranaya

Episode - 2 (Total - 5)

మనసులో ఎదో తెలియని ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తున్నాను. కానీ ఆ అమ్మాయి ని ఎలా కనిపెట్టాలి.? కథను ఎలా పూర్తి చేయాలి.? అసలు ఆ డైరీ లో ఉన్నది కల్పితమా.? నిజంగా జరిగిందా.? ఇలా చాలా ప్రశ్నలు నా మైండ్ లో తిరుగుతున్నాయి. తిరిగి ఇంటికొచ్చిన నన్ను ఒక్కమాట కూడా అనలేదు అమ్మ నాన్న. వాళ్ళ మౌనం నాకు అర్థం అయింది. ఎదో ఒకరోజు నన్ను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం.

ఒక్క పేరు తప్ప ఇంకేం తెలియదు. సో అందరిలానే ఫేస్బుక్ లో వెతకడం మొదలుపెట్టాను. కొన్ని వందల ప్రొఫైల్స్ వచ్చాయ్. ఇన్ని వందల ప్రొఫైల్స్ లో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవడం. అన్ని ప్రొఫైల్స్ ఒక్కోటి ఓపెన్ చేసి చూడటం మొదలుపెట్టాను. అర్ధరాత్రి దాటింది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎయిర్పోర్ట్ లో ఆ డైరీ ని చూసిన క్షణం తలచుకున్నాను. నెక్స్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే వన్ మ్యూచువల్ ఫ్రెండ్ అని కనిపించింది. అలసి ఉన్న నా కళ్ళు ఒక్కసారిగా కింద ఉన్న లైన్స్ చదవగానే నేను వెతుకుతున్న అమ్మాయి దొరికిందనిపించింది.

"ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం మరియానా ట్రెంచ్ అని మనిషి కనిపెట్టగలిగాడు కానీ అంతకంటే లోతైనది ఆడదాని మనసు అని అతను అర్థం చేసుకోలేకపోయాడు."

ఆలస్యం చేయకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. రెండు రోజులు గడచినా రెస్పాన్సె లేదు. మెసేజ్ పెట్టాను. నో రిప్లై. ఏ డిటైల్స్ లేకపోవడంతో మ్యూచువల్ ఫ్రెండ్ అయిన శ్రీను కి మెసేజ్ చేసాను ఒకసారి మాట్లాడాలని. జరిగిందంతా చెప్పాను. ఎలా అయినా అన్షు ( నేను తనకి పెట్టుకున్న పేరు) గురించి కనుక్కోమని చెప్పాను.

వారం గడిచింది శ్రీను నుండి ఎలాంటి మెసేజ్ లేదు. వారం కాస్త నెల అయింది. మెల్లిగా ఆశలు పోతున్న సమయంలో శ్రీను నుండి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి శ్రీను కాలేజ్. 2013 ఇంజినీరింగ్ పాస్ ఔట్. ఎలక్ట్రానిక్స్స్ బ్రాంచ్. శ్రీనుది మెకానికల్. ఇపుడు తను ఎక్కడున్నది ఎం చేస్తున్నది తెలియలేదు. కానీ తన ఫ్రెండ్ గురించి తెలిసింది. మౌనిక తన పేరు. శ్రీను క్లాస్ మెట్. మౌనిక అన్షు కాలేజ్ క్యాంపస్ హాస్టల్ లో తన రూమ్మేట్. ఇపుడు విజయవాడలో ఉంటుంది. తనని కలిస్తే అన్షు గురించి తెలియోచ్చని విజయవాడ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను.

నా జీవితం లో ఎన్నో ప్రయాణాలు చేసాను కానీ ఈ ప్రయాణం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అసలు అర్జున్ అన్షు ఎందుకు విడిపోయారు. నేను డైరీ లో చదివింది ఒక కల్పితమైన కథ లాగా మిగిలిపోతుందా. లేక జరిగిన కథగా కొత్త మలుపు తిరుగుతుందా. కాలమే నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి.

మౌనిక ని కలిసి నా దగ్గర ఉన్న అంశు డైరీ ని తీసి చూపించి జరిగిందంతా చెప్పాను. నేను అన్షు అర్జున్ ల ప్రేమ కథని రాయాలనుకుంటున్న సంగతి చెప్పి దానికి తన సహాయం అడిగాను. తను వెంటనే లోపలికి వెళ్ళి నా చేతిలో ఉన్న డైరీ లాగే ఉన్న ఇంకో డైరీ తీసుకొచ్చింది. నేను వెంటనే ఆ డైరీ తీసుకొని ఇది ఎవరి డైరీ అనగానే "అన్షు ది" అంది.

"అన్షు చాలా తెలివైనది, చాలా సున్నితమైన స్వభావం తనది, ఎక్కువగా మాట్లాడేది కాదు, అబ్బాయిలకి దూరంగా ఉండేది. అప్పుడే అర్జున్ పరిచయం అయ్యాడు. అర్జున్ అంటే అన్షు కి చాలా ఇష్టం. అందుకే అర్జున్ ఎన్ని సార్లు కోప్పడిన ఎంత తిట్టిన తనని వదులుకోలేదు. ఆఖరిసారి అన్షు నన్ను 10 మే 2018 కలిసింది. అర్జున్ ని కలవడానికి బెంగుళూరు వెళ్తున్నానని చెప్పింది. ఒక వారం తర్వాత నేనే తనకి కాల్ చేసాను కానీ ఫోన్ కలవలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించాను కానీ ఎవరూ ఫోన్ తీయలేదు. ఇప్పుడు తను ఎక్కడుందో తెలియదు." అని చెప్పింది.

అయితే నేను అనుకున్నదే నిజం. ఆ డైరీ లో కథ కల్పితం కాదు. అది అన్షు ప్రేమ కథ అని అర్థం అయింది. చిన్న చిరునవ్వు నా పెదవులను తాకింది.

"మీకు అన్షు అర్జున్ ని ఎంతగా ప్రేమించిందో నేను చెప్పడం కంటే ఈ డైరీ లో తను రాసుకున్న ప్రతి అక్షరం చెప్తుంది. ఈ డైరీ అన్షు బెంగళూరు వెళ్లే ముందు నాకు ఇచ్చింది. ఒకవేళ అర్జున్ తనని కలవడానికి రాకపోతే ఈ డైరీ ని అర్జున్ కి చేరేలా చూడమంది. కానీ అర్జున్ ఇపుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. బెంగుళూరు లో జాబ్ చేసేవాడని తెలుసు, కానీ ఇపుడు అక్కడ లేడు. జాబ్ వదిలేసాడని తెలిసింది. సో ఈ డైరీ నా దగ్గరే ఉండిపోయింది." అని నా చేతిలో పెట్టింది.

(ఇంకా ఉంది, మళ్ళీ రేపు ఇదే టైముకి)