ఎలా ఉన్నావోయ్ ? ఓహ్ ఈ ప్రశ్న అప్రస్తుతం కదూ....నువ్ బావుంటే నేనెందుకు వస్తాను.....నేనొచ్చానంటే నువ్వేదో బాధలో ఉన్నట్టే కదా....ఇంతకీ నేనెందుకు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానో చెప్పలేదు కదా...ఏమీ లేదోయ్...నిన్ను నేను గెలిచాను...నా చేతిలో నిన్ను ఓడించాను.ఎలాగో తెలుసునా?? నేను రాక మునుపు నువ్వు ఎలా ఉండేవాడివో గుర్తుందా...ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో..అప్పట్లో ఏదైనా సాదిస్తాను,ప్రపంచాన్నే శాశిస్తాను,నా లక్ష్యం కోసమే శ్వాసిస్తాను అనే వాడివి,ఇప్పుడు చూడు పూర్తిగా డీలా పడిపోయి నీ ఊపిరి నువ్వు తీసుకోడానికి కూడా కష్టపడుతున్నావ్. నీకు ఎదురే లేదు అన్నట్లు ధైర్యంగా ఉండేవాడివి,నీ ఎదుగుదలను ఆపే అడ్డే లేదు అని ధీమాగా ఉండేవాడివి.ఇప్పుడేమో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావు,భయంతో రోజులు వెళ్లదీస్తున్నావు.నీ నుండి నీ నవ్వుని దూరం చేశాను.నిన్ను నలుగురిలో నవ్వులపాలు చేశాను.నీ ప్రయాణాన్ని ఆపేశాను,నీ గమ్యం ఎంటో నీకే తెలియకుండా చేశాను.నిన్ను అయోమయంలోకి నెట్టేశాను.అసలు నువ్వు ఎంటో నీకే గుర్తు లేకుండా చేశాను.నీ వాళ్ళ నుండి దూరం చేశాను....ఇవన్నీ చేసింది నేనేగా...నిన్ను కుంగదీశాను,నిన్ను కిందకి లాగేశాను,నీకు పరాజయాన్ని, పరాభవాన్ని పరిచయం చేశాను.అంటే నేను గెలిచినట్లే కదా...నా గెలుపుని నీతో పంచుకుందామని వచ్చాను...నాకు మాత్రం ఎవరున్నారు నువు తప్ప,నీకు మాత్రం ఎవరున్నారు నేను తప్ప.భలే మజాగా ఉందోయ్ నిన్ను ఓడించినందుకు.
ఏంటీ కోపం వస్తుంది కదూ....నాకేగనక రూపం,ప్రాణం ఉంటే నన్ను కసితీరా చంపేయాలనేంత కోపం వస్తుంది కదూ.హాహాహహ..నీ ఆవేశం నేను అర్దం చేసుకోగలనులే...సరే కాసేపు ఆ కోపం పక్కన పెట్టు,నేను చెప్పేది సావధానంగా ఆలోచించు.
ఏమోయ్ నీకూ నాకూ ఏమైనా విరోధం ఉందా..ఏవైనా పాత పగలు ఉన్నాయా ...నేనెందుకు నీకు కీడు చేస్తాను,నువ్వు ఓడిపోతే నాకేమొస్తుంది?నువు నైరాశ్యంలో మునిగిపోతే చూసి నవ్వుకునేంత క్రూర స్వభావం కాదోయ్ నాది..నీ జీవితంలోకి నేను రావడం వల్ల నీకు అన్నీ చెడు,చేదు అనుభవాలే ఎదురయ్యాయి అని అనుకుంటున్నావే కానీ వాటి వల్ల నీకు జరిగే మంచిని గుర్తించట్లేదు నువ్వు. ఇంతసేపు నేను చెప్పింది నీ దృష్టిలో(నీ పోయింట్ ఒఫ్ వ్యూ లో ) నా వల్ల నీకు జరిగిన నష్టం గురించి..ఇపుడు నా వర్షన్ కూడా విను...
ఇంత పెద్ద ప్రపంచం,ఇన్ని కోట్ల మండి జనాల మధ్య నేను నిన్నే ఎందుకు ఎంచుకున్నాను??? నువ్వో వీరుడివి ...నువ్వో యోధుడివి ...నిజంగా నువ్వు పుట్టినప్పటి నుండే వీరుడివి,నీ పుట్టుకే ఒక గెలుపు...
నువు వీరుడివి అనేసి,నిన్ను జీవితం అనే పద్మ వ్యూహం లోకి ఏ ఆయుధం లేకుండా పంపలేను కదా...నిన్ను సిద్దం చేయకుండా ఓ మహా సంగ్రామంలోకి నెట్టేయలేను కదా... అందుకే నిన్ను రాటు దేల్చాలనే నేను వచ్చాను.
నీకు గుర్తుందా నేను నీ జీవితంలోకి ఎప్పుడు వచ్చానో..నువు మొదటి సారి ఓడిపోయినప్పుడు...ఆరోజే నేను నీతో జత కట్టింది..ఆ ఓటమిని నువు తట్టుకోలేక పోయావు...ఒక్క ఓటమినే నువు తట్టుకోలేకపోతే,ఒక్క దానికే నువు ఇంతలా క్రుంగిపోతే ఎలా అనే,నీకు మరిన్ని ఓటములు పరిచయం చేశాను.ఇప్పుడు నీకు ఎలాంటి దారుణ పరాభవం ఎదురైన తట్టుకొని నిలబడే స్థితికి వచ్చావు...ఇది నా వల్లే.
నీ నుండి నీ నవ్వుని దూరం చేశాను,నీకు కన్నీళ్లు పరిచయం చేశాను అనుకుంటున్నావు – సరే నిజమే,నీ నవ్వులో నాకేదో వెలితి కనిపించిందోయ్.అందుకే నీకు కన్నీళ్లు పరిచయం చేశాను,రేపు నేను వెళ్లిపోయాక,నువు కోరుకున్న విజయం నీ దరికి చేరినపుడు,నీకే తెలియకుండా కంటి నుండి నీరు జారుతూ ఉన్నా పెదాల పై ఒక చిరునవ్వు వస్తుంది చూడు,ఆ స్వచ్ఛమైన చిరునవ్వు కోసమే నీకు కన్నీళ్లు పరిచయం చేశా
నిన్ను నలుగురికీ దూరం చేశాను,నవ్వుల పాలు చేశాను అనుకుంటున్నావు కదా ,లేదు నీకు కాని వారు ఎవరో తెలిసేలా చేశాను అంతే
అయోమయంలోకి నెట్టేసి,నీ బాట ఏమిటో తెలియకుండా చేశాను అనుకున్నావు కదూ,లేదు,నీకు నువ్వేంటో,నువ్వేంతో తెలుకునేలా చేశాను,ఆలోచించుకునేలా చేశాను,నీ బలం ఏమిటో,బలహీనతలు ఏమిటో నీకు తెలిసేలా చేశా,నీకు ఏది సరైనదో,ఎటు వైపుగా నువు నీ ప్రయాణం సాగించాలో తెలిసేలా చేశాను .. ఇదీ నా వల్లే.
నిన్ను కుంగదీశాను అన్నావు కదా,కాదు..కింద పడితే ఆ గాయం ఎలా ఉంటుందో చెప్పాను అంతే,ఇలాంటి గాయాలు ఇంకెన్ని వచ్చినా కూడా ఎదుర్కొనే బలాన్ని నీకు ఇచ్చాను నీకు పరాజయాన్ని పరిచయం చేశాను అన్నావు కదూ,లేదు మిత్రమా,ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నిన్ను సన్నద్ధం చేశాను అంతే… ఇదీ నా వల్లే.
నీకు అంధకారాన్ని పరిచయం చేసింది నువు వెన్నెలని ఆస్వాదిస్తావని,ఆ చీకటిలో ఒక చిరు దివ్వెవి అవుతావని,ఆ చిరు దివ్వే,ఒక కాగడాలా మారి ఆ చీకటిని పారద్రోలుతుంది అని, మరెంతో మందికి దారి చూపుతుంది అని నీకు ఆటుపోట్లు,అడ్డంకులు సృస్టించాను అన్నావు కదా ,జీవితం సాఫీగా సాగిపోయే ప్రయాణం కాదు నేస్తం,ఊహించని మలుపులు ఉంటాయి,ముళ్ళ బాటలెన్నో దాటాలి ఇలాంటివి అన్నీ నువు సులువుగా దాటుకుంటూ వెళ్లాలనే,నీకు అడుగడుగుకో ఆటంకం వచ్చేలా చేశాను.
ఈ లోకం దృష్టిలో నిన్నో పరాజితుడిలా నిలబెట్టాను అన్నావు కదా...నిజమే...ఎవరో ఒకరు అనాయాసంగా గెలిస్తే ఒక రోజు గుర్తు పెట్టుకుంటారు,నాలుగు రోజుల తరువాత మర్చిపోతారు.కానీ నీ ఉదాహరణ చూడు,నువ్వు ఓడిపోయావు ఇంక నీ పని అయిపోయింది,నువ్వు గెలవలేవు అని అందరూ అంటున్నారు,ఒక నిర్ధారణకే వచ్చేశారు.రేపటి రోజున నువు కోరుకున్న విజయం నీకు దక్కి తీరుతుంది.ఇది తద్యం,అప్పుడు నిన్ను నానా మాటలు అన్నవాళ్లే నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు.నిన్ను సందేహించిన వాళ్ళే,నీకు సన్మానాలు చేస్తారు...అప్పుడు నీ గెలుపు ఒక చరిత్ర అవుతుంది ..నువ్వొక పాఠంలా నిలిచిపోతావు....కొన్నేళ్ళ పాటు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు....ఇందుకే నేనిలా చేసింది...
ఏమిటీ నేను నిన్ను ఓడించానా ,నిన్ను ఓడించడం నా తరం కాదు నేస్తం...నీకు ఇన్ని సవాళ్ళు ఎదురయ్యేలా చేసినా నువ్వు ఇంకా మొక్కవోని పట్టుదలతో,సడలని ఆత్మ స్థైర్యంతో నిల్చున్నావు చూడు....అక్కడే నేను ఓడిపోయాను... గర్వంగా ఉంది నేస్తం,నీ చేతిలో ఓడిపోయినందుకు,నేను నిన్ను ఎలా చూడాలి అనుకున్నానో అలా చూస్తున్నాను ఇప్పుడు,నిన్ను ఎలా మార్చాలి అనుకున్నానో అలా మార్చేశాను..నా పని పూర్తయ్యింది...ఒక వీరుడి చేతిలో ఓడిపోయినందుకు మహా గర్వంగా ఉంది....మిత్రమా...ఈ రోజు నన్ను జయించావు,రేపు ఈ ప్రపంచాన్ని జయిస్తావు...ఇక నేను వెళ్తాను....మళ్ళీ రాను...ఎందుకంటే నీ జీవితంలో నిరాశ అనే నన్ను ఇంకేప్పటికీ రానివ్వవు,నన్ను నీ దరి చేరనివ్వవు.....వెళతాను మరి....సెలవు